Indian Players Worked As Coaches For Other Countries: ఏ ఆటలో అయినా సరే జట్టు పరంగా విజయం సాధించాలంటే.. కచ్చితంగా ఆ టీంకి కోచ్ తప్పనిసరిగా కావాలి. భారతదేశానికి చెందిన అనేకమంది ఆటగాళ్లు విదేశాలలో కొన్ని జట్లకు కోచ్ లుగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే భారతదేశంలో బాగా క్రేజ్ ఉన్న ఆటలలో మొదటి ఆట క్రికెట్. అయితే, టీమిండియా మాజీ ఆటగాళ్లు వేరే దేశాల క్రికెట్ జట్లకి కోచింగ్ చేశారన్న విషయం చాలామందికి తెలియదు. అయితే ఏ టీమిండియా మాజీ ఆటగాడు ఏ దేశానికి కోచింగ్ ఇచ్చాడో ఓసారి చూద్దామా..
అజయ్ జడేజా:
మాజీ బ్యాట్స్‌మెన్ అజయ్ జడేజా భారత్ తరఫున 15 టెస్టులు, 196 వన్డేలు ఆడాడు. క్రికెట్ నుండి రిటైర్మెంట్ తర్వాత, జడేజా ODI ప్రపంచ కప్ 2023 కోసం ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా నియమించబడ్డాడు. భారత్‌లో జరిగిన ఆ టోర్నీలో ఇంగ్లండ్, పాక్ జట్లపై అఫ్ఘాన్ జట్టు మంచి ప్రదర్శన చేసింది.
సందీప్ పాటిల్:
భారత మాజీ క్రికెటర్ సందీప్ పాటిల్ 1983లో వన్డే ప్రపంచకప్ ను భారత్‌కు అందించాడు. అతను తన విజయవంతమైన క్రికెట్ కెరీర్ తర్వాత కెన్యా క్రికెట్ జట్టుకు కోచ్‌గా కూడా పనిచేశాడు. అతని పర్యవేక్షణలో కెన్యా జట్టు 2003లో ఆడిన ODI ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్‌కు చేరుకోవడంలో విజయం సాధించింది. కోచింగ్‌తో పాటు ఆయన బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌గా కూడా పనిచేశారు .
శ్రీధరన్ శ్రీరామ్:
2000 సంవత్సరంలో శ్రీధరన్ శ్రీరామ్ నాగ్‌పూర్‌లో దక్షిణాఫ్రికాపై అంతర్జాతీయ వన్డే అరంగేట్రం చేశాడు. భారత్ తరఫున 8 వన్డేలు ఆడాడు. దీని తర్వాత, భారత మాజీ ఆల్ రౌండర్ శ్రీరామ్ ఆస్ట్రేలియా జట్టుతో 6 సంవత్సరాలు పనిచేశాడు. 2016లో డారెన్ లెమాన్ పదవీకాలంలో స్పిన్ కోచ్ గా నియమితులైనప్పటి నుండి శ్రీరామ్ ఆస్ట్రేలియా కోచింగ్ సెటప్‌లో కీలక వ్యక్తిగా ఉన్నారు. 2022లో ఆస్ట్రేలియా జట్టు నుంచి తప్పుకున్నాడు.
రాబిన్ సింగ్:
మాజీ ఆల్ రౌండర్ రాబిన్ సింగ్ భారత్ తరఫున కేవలం ఒక టెస్టు, 136 వన్డే మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. అతను భారత అండర్-19 క్రికెట్ జట్టుతో తన కోచ్ కెరీర్‌ను ప్రారంభించాడు. 2004లో, అతను హాంకాంగ్ జట్టుకు కోచ్ అయ్యాడు. ఆపై అతను ఈ జట్టును ఆసియా కప్‌కు అర్హత సాధించేలా కృషి చేసాడు. అంతర్జాతీయ కోచింగ్ అనుభవంతో పాటు, అతను IPL సహా ప్రపంచంలోని అన్ని T20 లీగ్ లలో కోచ్‌గా పనిచేశాడు.
లాల్‌చంద్ రాజ్‌పుత్:
లాల్‌చంద్ రాజ్ పుత్ భారత్ తరఫున 2 టెస్టులు, 4 వన్డేలు ఆడాడు. అతను 1985 నుండి 1987 వరకు భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. బ్యాట్స్‌మెన్‌గా క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత కోచింగ్‌లో తన కెరీర్‌ను మార్చుకున్నాడు. అతను 2016 – 2017లో ఆఫ్ఘనిస్తాన్, ఆ తర్వాత జింబాబ్వే 2018 – 2022లో ప్రధాన కోచ్‌గా పనిచేశాడు. ప్రస్తుతం ఈయన యూఏఈ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. అతను 2024లో ఈ జట్టుతో 3 సంవత్సరాల ఒప్పందం కుదుర్చుకున్నాడు.
