NTV Telugu Site icon

T20 World Cup 2024: భారత అభిమానులకు గుడ్‌న్యూస్.. రోహిత్‌, కోహ్లీ రీఎంట్రీ!

Virat Kohli Hugs Rohit Sharma

Virat Kohli Hugs Rohit Sharma

India Squad Announcement For IND vs AFG T20I Series Today: భారత క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్. టీమిండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్‌ కోహ్లీ అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేయనున్నారని సమాచారం తెలుస్తోంది. స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో జరిగే టీ20 సిరీస్‌లో రోహిత్‌, కోహ్లీ ఆడనున్నారని సమాచారం. దక్షిణాఫ్రికా పర్యటనను ముగించుకున్న టీమిండియా.. జనవరి 11 నుంచి అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. భారత జట్టుకు ఈ సిరీస్ కీలకం కానుంది. ఎందుకంటే టీ20 ప్రపంచకప్ 2024 ముందు భారత్ ఆడే చివరి టీ20 సిరీస్ ఇదే.

రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీలు చివరిగా భారత్ తరఫున టీ20 ప్రపంచకప్‌ 2022 సెమీ ఫైనల్స్ ఆడారు. ఆ తర్వాత ఈ ఇద్దరు టీ20 ఫార్మాట్‌కు దూరమయ్యారు. వచ్చే జూన్ నెలలో టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో రోహిత్‌, కోహ్లీలను తిరిగి జట్టులోకి తీసుకురావాలని బీసీసీఐ భావిస్తోంది. హార్దిక్‌ పాండ్యా, సూర్యకుమార్‌ యాదవ్‌ గాయాల కారణంగా వీరిని తిరిగి టీ20 జట్టులో ఎంపిక చేయాలని చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ భావించాడట. అఫ్గానిస్థాన్‌ టీ20 రీఎంట్రీ గురించి రోహిత్‌, కోహ్లీతో చర్చలు జరిపినట్లు సమాచారం. అఫ్గన్‌తో సిరీస్‌ సెలక్షన్‌కు అందుబాటులో ఉంటామని వారు చెప్పినట్లు తెలుస్తోంది. అఫ్గానిస్థాన్ సిరీస్ భారత జట్టును సెలక్టర్లు ఈరోజు సాయంత్రం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

Also Read: KL Rahul: ఇప్పుడే టాస్‌ పడి.. అంతలోనే మ్యాచ్‌ ముగిసినట్లు అనిపిస్తోంది!

రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ అఫ్గానిస్థాన్‌ సిరీస్‌ ఆడటం దాదాపుగా ఖాయం అయింది. అయితే పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌లకు మాత్రం మేనేజ్‌మెంట్‌ విశ్రాంతిని ఇవ్వాలని చూస్తోందట. ఫిట్‌నెస్‌ సమస్యలతో బాధపడుతున్న సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ ఈ సిరీస్‌తో రీఎంట్రీ ఇస్తాడా? లేదా? అన్నది చూడాలి. ఐపీఎల్ 2024 అనంతరం టీ20 ప్రపంచకప్ జరగనున్న విషయం తెలిసిందే. జనవరి 11న మొహాలి వేదికగా తొలి మ్యాచ్, జనవరి 14న ఇండోర్‌లో రెండో టీ20 మ్యాచ్, 17న బెంగళూరులో మూడో మ్యాచ్ జరగనుంది.