NTV Telugu Site icon

INDWvsENGW: టాస్ గెలిచిన భారత్.. ఇంగ్లాండ్ బ్యాటింగ్

Aaa

Aaa

మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో అదరగొట్టిన హర్మన్‌సేన కీలకమైన మూడో సమరం కోసం సిద్ధమైంది. లీగ్‌ దశలో ఇంగ్లాండ్‌తో జరిగే మూడో టీ20లో విజయం సాధిస్తే భారత్‌ నేరుగా సెమీస్‌ బెర్తును ఖరారు చేసుకొనే వీలుంది. ఓడితే మాత్రం చివరి అవకాశంగా ఐర్లాండ్‌పై తప్పకుండా గెలవాల్సి ఉంటుంది. మరోవైపు పాక్‌ విజయాలపైనా భారత్‌ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. అందుకే, ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా సెమీస్‌కు చేరుకోవాలంటే ఇంగ్లాండ్‌పై భారత్‌ గెలవాల్సిందే. తొలి రెండు మ్యాచుల్లో అద్భుతంగా రాణించిన భారత్‌కు ఇది పెద్ద కష్టమేం కాదు. మరోవైపు ఇంగ్లాండ్‌ కూడా రెండు విజయాలతో సెమీస్‌ బెర్తు కోసం ముందు వరుసలో ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన ఇండియా బౌలింగ్ ఎంచుకుంది.

బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌లపై భారత్‌ సమష్ఠిగా ఆడుతూ విజయాలు సాధించింది. అయితే స్టార్‌ ఓపెనర్ స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్‌ గత మ్యాచ్‌ల్లో తమ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వడంలో విఫలం కావడం ఆందోళనకు గురి చేసే అంశం. మరో ఓపెనర్ షెఫాలీ వర్మ, కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌, రిచా ఘోష్‌ మాత్రం అదరగొట్టేశారు. అందుకే టాపార్డర్‌లో జెమీమా, స్మృతీ పట్టుపడితే మాత్రం భారత్‌ విజయాన్ని ఆపడం కష్టం. ఇక బౌలింగ్‌లో దీప్తి శర్మ ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెడుతోంది. ఇప్పటికే టీ20ల్లో వంద వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఆమెకు తోడుగా రేణుకా సింగ్, పూజా వస్త్రాకర్‌ మద్దతుగా నిలుస్తున్నారు. ఇకపోతే, ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో వరుసగా రెండు విజయాలను నమోదు చేసిన ఇంగ్లాండ్‌ను తక్కువగా అంచనా వేయలేం. సోఫీ డంక్లే, నటాలియా సీవర్, కెప్టెన్‌ హీథర్ నైట్‌, ఎలిస్ క్యాప్సే మంచి ఫామ్‌లో ఉన్నారు. విండీస్‌పై తొలి మ్యాచ్‌లో 138 పరుగుల లక్ష్య ఛేదనను 15 ఓవర్లలోపే ఛేదించేసింది. ఎటాకింగ్‌ గేమ్‌ ఆటడంలో ఇంగ్లాండ్‌ దిట్ట. భారత బౌలర్లు ఏమాత్రం అవకాశం ఇచ్చినా దంచి కొట్టేస్తారు.

భారత జట్టు: స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ ప్రీత్‌ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), శిఖా పాండే, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా సింగ్‌

ఇంగ్లాండ్ జట్టు: సోఫీ డంక్లే, డేనియల్ వ్యాట్, అలైస్ క్యాప్సే, నటాలియా సీవర్, హీథర్ నైట్ (కెప్టెన్), అమీ జోన్స్ (వికెట్ కీపర్), కేథరీన్ సీవర్, సోఫీ ఎక్లెస్టోన్, చార్లొ్ట్టే డీన్, సారా గ్లెన్, లౌరెన్ బెల్

Show comments