ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున సత్తాచాటిన తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డికి ఇప్పటికే భారత జట్టులో చోటు దక్కిన విషయం తెలిసిందే. ఇటీవల బంగ్లాదేశ్ టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన భారత్-ఏ జట్టులో కూడా మనోడికి చోటు దక్కింది. ఇక అతి త్వరలోనే టెస్టుల్లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. భారత్-ఆస్ట్రేలియా మధ్య నవంబర్ 22 నుంచి ఆరంభం కానున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25కి నితీశ్‌ను బీసీసీఐ ఎంపిక చేయనుందని సమాచారం.
ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టులో చోటు ఇవ్వడం కోసమే.. నవంబర్ 8 నుంచి ప్రారంభం కానున్న దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌కు ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డిని పక్కనపెట్టారట. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ముందు భారత్-ఏ తరఫున బరిలోకి దించుతున్నారు. నితీశ్ సహా మరో ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను కూడా తీసుకోవాలని బీసీసీఐ సెలక్టర్లు భావిస్తున్నారట. గత ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ విజయంలో శార్దూల్ కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ఆడుతున్నాడు. అక్టోబర్ 28వ తేదీన ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించనుంది.
Also Read: CM Chandrababu: ఎంఎస్ ధోనీ కాదు.. సీఎం చంద్రబాబుకు ఇష్టమైన క్రికెటర్ ఎవరంటే?
ఆస్ట్రేలియా గడ్డపై గత రెండు బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లను భారత్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఛెతేశ్వర్ పుజారా, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రాలు కీలక పాత్ర పోషించారు. ఈసారి నవంబర్ 22 నుంచి 5 టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. పెర్త్ (నవంబర్ 22-26)లో తొలి టెస్టు, అడిలైడ్ (డిసెంబర్ 6-10, డే/నైట్ టెస్టు) రెండో టెస్ట్, బ్రిస్బేన్ (డిసెంబర్ 14-18)లో మూడో టెస్టు, మెల్బోర్న్ (డిసెంబర్ 26-30, బాక్సింగ్ డే టెస్టు)లో నాలుగో టెస్ట్, సిడ్నీ (జనవరి 3-7)లో ఐదవ టెస్టు జరగనుంది.