IIT Kanpur Professor died after suffering a cardiac arrest: ఐఐటీ కాన్పూర్‌లో విషాదకర ఘటన చోటు చేసుకొంది. సీనియర్ ప్రొఫెసర్ సమీర్ ఖండేకర్ (53) యూనివర్సిటీలో ప్రసంగిస్తూ గుండెపోటుతో మరణించారు. ఆడిటోరియంలో జరిగిన పూర్వ విద్యార్థుల సమావేశంలో ప్రసంగిస్తున్న ప్రొఫెసర్ సమీర్.. గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకోగా.. ఐఐటీ కాన్పూర్ అధికారులు శనివారం వెల్లడించారు. ‘మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి’ అని విద్యార్థులకు ఆయన చివరి మాటలు చెప్పారు.
సమీర్ ఖండేకర్ ఐఐటీ కాన్పూర్‌లో సీనియర్ ప్రొఫెసర్. విద్యార్థి వ్యవహారాల విభాగం డీన్‌గా, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థుల సమావేశంలో ప్రొఫెసర్ సమీర్ పాల్గొన్నారు. వేదికపై ప్రసంగిస్తుండగా ఆయనకు ఛాతిలో నొప్పి వచ్చింది. ఒళ్లంతా చెమటలు పట్టిన ఆయన.. నిలుచున్న చోటే ఒక్కసారిగా కూప్పకూలిపోయారు. దీంతో అక్కడున్న వారంతా షాక్‌కి గురయ్యారు. వేదికపై వెళ్లి చూడగా.. ఆయన సృహ కోల్పోయారు.
Also Read: Cold Intensity: తెలంగాణలో చలి పంజా.. సింగిల్ డిజిట్‌కు పడిపోయిన ఉష్ణోగ్రతలు!
సమీర్ ఖండేకర్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల సహ ప్రొఫెసర్లు, విద్యార్థులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం సమీర్ మృతదేహాన్ని ఐఐటీ కాన్పూర్‌లోని ఆరోగ్య కేంద్రంలో ఉంచారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుతున్న ఆయన కుమారుడు వచ్చిన తర్వాత అంత్యక్రియలు జరగనున్నాయి. సమీర్ ఆరోగ్యంపై మాట్లాడుతూనే కన్నుమూయడం విశేషం.