Site icon NTV Telugu

IPL 2025: నేటి నుంచే ఐపీఎల్‌ పునః ప్రారంభం.. ఆర్సీబీ, కేకేఆర్ మధ్య మ్యాచ్! కోహ్లీపైనే అందరి దృష్టి

Rcb Vs Kkr

Rcb Vs Kkr

భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2025 నేడు పునః ప్రారంభం కానుంది. చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7.30కు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ), కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్) మధ్య ఆరంభం కానుంది. సొంతగడ్డపై జరగనున్న ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఆర్సీబీ అధికారికంగా ప్లేఆఫ్స్‌కు దూసుకెళుతుంది. ప్లేఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న కోల్‌కతాకు ఈ మ్యాచ్‌లో విజయం తప్పనిసరి. ఇరు జట్లకు విజయం తప్పనిసరి కాబట్టి.. మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి.

భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ 2025కు బ్రేక్‌ పడడంతో చాలామంది విదేశీ ఆటగాళ్లు స్వదేశాలకు వెళ్లిపోయారు. వెళ్లిన వాళ్లలో జాతీయ విధుల కారణంగా అందరూ తిరిగి రాలేకపోయారు. అయితే ఈ విషయంలో ఆర్సీబీ చాలా లక్కీ అనే చెప్పాలి. దాదాపు అందరు విదేశీ ప్లేయర్స్ అందుబాటులోకి వచ్చారు. స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్‌ రావడం పక్కా అయినా.. ప్రస్తుతం ఆర్సీబీతో చేరిందీ లేనిదీ స్పష్టత లేదు. ఆల్‌రౌండర్‌ జాకబ్ బెతెల్‌ అందుబాటులో లేకుండా పోయాడు. ఫీల్ సాల్ట్, లుంగి ఎంగిడి, టీమ్ డేవిడ్, లియామ్ లివింగ్‌స్టన్, షెఫర్డ్‌ ఆర్సీబీ జట్టుతో చేరారు. గాయంతో బాధపడుతున్న కెప్టెన్‌ రజత్‌ పాటీదార్‌ కోలుకోవడం ఆర్సీబీకి ఉపశమనమే. ఇక టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన విరాట్‌ కోహ్లీపై అందరి దృష్టీ నెలకొంది.

Also Read: AP Rains Today: నేడు ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు!

ఆర్సీబీతో మ్యాచ్‌ కోల్‌కతాకు చావోరేవో. ఓడితే ప్లేఆఫ్స్‌ ఆశలు గల్లంతే. కేకేఆర్ జట్టు మొయిన్‌ అలీ సేవలను కోల్పోయింది. అయితే నరైన్, రసెల్, గుర్బాజ్‌ లాంటి టాప్ ఆటగాళ్లు అందుబాటులోనే ఉన్నారు. కెప్టెన్ రహానే రాణిస్తుండడం కలిసొచ్చే అంశం. కోట్లు పెట్టి కొనుగోలు చేసిన వెంకటేష్ అయ్యర్ రాణించాల్సిన అవకాశం ఉంది. 12 మ్యాచ్‌ల్లో 11 పాయింట్లు ఖాతాలో ఉన్న కోల్‌కతా.. మిగతా రెండు మ్యాచులలో గెలిచినా అవకాశాలు తక్కువే అనే చెప్పాలి. ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించొచ్చు.

Exit mobile version