Saliya Saman: శ్రీలంక మాజీ దేశీయ క్రికెటర్ సలియా సమన్ పై ఐసీసీ అవినీతి నిరోధక ట్రైబ్యునల్ 5 ఏళ్ల నిషేధాన్ని విధించింది. అబుదాబి T10 లీగ్ 2021లో మ్యాచ్‌లను అవినీతికి గురిచేయడానికి చేసిన ప్రయత్నాలకు సంబంధించి, ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ECB) అవినీతి నిరోధక కోడ్‌ను ఉల్లంఘించినట్లు తేలడంతో ఈ శిక్ష విధించబడింది. ఐసీసీ ప్రకారం సెప్టెంబర్ 13, 2023న సమన్‌కు తాత్కాలిక నిషేధం విధించబడింది. ఈ నిషేధం ఆ తేదీ నుండి అమల్లోకి వచ్చినట్లుగా పరిగణించబడుతుంది.
ట్రైబ్యునల్ సమన్‌పై ఆర్టికల్ 2.1.1గా అబుదాబి T10 2021లో మ్యాచ్‌లు లేదా మ్యాచ్‌లలోని అంశాలను తప్పుడు పద్ధతిలో ప్రభావితం చేయడానికి యత్నించడం, అలాగే ఆర్టికల్ 2.1.3గా ఇతర ఆటగాడికి అవినీతిపూరిత ప్రవర్తన చేయడానికి బహుమతి ఆఫర్ చేయడం, ఇంకా ఆర్టికల్ 2.1.4గా కోడ్ ఉల్లంఘన చేయడానికి ఇతర ఆటగాడిని నేరుగా లేదా పరోక్షంగా ప్రోత్సహించడం, ప్రేరేపించడం, లేదా సహకరించడం వంటి ఉల్లంఘనలు నిర్ధారించింది.
ఈ కేసులో సమన్‌తో పాటు పుణే డెవిల్స్ ఫ్రాంచైజీ సహ యజమానులు కృష్ణన్ కుమార్ చౌధరీ, పరాగ్ సంగ్వీ, బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ నసీర్ హోసైన్, దేశీయ ఆటగాడు రిజ్వాన్ జావేద్, బ్యాటింగ్ కోచ్ ఆషర్ జైదీ, అసిస్టెంట్ కోచ్ సన్నీ ఢిల్లన్, జట్టు మేనేజర్ షాదాబ్ అహ్మద్‌లకు కూడా ఐసీసీ అవినీతి నిరోధక విభాగం ఆరోపణలు మోపింది. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే.. బంగ్లాదేశ్ క్రికెటర్ నసీర్ హోసైన్ ఈ ఏడాది ఏప్రిల్‌లో 2 ఏళ్ల నిషేధాన్ని పూర్తిచేసి మళ్లీ పోటీ క్రికెట్‌లోకి తిరిగి వచ్చాడు.
