Indian Railways Special Trains: దసరా, దీపావళికి ఊరెళ్లే వారికి గుడ్‌న్యూస్.. రైల్వే కీలక ప్రకటన.. రేపటి నుంచే స్టార్ట్..!

Train

Train

Indian Railways Special Trains: పండుగ సీజన్‌లో ఊరు వెళ్లేవారు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చేసింది.. ఎందు కంటే.. పండుగ సమయంలో ట్రావెల్స్‌ ఇబ్బందులు తప్పించుకోవాలంటే.. కాస్త జాగ్రత్త పడాల్సిందే.. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. సోలాపూర్ డివిజన్ పరిధిలోని వివిధ మార్గాల్లో మొత్తం 102 ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లకు సెప్టెంబర్ 27 నుంచి అంటే రేపటి నుంచే బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. ముంబై, చెన్నై, లాతూర్, కొల్హాపూర్, కలబురగి వంటి ప్రధాన నగరాల మధ్య ప్రయాణించే వారికి ఇవి అదనపు సౌకర్యాన్ని కల్పించనున్నాయి.

ముంబై-చెన్నై మధ్య ప్రత్యేక రైళ్లు

సీఎస్‌ఎంటీ ముంబై-చెన్నై వీక్లీ స్పెషల్ రైలు ఆరు ట్రిప్పులు నడవనుంది. అక్టోబర్ 14 నుంచి నవంబర్ 18 వరకు ప్రతి బుధవారం తెల్లవారుజామున 12:35 గంటలకు ముంబై నుంచి బయలుదేరి అదే రోజు రాత్రి 11:30 గంటలకు చెన్నై చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో చెన్నై-సీఎస్‌ఎంటీ ముంబై స్పెషల్ రైలు అక్టోబర్ 15 నుంచి నవంబర్ 19 వరకు ప్రతి గురువారం ఉదయం 4 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4 గంటలకు ముంబై చేరుకుంటుంది. ఈ రైళ్లకు దాదర్, థానే, కళ్యాణ్, లోనావాలా, పుణే, దౌండ్, కుర్దువాడి, షోలాపూర్, కలబురగి, వాడి, రాయచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రేణిగుంట, అరక్కోణం, పెరంబూరు స్టేషన్లలో స్టాప్‌లు ఉంటాయి.

ముంబై-లాతూర్ మధ్య 26 ట్రిప్పులు

ముంబై-లాతూర్ మధ్య ప్రయాణికుల కోసం వారానికి రెండుసార్లు ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. అక్టోబర్ 13 నుంచి నవంబర్ 24 వరకు ప్రతి మంగళవారం, గురువారం ఈ రైలు నడుస్తుంది. ముంబై నుంచి లాతూర్‌కు 13 ట్రిప్పులు, తిరుగు ప్రయాణంలో మరో 13 ట్రిప్పులు కలిపి మొత్తం 26 ట్రిప్పులు ఉంటాయి. సీఎస్‌ఎంటీ ముంబై నుంచి మధ్యాహ్నం 12:35 గంటలకు బయలుదేరే రైలు మరుసటి రోజు ఉదయం 11:40 గంటలకు లాతూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో లాతూర్ నుంచి సాయంత్రం 4:30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4:10 గంటలకు సీఎస్‌ఎంటీ ముంబై చేరుకుంటుంది. ఈ రైళ్లకు దాదర్, థానే, కళ్యాణ్, లోనావాలా, పుణే, ఉరులి, దౌండ్, భగ్వాన్, జెజురి, కుర్దువాడి, బార్షి టౌన్, ధరాశివ్, హారంగుల్ స్టేషన్లలో స్టాప్‌లు ఉంటాయి.

కొల్హాపూర్-కలబురగి మధ్య 64 ట్రిప్పులు

కొల్హాపూర్-కలబురగి మధ్య కూడా 64 ట్రిప్పులతో ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. అక్టోబర్ 10 నుంచి నవంబర్ 15 వరకు శుక్రవారాలు మినహా ప్రతిరోజూ ఈ రైళ్లు నడుస్తాయి. కొల్హాపూర్ నుంచి ఉదయం 6:10 గంటలకు బయలుదేరి సాయంత్రం 4:10 గంటలకు కలబురగి చేరుకుంటుంది. ఈ దిశలో 32 ట్రిప్పులు ఉంటాయి. తిరుగు ప్రయాణంలో కలబురగి నుంచి సాయంత్రం 6:10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5:40 గంటలకు కొల్హాపూర్ చేరుకుంటుంది. ఈ దిశలోనూ 32 ట్రిప్పులు నడుస్తాయి. ఈ ప్రత్యేక రైళ్లకు హత్కంగలే, జైసింగ్‌పూర్, మిరాజ్ జంక్షన్, ఆర్గ్, బెలంకి, సుల్గారే, కవాతే మహంకల్, లంగర్‌పేత్, ధల్‌గావ్, మ్హసోబా డోంగర్‌గావ్, జావలే, వాసుద్, సంగోలా, పంఢర్‌పూర్, మోడ్నింబ్, కుర్దువాడి జంక్షన్, షోలాపూర్, కలబురగి జంక్షన్ స్టేషన్లలో స్టాప్‌లు ఉంటాయి.

అయితే, పండుగల సమయంలో సాధారణ రైళ్లపై పెరిగే రద్దీని తగ్గించడంతో పాటు, స్వస్థలాలకు వెళ్లే ప్రయాణికులకు అదనపు రైలు సదుపాయం కల్పించడమే ఈ ప్రత్యేక రైళ్ల ఉద్దేశ్యం. ప్రయాణికులు సెప్టెంబర్ 27వ తేదీ నుంచి అంటే రేపటి నుంచే బుకింగ్స్ చేసుకోవచ్చు.. మరి ఎందుకు ఆలస్యం.. పండుగకు ఊరు వెళ్లడానికి వెంటనే టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు..