ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి సత్తాచాటిన విషయం తెలిసిందే. 303 పరుగులు చేసి, 3 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ ప్రదర్శనతో భారత జట్టులోనూ చోటు సంపాదించాడు. ఇటీవల భారత్ టీ20 జట్టులో చోటు దక్కించుకున్న నితీశ్.. ఇప్పుడు టెస్టు జట్టులోనూ స్థానం దక్కించుకున్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లే భారత టెస్టు జట్టులో నితీశ్‌కు సెలెక్టర్లు అవకాశం ఇచ్చారు.
బంగ్లాదేశ్‌పై తన అరంగేట్ర సిరీస్‌లో నితీశ్ రెడ్డి ఆల్‌రౌండ్ ప్రదర్శన (90 పరుగులు, 3 వికెట్లు) చేశాడు. హార్దిక్ పాండ్యా లాంటి పేస్ ఆల్‌రౌండర్లు గాయాల బారిన పడుతుండటంతో.. భవిష్యత్ ప్రత్యామ్నాయంగా నితీశ్‌పై సెలక్టర్లు దృష్టి సారించారు. ఆస్ట్రేలియా పర్యటన కోసం ఎంపిక చేసిన 18 మంది ఆటగాళ్ల భారత జట్టులో నితీశ్ ఒక్కడే పేస్ ఆల్‌రౌండర్ కావడం విశేషం. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆడే అవకాశం దక్కితే.. ఆసీస్ పిచ్‌లపై మనోడు కీలకంగా మారే అవకాశం ఉంది.
ఇప్పటికే ఆస్ట్రేలియా-ఏతో సిరీస్ కోసం భారత్-ఏ తరపున నితీశ్ రెడ్డి కంగారూ గడ్డపై ఆడాడు. రెండు నాలుగు రోజుల మ్యాచ్‌లతో అక్కడి పరిస్థితులపై అవగాహన వచ్చే అవకాశముంది. మంచి ఫామ్ మీదున్న నితీశ్‌కు తుది జట్టులో చోటు దక్కితే నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటివరకూ 21 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడిన నితీశ్.. 708 పరుగులు, 55 వికెట్లు తీశాడు.
ఆస్ట్రేలియా సిరీస్‌కు భారత జట్టు:
రోహిత్, బుమ్రా, జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్, కోహ్లీ, రాహుల్, పంత్, సర్ఫరాజ్, జూరెల్, అశ్విన్, జడేజా, సిరాజ్, ఆకాశ్‌దీప్, ప్రసిద్ధ్, హర్షిత్ రాణా, నితీశ్, సుందర్.