India Slams Pakistan Army: సహజ వనరులను పాక్ సైన్యం దోచుకుంటోంది.. పాకిస్థాన్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..!

India Accuses Pakistan Army

India Accuses Pakistan Army

India Slams Pakistan: ఐక్యరాజ్యసమితి (United Nations) వేదికగా పాకిస్థాన్‌ సైన్యం (Pakistan army) మీద భారత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఆ దేశ సహజ వనరులను (natural resources) సైన్యం స్వార్థ ప్రయోజనాల కోసం దోచుకుంటోందని ఘాటుగా ఆరోపించింది. సహజ వనరులపై జరిగిన ఐరాస సమావేశంలో (UN session) మాట్లాడిన భారత రాయబారి పర్వతనేని హరీష్ (Parvathaneni Harish), అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పేరు నేరుగా తీయకుండానే పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ (Asim Munir) విదేశీ నేతలతో జరిగిన భేటీలో ఖనిజ రాళ్లతో ఉన్న పెట్టెను చూపించిన విషయాన్ని ప్రస్తావించారు. వనరుల దోపిడీలో పాకిస్థాన్‌ సైన్యం ప్రత్యక్షంగా పాలుపంచుకుంటోందనడానికి ఇదే పెద్ద నిదర్శనమని ఆయన తేల్చి చెప్పారు. గత సెప్టెంబర్‌లో పాక్ ఆర్మీ చీఫ్ ఓ చెక్క పెట్టెలో ఖనిజ రాళ్లను పెట్టుకుని విదేశీ నేతలకు చూపించడం కనిపించిందని, అది వారి సైన్యం వనరులను వాడుకుంటున్న తీరును స్పష్టంగా చూపిస్తోందని హరీష్ అన్నారు. ఇస్లామాబాద్‌లోని అసలు అధికార వ్యవస్థపైనా ఆయన సెటైర్లు వేశారు. తమను తాము గొప్పగా చూసుకోవడం కాకుండా, ఆ దేశ అసలు పాలకులైన సైన్యం అక్కడి వనరులను సాధారణ ప్రజల మేలు కోసం వాడితే పాకిస్థానీయులకు మంచి జరుగుతుందని హితవు పలికారు.

అసలు విషయం ఏంటంటే?

గత ఏడాది ట్రంప్‌తో ఆసిమ్ మునీర్, పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) సమావేశమైనప్పుడు వైట్‌హౌస్ (White House) ఒక ఫోటో విడుదల చేసింది. అందులో పాకిస్థాన్‌‌లో అసలైన పవర్ ఉన్న వ్యక్తిగా చెప్పుకునే మునీర్, అరుదైన ఖనిజాలు (rare earth minerals) ఉన్న చెక్క పెట్టెను చూపిస్తుండగా ట్రంప్ ఆసక్తిగా చూస్తున్నారు. పక్కనే ఉన్న షరీఫ్ మాత్రం వెనక నుంచి తొంగి చూస్తున్నట్లు కనిపించారు. ఈ దృశ్యాలు పాకిస్థాన్‌‌లోనే విమర్శలకు, జోకులకు దారి తీశాయి. మునీర్ తీరును ఒక పాక్ సెనేటర్ కస్టమర్‌కు సరుకు చూపిస్తున్న దుకాణదారుడితో పోల్చారు. ఆర్మీ చీఫ్ కాస్తా సేల్స్‌మ్యాన్-ఇన్-చీఫ్ (salesman-in-chief) అయిపోయారంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. ఇంకా వెలికితీయని తమ ఖనిజ నిల్వలపై అమెరికా పెట్టుబడులను (US investment) ఆకర్షించడానికి ట్రంప్‌తో ఏర్పడిన కొత్త సాన్నిహిత్యాన్ని వాడుకోవాలనే ప్రయత్నంలో భాగంగా ఈ భేటీ జరిగింది.

అదే నెలలో పాకిస్థాన్‌ సైన్యానికి చెందిన ఫ్రాంటియర్ వర్క్స్ ఆర్గనైజేషన్ (Frontier Works Organisation), యూఎస్ స్ట్రాటజిక్ మెటల్స్ సంస్థతో 500 మిలియన్ డాలర్ల ఒప్పందం చేసుకుంది. రక్షణ, టెక్నాలజీ రంగాల కోసం పాకిస్థాన్‌‌లో వ్యూహాత్మక ఖనిజాల అన్వేషణ కోసం ఈ డీల్ కుదిరింది. ఆ తర్వాత అక్టోబర్ 2025లో పాకిస్థాన్‌ తొలిసారిగా అరుదైన, కీలక ఖనిజాల షిప్‌మెంట్‌ను అమెరికాకు పంపింది. అయితే ఈ ఒప్పందం విషయంలో రహస్యంగా వ్యవహరించడంపై ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తాయి. పాకిస్థాన్‌ ఖనిజ సంపద విషయంలో అక్కడి సైన్యం నేరుగా జోక్యం చేసుకుంటోందన్న విషయాన్నే హరీష్ తన ఐరాస ప్రసంగంలో ఎత్తిచూపారు.

ఇంతటితో ఆగకుండా, అశాంతి నెలకొన్న ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఎమర్జెన్సీ పాలన విధించడాన్ని కూడా సైన్యం వనరుల దోపిడీతో హరీష్ ముడిపెట్టారు. ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ (PTI) అధికారంలో ఉన్న కేపీలో ఉగ్రవాద ఘటనలు పెరుగుతున్నాయనే కారణంతో గత నెలలో పాక్ ప్రభుత్వం గవర్నర్ పాలన (governor’s rule) విధించింది. అయితే ఆ ప్రావిన్స్‌లో బంగారంతో సహా భారీగా ఖనిజ నిల్వలు ఉన్నాయన్నది కూడా నిజమే. సహజ వనరులపై నియంత్రణ కోసం అక్కడ చాలా కాలంగా రాజకీయ ఘర్షణలు నడుస్తున్నాయి. ఇటీవలే అక్రమ మైనింగ్ ఆరోపణల నేపథ్యంలో కేపీ గవర్నర్ ఆ ప్రావిన్స్‌వ్యాప్తంగా బంగారు తవ్వకాల లీజులను నిలిపివేశారు. ఈ వనరుల దోపిడీలో సైన్యం పాత్ర వల్లే పాకిస్థాన్‌‌లో ఒక ప్రావిన్షియల్ ప్రభుత్వాన్ని తొలగించి, అక్కడ స్టేట్ ఎమర్జెన్సీ (state emergency) విధించారని నమ్ముతున్నట్లు హరీష్ చెప్పారు. దీనికి పూర్తి భిన్నంగా భారత్‌లోని పరిస్థితిని ఆయన వివరించారు. మన దేశ మైనింగ్ చట్టాల (mining laws) ప్రకారం కంపెనీలు స్థానిక ప్రజల అభివృద్ధికి తప్పనిసరిగా నిధులు ఇవ్వాలని చెప్పారు. తమ భూమి నుంచి తీసే సంపదలో స్థానికులకు నేరుగా లాభం చేకూరినప్పుడే శాశ్వత శాంతి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.