Site icon NTV Telugu

Hyderabad: హైదరాబాద్‌లో ‘ఐ లవ్ మహ్మద్‌’ బ్యానర్.. సీఎం యోగిని ఘోరంగా తిట్టిన ముస్లిం యువకులు(వీడియో)

Hyd

Hyd

Hyderabad: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ప్రారంభమైన ‘ఐ లవ్ మహ్మద్‌’ వివాదం ఉత్తరాఖండ్, తెలంగాణ, మహారాష్ట్రతో సహా పలు రాష్ట్రాలకు పాకింది. ఉన్నావ్, బరేలీ, కౌశాంబి, లక్నో, మహారాజ్‌గంజ్, కాశీపూర్, హైదరాబాద్ వంటి నగరాల్లో మైనార్టీలు సామూహిక ప్రద‌ర్శన‌లు, ర్యాలీలు చేపట్టారు. అయితే.. ఇప్పుడిప్పుడే ఈ వివాదం కుదుటపడుతోంది. యూపీలో ఈ వివాదాన్ని సర్దుమనిగించేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేశారు. తాజాగా హైదరాబాద్‌లో కొంత మంది ముస్లిం యువకులు మరోసారి ఈ వివాదాన్ని తెరపైకి తెచ్చారు. చంద్రాయన్‌గుట్టలో ‘ఐ లవ్ మహ్మద్‌’ బ్యానర్ ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి ఓ వీడియోను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో పలువురు ముస్లిం యువకులు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ను ఘోరంగా అవమానిస్తూ.. అసభ్యపదజాలం ఉపయోగించారు. “ఇది ఉత్తరప్రదేశ్‌ కాదు.. హైదరాబాద్.. నీ ఆటలు ఇక్కడ సాగవు” అనే అర్థం వచ్చేలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు హైదరాబాద్ చంద్రాయన్‌గుట్టలో ఈ రోజు ‘ఐ లవ్ మహ్మద్‌’ బ్యానర్ ఏర్పాటు చేశాం.. దమ్ముంటే దీన్ని తీసి చూడండి.. అంటూ సవాల్ విసిరారు. మీరు ఈ బ్యానర్‌ని తొలగించాలంటే ముందు మమ్మల్ని దాటాల్సి ఉంటుందన్నారు. మమ్మల్ని ఏమైనా అనుకోండి.. జీహాదీ, ఆటంక్ వాది ఇలా ఏమైనా అనుకోండన్నారు. చివరగా సీఎం యోగిని ఘోరంగా అవమానించేలా “కాశాయ రంగు చీర ధరించి.. గాజులు వేసుకుని డ్యాన్స్ చేయాల్సి వస్తుంది.” అని తీవ్ర అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యానించారు. ఈ వీడియోపై చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. పోలీసులు రంగంలోకి దిగి వెంటనే వాళ్లను అరెస్ట్ చేయాలని, సీఎం యోగిని తిట్టినందుకు తగిన శిక్ష విధించాలని కోరుతున్నారు.

READ MORE: Israel-Hamas Peace Deal: ఇజ్రాయెల్-హమాస్ మధ్య శాంతి ఒప్పందం.. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

అస‌లేంటి ఈ వివాదం? ఐ లవ్ మహ్మద్‌ నినాదం ఎందుకు వివాదాస్పద‌మైంది?
ఈద్-ఎ-మిలాద్-ఉన్-నబీ సంద‌ర్భంగా కాన్పూర్‌లోని రావత్‌పూర్‌లో సెప్టెంబర్ 4న జరిగిన ఊరేగింపులో ‘ఐ లవ్ మహ్మద్‌’ అనే బ్యాన‌ర్‌ను ముస్లింలు ప్రద‌ర్శించారు. దీనిపై స్థానిక హిందూ సంఘాలు అభ్యంత‌రం వ్యక్తం చేశాయి. మ‌త‌ప‌ర‌మైన వేడుక‌ల్లో కొత్త సంప్రదాయం ఎందుకు ప్రవేశపెడుతున్నారని ప్రశ్నించాయి. సున్నితమైన‌ అంశం కావ‌డంతో పోలీసులు వెంట‌నే జోక్యం చేసుకున్నారు. వేడుక‌లు నిర్వహించే ప్రాంతంలో ఎప్పుడూ వేసే టెంట్ స్థానంలో బ్యాన‌ర్‌తో పాటు వెలిసిన కొత్త గూడారాన్ని తొల‌గించారు. య‌థావిధిగా పాత టెంట్‌ను పోలీసులు పున‌రుద్ధించారు. బ్యాన‌ర్ పెట్టిన వారిపై కేసు న‌మోదు చేయ‌లేద‌ని స్థానిక‌ డీసీపీ దినేష్ త్రిపాఠి తెలిపారు. మతపరమైన ఊరేగింపుల్లో కొత్త ఆచారాలను ప్రవేశపెట్టడాన్ని ప్రభుత్వ నిబంధనలు నిషేధించాయని ఆయ‌న వెల్లడించారు. ఈద్-ఎ-మిలాద్-ఉన్-నబీ ఊరేగింపు సందర్భంగా మత సామరస్యాన్ని దెబ్బతీశారనే ఆరోప‌ణ‌ల‌తో సెప్టెంబర్ 9న కాన్పూర్ పోలీసులు కేసులు పెట్టారు. సాంప్రదాయ గుడారాన్ని తొలగించి కొత్త స్థలంలో ‘ఐ లవ్ మహ్మద్‌’ బ్యానర్‌ను ప్రద‌ర్శించార‌నే నెపంతో 24 మందిపై కేసులు నమోదు చేసిన‌ట్టు వార్తలు వ‌చ్చాయి. అయితే ఆ బ్యానర్ పై ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని కాన్పూర్ పోలీసులు చెప్పారు. మ‌రో వ‌ర్గం పోస్టర్లను ధ్వంసం చేసినందుకు కేసులు పెట్టిన‌ట్టు వివ‌ర‌ణ ఇచ్చారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చేయవద్దని ప్రజలను కోరారు. అక్కడ మొదలైన వివాదం దేశ వ్యాప్తంగా పాకింది.

Exit mobile version