VC Sajjanar: నూతన సంవత్సర వేడుకల వేళ నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ (ఐపీఎస్) తెలిపారు. బుధవారం బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీ నుంచి క్షేత్ర స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. నగరంలో భద్రతా ఏర్పాట్లపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఈవెంట్ల సమయపాలన, మద్యం విక్రయాలు, ట్రాఫిక్ నిబంధనలపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు స్పష్టం చేశారు. నగరంలో న్యూ ఇయర్ ఈవెంట్లు, వేడుకలకు ఈ అర్ధరాత్రి 1 గంట వరకు మాత్రమే అనుమతి ఉందని వెల్లడించారు. ఆ సమయం దాటి వేడుకలు నిర్వహించినా, నిబంధనలకు విరుద్ధంగా సౌండ్ సిస్టమ్స్ వినియోగించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. వైన్ షాపులు, బార్ల సమయం ముగిశాక ‘బ్యాక్ డోర్’ ద్వారా మద్యం విక్రయించడాన్ని పూర్తిగా నిషేధించామన్నారు. నిబంధనలు ఉల్లంఘించి దొడ్డిదారిన మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం తాగి వాహనాలు నడిపేవారిని గుర్తించేందుకు ఈసారి ముందుగానే తనిఖీలు చేపడుతున్నట్లు సీపీ తెలిపారు. బుధవారం రాత్రి 7 గంటల నుంచే నగరవ్యాప్తంగా 120 ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ సోదాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
మద్యం మత్తులో పట్టుబడితే భారీ జరిమానా, జైలు శిక్షతో పాటు లైసెన్స్ రద్దు, వాహనాల సీజ్ వంటి చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. జనవరి మొదటి వారం వరకు ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందన్నారు. యువత రాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ జోలికి వెళ్లకుండా, కుటుంబ సభ్యులతో కలిసి క్షేమంగా కొత్త ఏడాదికి స్వాగతం పలకాలని విజ్ఞప్తి చేశారు. మద్యం సేవించిన వారు డ్రైవింగ్ చేయకుండా క్యాబ్ లేదా డ్రైవర్లను ఆశ్రయించాలని సూచించారు. రద్దీని సాకుగా చూపి క్యాబ్/ఆటో డ్రైవర్లు రైడ్ నిరాకరించినా, అదనపు ఛార్జీలు డిమాండ్ చేసినా ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు. అటువంటి వారిపై మోటార్ వెహికల్ చట్టం సెక్షన్ 178(3)(b) కింద కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటే వెంటనే 94906 16555 వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. పోలీసు అధికారులు తమ పరిధిలోని అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, ఆసుపత్రులకు వెళ్లి అక్కడ ఉన్నవారితో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని సీపీ సజ్జనార్ పిలుపునిచ్చారు. సమాజంలో ఆసరా అవసరమైన వారికి తోడుగా నిలవడమే నిజమైన వేడుక అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జాయింట్ సీపీ (ట్రాఫిక్) జోయల్ డేవిస్, డీసీపీలు శ్వేతా, అపూర్వ రావు, రక్షితా కృష్ణమూర్తి, రూపేష్, వెంకట లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
