IndiGo Hikes Front Row Window Seat Price: ప్రముఖ విమానయాన సంస్థ ‘ఇండిగో’ సీట్ల ఎంపిక ఛార్జీలను పెంచింది. ప్రయాణికులు తమ సీట్లను ఎంపిక చేసుకునేందుకు ఇకనుంచి ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఇండిగో విమానాల్లో ఎక్కువ లెగ్ రూమ్ ఉండే ముందు సీట్ల ఎంపిక కోసం ప్రయాణికులు దాదాపు రూ. 2000 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. వెనుక సీట్లకు సీటు ఎంపిక ధరను బేస్ ఛార్జీకి అదనంగా రూ. 75గా నిర్ణయించారు. నివేదికల ప్రకారం.. కంపెనీ గత వారం వెబ్‌సైట్‌లో మార్పులు చేసింది. అయితే దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు.
ఇండిగో వెబ్‌సైట్ ప్రకారం.. 232 సీట్లు ఉండే ఎయిర్‌బస్ A321 విమానంలో ముందు వరుసలోని విండో లేదా నడవా సీటు ఎంపిక కోసం రూ. 2000 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. మధ్య సీటుకు అయితే రూ. 1500 చెల్లించాలి. A321 (222 సీట్స్, A320 విమానాలకూ ఇదే ఛార్జీలు వర్తిస్తాయట. ఏటీఆర్ విమానాల్లో మాత్రం సీటు ఎంపిక ఛార్జీ రూ. 500 వరకు ఉంది. విమానయాన విశ్లేషకుడు అమేయ జోషి ఛార్జీల పెంపును ధ్రువీకరించారు. అదనపు లెగ్‌రూం ఉండే సీట్ల కోసం ఇండిగో రూ. 2000 వరకు చార్జ్ చేస్తున్నట్లు తెలిపారు. గతంలో ఇది రూ. 1500 వరకు ఉండేదని చెప్పారు.
Also Read: Ayodhya Ram Mandir: అయోధ్యలో రామయ్య ఊరేగింపు రద్దు.. కారణం ఏంటంటే?
ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్న ఇంధన ఛార్జీని ఉపసంహరించుకున్నట్లు ఇండిగో ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో టికెట్ల ధరలు కనిష్ఠంగా రూ. 300 వరకు తగ్గాయి. సుదూర మార్గాల్లో రూ. 1000 వరకు తగ్గినట్లు సమాచారం. ఇటీవలి కాలంలో విమాన ఇంధన ధరలు తగ్గిన నేపథ్యంలో.. 2024 జనవరి 4 నుంచి ఇంధన ఛార్జీని ఇండిగో ఉపసంహరించుకుంది. ఇక దేశీయ విమానయాన సంస్థ ఇండిగో దాదాపు 60 శాతం మార్కెట్ హోల్డింగ్‌ను కలిగి ఉంది.