Hold Onto Your Money, Jeff Bezos Warns Of Recession: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం భయాలు కమ్ముకొస్తున్నాయి. ఇప్పటికే అమెరికా, బ్రిటన్ దేశాల్లో ఈ పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో అమెరికన్ టెక్ దిగ్గజాలు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ట్విట్టర్, మెటా, అమెజాన్, నెట్ ఫ్లిక్స్, డిస్నీ ఇలా పలు కంపెనీలు ఖర్చులు పెరగడం, ద్రవ్యోల్భనం, మాంద్యం భయాలతో తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇది ఇక్కడికే ఆగేలా కనిపించడం లేదు. మరిన్ని కంపెనీలు కూడా ఉద్యోగులను తొలగిస్తాయని తెలుస్తోంది. ఇప్పటికే పలుదేశాల కేంద్రబ్యాంకులు వడ్డీరేట్లను పెంచకుంటూ పోతున్నాయి. ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం వచ్చే 6 నుంచి 12 నెలల్లో మాంద్యం తప్పదని హెచ్చరిస్తున్నారు.
Read Also: Economic depression: ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం.. ఐటీ ఉద్యోగులపై వేలాడుతున్న కత్తి
ఇదిలా ఉంటే అపర కుబేరుడు, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఆర్థికమాంద్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు డబ్బును దాచుకోవాలని, ఖర్చు పెట్టడం తగ్గించాలని సూచించాడు. రాబోయే నెలల్లో అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలని సలహా ఇచ్చారు. అమెరికా ఆర్థికమాంద్యం వైపు వెళ్తున్న నేపథ్యంలో ప్రజలు కొత్త కార్లు, టీవీలు, ఫ్రిజ్ లను కొనుగోలు చేయడం మానుకోవాలని అన్నారు. ప్రజలు కొద్దిగా రిస్క్ తీసుకోవాలన్నారు. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ బాగా లేదని.. మీరు ఆర్థిక వ్యవస్థలోని పలురంగాల్లో తొలగింపులను చూస్తున్నారని పరోక్షంగా ఐటీ తొలగింపులను ప్రస్తావించారు. మీరు పెద్ద స్క్రీన్ టీవీ కొనుగోలు చేయాలనుకుంటే కొంత కాలం వేచి ఉండీ ఏం జరుగుతుందో చూడాలి అని సలహా ఇచ్చారు.
గతేడాది అమెజాన్ సీఈఓగా దిగిపోయిన జెఫ్ బెజోస్ ప్రస్తుతం అమెజాన్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. 124 బిలియన్ డాలర్ల ఆస్తిలో ఎక్కువశాతం వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు, స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే తన సంపదలో ఎంత మొత్తం ఇవ్వాలనుకున్నారో వెల్లడించలేదు.