Ben Stokes on Ranchi Pitch: రాంచీ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య శుక్రవారం నుంచి నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లీష్ కెప్టెన్ బెన్ స్టోక్స్ పిచ్‌ను పరిశీలించి ఆశ్చర్యపోయాడు. ఇంతకుముందు ఇలాంటి వికెట్‌ను ఎన్నడూ చూడలేదని, మ్యాచ్ జరిగే కొద్దీ ఎలా మారుతుందో చెప్పడం కష్టమని పేర్కొన్నాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో ప్రస్తుతం భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది. నాలుగో మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయం సాధిస్తే.. సిరీస్ రేసులో నిలుస్తుంది. ఒకవేళ ఓడితే మరో మ్యాచ్ ఉండగానే.. సిరీస్‌ను కోల్పోతుంది.
Also Read: Shreyas Iyer-BCCI: బీసీసీఐకి అడ్డంగా దొరికిపోయిన శ్రేయాస్ అయ్యర్.. చర్యలు తప్పవా?
రాంచీ పిచ్‌ని పరిశీలించిన అనంతరం ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాట్లాడుతూ… ‘నేను ఇంతకు ముందెన్నడూ ఇలాంటివి పిచ్ చూడలేదు. మ్యాచ్ జరిగే కొద్దీ పిచ్ ఎలా మారుతుందో చెప్పడం కష్టం. భారత్ కాకుండా ఇతర దేశాల మైదానాల్లో పిచ్ చూసిన వెంటనే ఒక అంచనాకు రావచ్చు. కానీ ఇక్కడ మాత్రం ప్రతి రోజూ ఓ సవాలే. ఇప్పటికైతే పిచ్‌పై పచ్చిక బాగానే ఉంది. కొన్నిచోట్ల పగుళ్లు కూడా కనిపిస్తున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ జట్లకు ఇబ్బందులు తప్పకపోవచ్చు’ అని అన్నాడు. ఇది కఠినమైన పిచ్ అని ఇంగ్లండ్ వైస్-కెప్టెన్ ఓలి పోప్ పేర్కొన్నాడు. ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ పిచ్‌పై చెలరేగే అవకాశం ఉందన్నాడు.