NTV Telugu Site icon

INDvsAUS Test: టీమిండియాకు షాక్..ఆసీస్‌తో టెస్టులకు అతడు దూరం!

Shreyas Iyer1

Shreyas Iyer1

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. టెస్టు ఛాంపియన్ షిప్‌లో భాగంగా ఇదే చివరి సిరీస్‌ కావున ఇరుజట్లు దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాగా నాగ్‌పూర్‌లో ఫిబ్రవరి 9న ప్రారంభమయ్యే తొలి టెస్టుకు ముందు టీమిండియాకు షాక్ తగిలింది. టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా ఈ సిరీస్‌ తొలి టెస్టుకు అందుబాటులో ఉండట్లేదని తెలుస్తోంది. దీంతో అతడి స్థానంలో సూర్యకుమార్‌ లేదా శుభ్‌మన్ గిల్‌లో ఎవరో ఒకరికి తుది జట్టులో చోటు లభించే అవకాశం ఉంది.

Also Read: Cycling: సైక్లింగ్‌తో క్యాన్సర్ దూరమవుతుందా? నిజమెంత?

కొంతకాలంగా టెస్టుల్లో శ్రేయస్ నిలకడగా రాణిస్తున్నాడు. డిసెంబరులో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లోనూ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. ఇటీవలే గాయం కావడంతో న్యూజిలాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు పూర్తిగా దూరమయ్యాడు. ఇప్పటికీ గాయం నుంచి కోలుకోకపోవడంతో ఆస్ట్రేలియా సిరీస్‌కూ దూరం కానున్నాడని సమాచారం. ప్రస్తుతం టెస్టుల్లో ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ రెగ్యూలర్‌గా ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారు. తర్వాతి స్థానాల్లో పుజారా, విరాట్ కోహ్లీ వరుసగా ఆడుతున్నారు. అయితే ఐదో స్థానంలో భారత్‌కు చాలా కీలకం కానుంది. ఎందుకంటే రెండో కొత్త బంతిని తీసుకునే అవకాశముంది కాబట్టి ఆ స్థానంలో నిలకడైన ఆటగాడి కోసం భారత్ చూస్తోంది.

Also Read: Union Budget 2023: క్లుప్తంగా కేంద్ర బడ్జెట్..అంకెల్లో ఇలా!

“వెస్టిండీస్-ఏ, భారత్-ఏ మధ్య జరిగిన మ్యాచ్‌లో గిల్ మిడిలార్డర్‌లో ఆడాడు. ఆ టెస్టులో అతడు డబుల్ సెంచరీ కొట్టాడు. కాబట్టి అతడు మిడిలార్డర్‌లో పూర్తిగా న్యాయం చేస్తాడని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది. స్పిన్నర్లపై సూర్యకుమార్ యాదవ్ ఆధిపత్యం చెలాయిస్తే అతడి వల్ల అదనపు ప్రయోజనం చేకూరే అవకాశముంది. అలా కాకుండా నాథన్ లియోన్..సూర్యకుమార్‌ను కట్టడి చేస్తాడనుకుంటే కమిన్స్, హేజిల్‌వుడ్ లాంటి వారిని సమర్థవంతంగా ఎదుర్కోగలిగే గిల్‌ మైరుగైన ఎంపికగా కనిపిస్తున్నాడు” అని మాజీ నేషనల్ సెలక్టర్ ఒకరు అన్నారు.