ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?

Icc

Icc

ICC: అంతర్జాతీయ క్రికెట్‌లో కీలక మార్పులకు రంగం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఇండోనేషియాలోని బాలిలో జరుగుతున్న ఐసీసీ బోర్డు సమావేశంలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC), భవిష్యత్ క్రికెట్ షెడ్యూల్, మూడు ఫార్మాట్ల భవితవ్యం వంటి అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా డబ్ల్యూటీసీలో ప్రస్తుతం ఉన్న 9 జట్ల సంఖ్యను 12కు పెంచాలనే ప్రతిపాదనపై తీవ్ర చర్చ జరిగే అవకాశం ఉంది. 2026 చివరి త్రైమాసిక సమావేశాలు బుధవారం ప్రారంభమై ఆదివారం వరకు కొనసాగనున్నాయి.

ప్రస్తుతం జరుగుతున్న డబ్ల్యూటీసీ నాలుగో సైకిల్‌లో 9 జట్లు మాత్రమే పోటీపడుతున్నాయి. జింబాబ్వే, ఐర్లాండ్, అఫ్గానిస్థాన్‌లకు ఇందులో ఇంకా చోటు లేదు. అయితే వచ్చే సైకిల్ నుంచి మొత్తం 12 టెస్ట్ సభ్య దేశాలకు అవకాశం కల్పించాలనే ప్రతిపాదన గత ఏడాది నుంచి తెరపైకి వచ్చింది. కానీ తాజా పరిణామాల ప్రకారం ఈ విస్తరణ ప్రణాళికకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. వచ్చే డబ్ల్యూటీసీ సైకిల్‌లోనూ 9 జట్ల విధానమే కొనసాగవచ్చని సమాచారం. జింబాబ్వేను మాత్రం 10వ జట్టుగా చేర్చే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఐర్లాండ్‌కు టెస్ట్ క్రికెట్ ఆడే ఆసక్తి, సామర్థ్యంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB) కూడా 12 జట్లకు విస్తరించే ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. జట్లు పెరిగితే ప్రయాణాలు ఎక్కువవడంతో పాటు ఇంగ్లండ్‌లో స్వదేశీ క్రికెట్ షెడ్యూల్‌పై ఒత్తిడి పెరుగుతుందని ఈసీబీ భావిస్తోంది. అయితే జింబాబ్వే, ఐర్లాండ్‌లతో డబ్ల్యూటీసీలో భాగం కాని ప్రత్యేక టెస్టు మ్యాచ్‌లు ఆడేందుకు ఈసీబీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అఫ్గానిస్థాన్‌తో మాత్రం తాలిబన్ పాలనలో మహిళలు, బాలికలపై ఆంక్షల కారణంగా ఆడేందుకు ఈసీబీ విముఖంగా ఉన్నట్లు సమాచారం. డబ్ల్యూటీసీలో చోటు దక్కకపోతే ఎక్కువ టెస్టులు ఆడాలనే లక్ష్యంతో ఉన్న జింబాబ్వే అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉంది. 2025లో 10 టెస్టులు ఆడిన ఆ జట్టు.. ఈ ఏడాది కేవలం రెండు టెస్టులకే పరిమితమైంది.

2027 నుంచి 2031 వరకు అమలయ్యే ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ (FTP) కూడా ఈ సమావేశాల్లో చర్చకు రానుంది. ప్రస్తుత షెడ్యూల్ మార్చిలో ముగియనుండటంతో తదుపరి సైకిల్‌కు సంబంధించిన వివరాలను ఖరారు చేయనున్నారు. ఇప్పటికే చాలా దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లపై ప్రాథమిక అంగీకారాలు కుదిరాయి. 2028లో ఇంగ్లండ్ జట్టు జింబాబ్వేలో పర్యటించే అవకాశం ఉంది. ఈ పర్యటనలో కనీసం ఒక టెస్టు మ్యాచ్ ఉండవచ్చని సమాచారం. 2004 తర్వాత ఇంగ్లండ్ జట్టు జింబాబ్వేలో ద్వైపాక్షిక సిరీస్ ఆడలేదు. మరోవైపు 2027లో దక్షిణాఫ్రికా జట్టు జింబాబ్వేలో ఒక టెస్టు ఆడనుంది. ఆస్ట్రేలియా కూడా వచ్చే సైకిల్‌లో జింబాబ్వేలో పర్యటించనుంది. అయితే ఆ పర్యటనలో టెస్టులు ఉంటాయా లేదా అనేది స్పష్టత లేదు.

