NTV Telugu Site icon

Vizag Test: నాలుగో స్పిన్నర్‌గా అతడే బెటర్‌: కుంబ్లే

Kuldeep Yadav Test

Kuldeep Yadav Test

Anil Kumble Says Kuldeep Yadav Have Good Variations: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఓడిన భారత్.. వైజాగ్‌లో జరిగే రెండో టెస్ట్ మ్యాచ్‌పై దృష్టిపెట్టింది. ఫిబ్రవరి 2 నుంచి భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య విశాఖలోని డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్‌ స్టేడియంలో రెండో టెస్ట్ ఆరంభం కానుంది. ఈ టెస్టుకు స్టార్ ప్లేయర్స్ కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు గాయాల కారణంగా దూరమయ్యారు. వీరి స్థానాల్లో సర్ఫారాజ్‌ ఖాన్‌, సౌరభ్‌ కుమార్‌, వాషింగ్టన్‌ సుందర్‌లను బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేశారు. దీంతో జట్టు కూర్పు ఎలా ఉంటుందోనని ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ నేపథ్యంలో వైజాగ్‌లో నాలుగో స్పిన్నర్‌ అవసరమని భావిస్తే మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ బెటర్‌ అని భారత మాజీ కెప్టెన్‌ అనిల్‌ కుంబ్లే అభిప్రాయపడ్డాడు.

తాజాగా అనిల్‌ కుంబ్లే మాట్లాడుతూ.. ‘వైజాగ్‌లో నాలుగో స్పిన్నర్ అవసరమా? లేదా? అనేది నాకు తెలియదు. భారత్ ఒక్క ఫాస్ట్ బౌలర్ మాత్రమే అవసరమని భావిస్తే.. నాలుగో స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌ను తీసుకోవడం మంచిది. కుల్దీప్ బౌలింగ్‌లో చాలా వేరియేషన్స్‌ ఉంటాయి. వైజాగ్ పిచ్‌ స్పిన్‌కు అనుకూలంగా ఉండొచ్చు. ఉప్పల్‌ పిచ్ కంటే పేస్‌ బౌలింగ్‌కు కాస్త ఎక్కువ అనుకూలిస్తుందని భావిస్తున్నా. ఈ పిచ్‌ నెమ్మదిగా ఉన్నా సరే సరిగా బౌలింగ్‌ చేస్తే వికెట్లు పడతాయి. అయితే స్పిన్‌ బౌలింగ్‌లో భారత బ్యాటర్లు జాగ్రత్తగా ఆడాలి. తొలి టెస్టులో స్పిన్‌ బౌలింగ్‌లోనే బాగా ఇబ్బంది పడ్డారు. కొంత మంది బ్యాటర్ల పుట్‌వర్క్‌ కూడా సరిగా లేదు. పుట్‌వర్క్‌ మెరుగుపర్చుకోవాలి’ అని చెప్పాడు.

Also Read:

మొదటి టెస్టులో భారత స్పిన్నర్లు ఆర్ అశ్విన్, ఆర్ జడేజా రాణించినా.. ఇంగ్లీష్ స్పిన్నర్ టామ్ హార్ట్లీ చెలరేగిపోయాడు. రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్స్ తీసి భారత్ విజయాన్ని అడ్డుకున్నాడు. అందుకే భారత బ్యాటర్లు స్పిన్‌ బౌలింగ్‌లోనే బాగా ఆడాలని అనిల్‌ కుంబ్లే సూచించాడు. ఇక కుల్దీప్ యాదవ్‌ చివరగా 2022 డిసెంబరులో బంగ్లాదేశ్‌పై టెస్ట్ ఆడాడు. ఆ టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 8 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా 8 టెస్టులు ఆడిన కుల్దీప్ 34 వికెట్లు తీశాడు. ఇటీవలి కాలంలో కుల్దీప్ బాగా రాణిస్తున్న విషయం తెలిసిందే.