ఐపీఎల్ 2026 సీజన్ అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టానికి చేరుకుంది. న్యూ చండీగఢ్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్ల మధ్య హై-వోల్టేజ్ ఎలిమినేటర్ మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. ఈ చావో రేవో పోరులో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పిచ్ చేజింగ్‌కు అనుకూలంగా ఉండటం, గత కొన్ని మ్యాచ్‌లుగా తమ జట్టు మంచి క్రికెట్ ఆడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిన్స్ తెలిపాడు. ఒత్తిడిని పక్కన పెట్టి, బౌలింగ్‌ను వీలైనంత సరళంగా ఉంచుతూ ప్రత్యర్థిని కట్టడి చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు.
మరోవైపు టాస్ ఓడిపోయిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. తాము కూడా టాస్ గెలిస్తే మొదట బౌలింగే ఎంచుకునేవాళ్లమని చెప్పాడు. ఈ గ్రౌండ్‌లో తాము గతంలో లక్ష్యాలను ఛేదించడంతో పాటు డిఫెండ్ కూడా చేసుకున్నామని, కాబట్టి మొదట బ్యాటింగ్ చేయడం పెద్ద సమస్య కాదన్నాడు. తాను పూర్తి ఫిట్‌నెస్‌తో లేకపోయినా జట్టు కోసం ఆడుతున్నానని, ప్లేయర్స్ అందరూ తమ పూర్తి సామర్థ్యం మేరకు రాణిస్తే విజయం సాధించడం కష్టమేమీ కాదని పరాగ్ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్ కోసం రాజస్థాన్ జట్టులోకి సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తిరిగి రాగా, శివమ్ దూబే ఇంపాక్ట్ ప్లేయర్‌గా అందుబాటులో ఉన్నాడు. అలాగే హైదరాబాద్ జట్టులోకి ప్రఫుల్ హింజ్ తిరిగి వచ్చాడు. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది కాబట్టి ఇరు జట్లూ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.
ఇరు జట్ల తుది ఆటగాళ్ల వివరాలు..
రాజస్థాన్ రాయల్స్ (RR): యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్ (కెప్టెన్), డోనోవన్ ఫెరీరా, దసున్ శనక, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, బర్గర్, బ్రిజేష్ శర్మ, యశ్ రాజ్ పుంజా.
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH):
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హైదరాబాద్ జట్టులో ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, అబ్దుల్ సమద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, టి. నటరాజన్, మయాంక్ మార్కండే, ప్రఫుల్ హింజ్ బరిలోకి దిగుతున్నారు.