వెస్టిండీస్ జట్టు వచ్చే సైకిల్‌లోనూ తక్కువ టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లకే ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. ఉత్తర అమెరికాలో క్రికెట్‌ను విస్తరించేందుకు వాషింగ్టన్ డీసీ, టొరంటోలో వన్డే, టీ20 సిరీస్‌లను నిర్వహించాలని క్రికెట్ వెస్టిండీస్ భావిస్తోంది. ఇందుకోసం క్రికెట్ కెనడాతో పాటు మేజర్ లీగ్ క్రికెట్ ఫ్రాంచైజీ వాషింగ్టన్ ఫ్రీడమ్‌తో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని చూస్తోంది. టెస్టులు, వన్డేలు, టీ20ల భవిష్యత్తుపై అంతర్జాతీయ కన్సల్టింగ్ సంస్థ మెకిన్సే రూపొందించిన వ్యూహాత్మక సమీక్ష కూడా ఐసీసీ బోర్డు ముందుకు రానుంది. ముఖ్యంగా టెస్టులు, టీ20ల మధ్య వన్డే క్రికెట్ ప్రాధాన్యం తగ్గుతున్న నేపథ్యంలో ఈ ఫార్మాట్‌కు సంబంధించి ఎలాంటి సిఫార్సులు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

వచ్చే సైకిల్‌లో వన్డే మ్యాచ్‌ల సంఖ్య తగ్గే అవకాశం ఉందని, ముఖ్యంగా 2030-31లో జరిగే వన్డే ప్రపంచకప్‌కు ముందు ఈ ఫార్మాట్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వవచ్చని అంచనా. ప్రస్తుతం పురుషుల వన్డే హోదా 20 దేశాలకు ఉంది. ఇందులో 8 అసోసియేట్ దేశాలు ఉన్నాయి. ఈ జట్ల సంఖ్య తగ్గుతుందేమోనని కొన్ని అసోసియేట్ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. అయితే వన్డే ప్రపంచకప్ ద్వారా ఐసీసీకి భారీ ఆదాయం వస్తుండటంతో ఈ హోదాను తగ్గించే అవకాశాలు తక్కువగా ఉంది. పురుషుల వన్డే హోదాను 32 జట్లకు పెంచాలనే ప్రతిపాదన కూడా ఉన్నప్పటికీ, అది ఇప్పట్లో కార్యరూపం దాల్చడం కష్టమేనని తెలుస్తోంది. ప్రసార హక్కుల ఆదాయంపై ఐసీసీ ఆధారపడటాన్ని తగ్గించేందుకు కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించాలనే అంశం కూడా ఈ సమీక్షలో ఉండవచ్చు. వచ్చే సైకిల్‌లో సభ్య దేశాలకు ఆదాయ పంపిణీ విధానంలో మార్పులు వస్తాయా? వాటికి లభించే వాటా తగ్గుతుందా? అన్నది కూడా కీలకం కానుంది.

అఫ్గానిస్థాన్‌లో మహిళల క్రికెట్‌కు అవకాశాలు లేకపోవడంతో శరణార్థి మహిళా క్రికెట్ జట్టును ఏర్పాటు చేసే దిశగా ఐసీసీ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఎడిన్‌బర్గ్‌లో జరిగిన వార్షిక సమావేశంలో దీనిపై రోడ్‌మ్యాప్ రూపొందించాలని నిర్ణయించారు. 2030 నాటికి అర్హత సాధించే మార్గాలను పరిశీలిస్తూ.. శిక్షణ, మ్యాచ్‌లతో కూడిన కార్యక్రమాన్ని రూపొందించనున్నారు. ఈ ప్రణాళికకు సంబంధించిన తదుపరి చర్యలను బాలిలో జరిగే సమావేశంలో టాస్క్‌ఫోర్స్ వెల్లడించనుంది. ఈ ఏడాది వార్షిక సమావేశంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా నేతృత్వంలో గవర్నెన్స్ రివ్యూ కమిటీని ఏర్పాటు చేశారు. ఐసీసీ పాలనా వ్యవస్థపై సమగ్ర సమీక్ష నిర్వహించి, ప్రాథమిక సిఫార్సులను ఈ కమిటీ బోర్డుకు సమర్పించనుంది.