Pigeon Control Home Remedies: ఇళ్ల బాల్కనీల్లో పావురాలు గుమిగూడటం చాలా మందికి పెద్ద సమస్యగా మారుతోంది. పావురాలు కూర్చున్న ప్రదేశాల్లో రెట్టలు, ఈకలు, మురికి పేరుకుపోవడంతో బాల్కనీ అందం చెడిపోతుంది. అంతేకాకుండా వాటి వల్ల అలర్జీలు, శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే పావురాలకు ఎలాంటి హాని చేయకుండా కొన్ని సులభమైన ఇంటి చిట్కాలతో వాటిని దూరంగా ఉంచవచ్చు.
మెరిసే వస్తువులు వేలాడదీయండి
పావురాలు మెరిసే కాంతికి భయపడతాయని చెబుతారు.. అందుకే పాత సీడీలు, మెరిసే అల్యూమినియం స్ట్రిప్స్ లేదా గాజు ముక్కలను బాల్కనీలో వేలాడదీయవచ్చు. వాటిపై పడే సూర్యరశ్మి ప్రతిబింబం పావురాలకు అసౌకర్యంగా అనిపించి ఆ ప్రదేశానికి రావడం తగ్గుతుంది.
ఘాటైన వాసనలు ఉపయోగించండి
పావురాలకు వాసన గ్రహించే శక్తి ఎక్కువగా ఉంటుంది. నల్ల మిరియాలు, దాల్చినచెక్క లేదా వెనిగర్ వంటి ఘాటైన వాసనలు వాటికి నచ్చవని భావిస్తారు. నల్ల మిరియాల పొడిని నీటిలో కలిపి స్ప్రే రూపంలో బాల్కనీ మూలల్లో చల్లవచ్చు. దీంతో పావురాలు ఆ ప్రదేశానికి రావడం తగ్గే అవకాశం ఉంటుంది.
బర్డ్ స్పైక్స్ లేదా మెష్ ఏర్పాటు చేయండి
పావురాలు తరచుగా కూర్చునే అంచులపై ప్లాస్టిక్ బర్డ్ స్పైక్స్ అమర్చడం మంచి మార్గం. ఇవి పక్షులకు హాని చేయకుండా కూర్చోవడాన్ని మాత్రమే అడ్డుకుంటాయి. అలాగే పారదర్శక నైలాన్ మెష్‌ను బాల్కనీకి అమర్చితే గాలి, వెలుతురు లోపలికి వస్తూనే పావురాలు లోపలికి రాకుండా ఉంటాయి.
పరిశుభ్రత తప్పనిసరి
పావురాలు ఎక్కువగా ఆహారం లేదా నీరు లభించే ప్రదేశాలకు వస్తాయి. బాల్కనీలో తినుబండారాలు, అన్నం మిగులు, నీటి పాత్రలు వంటివి ఉంచకండి. పూల కుండీలు, మూలల్లో పేరుకుపోయిన మురికిని క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. అక్కడ ఆహారం లేదని పావురాలు గుర్తిస్తే క్రమంగా రావడం మానేస్తాయి.
రెగ్యులర్‌గా శుభ్రం చేయండి
పావురాల రెట్టలు పేరుకుపోతే దుర్వాసనతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి బాల్కనీని తరచూ శుభ్రం చేయడం అవసరం. చేతి గ్లవ్స్, మాస్క్ ఉపయోగించి శుభ్రపరిస్తే మరింత మంచిది. మొత్తంగా పావురాలను తరిమికొట్టేందుకు హానికర రసాయనాలు లేదా ప్రమాదకర పద్ధతులు అవసరం లేదు. చిన్న చిన్న జాగ్రత్తలు, పరిశుభ్రత, సరైన ఏర్పాట్లతో మీ బాల్కనీని పావురాల సమస్య నుంచి సులభంగా కాపాడుకోవచ్చు..
