భారత యువ క్రికెట్ సంచలనం తిలక్ వర్మ బ్యాటింగ్‌లోనే కాకుండా ఫీల్డింగ్ రంగంలోనూ మైదానంలో వాయువేగంతో కదులుతూ సంచలనాలు సృష్టిస్తున్నాడు. మ్యాచ్‌ల్లో ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడే ఈ తెలుగు కుర్రాడు, అద్భుతమైన క్యాచ్‌లతో క్రికెట్ ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటివరకు ఏ ప్రపంచ దిగ్గజ ఫీల్డర్‌కూ సాధ్యం కాని అరుదైన మైలురాయిని కేవలం తన క్యాచ్‌లతోనే అందుకుని కొత్త చరిత్ర సృష్టించాడు.
న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో డారిల్ మిచెల్ ఇచ్చిన క్యాచ్‌ను అత్యంత సులువుగా అందుకోవడం ద్వారా తిలక్ వర్మ ఈ చారిత్రక రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్‌గా తిలక్ అవతరించగా, ఈ జాబితాలో తిలక్ వర్మ (భారత్) 26 క్యాచ్‌లతో (2026) మొదటి స్థానంలో నిలవగా, ఆ తర్వాతి స్థానాల్లో డానియెల్సన్ హావో (ఇండోనేషియా – 25 క్యాచ్‌లు, 2025), ముహమ్మద్ వసీమ్ (యూఏఈ – 24 క్యాచ్‌లు, 2024), షార్విన్ మునియాండి (మలేషియా – 21 క్యాచ్‌లు, 2025), బ్రియాన్ మసాబా (ఉగాండా – 20 క్యాచ్‌లు, 2023), తాంజిద్ హసన్ (బంగ్లాదేశ్ – 20 క్యాచ్‌లు, 2025) ఉన్నారు.
భువనేశ్వర్ కుమార్ వేసిన బంతిని భారీ షాట్ ఆడబోయిన డారిల్ మిచెల్ టాప్ ఎడ్జ్ తీసుకోగా, కవర్ రీజియన్‌లో అప్రమత్తంగా ఉన్న తిలక్ వర్మ దానిని సునాయాసంగా క్యాచ్‌గా మలిచాడు. ఒకే ఏడాదిలో 26 క్యాచ్‌లతో అగ్రస్థానానికి చేరుకుని భారత జట్టులో తానెంత కీలకమైన ఫీల్డరో మరోసారి నిరూపించుకున్నాడు. బౌండరీ లైన్ వద్ద మెరుపు వేగంతో.. గ్రౌండ్ ఫీల్డింగ్‌లో పట్టుదలతో తిలక్ వర్మ టీమిండియా నయా సూపర్‌స్టార్‌గా ఎదుగుతున్నాడు.

