NTV Telugu Site icon

Fund For Orphans: హిమాచల్ ప్రదేశ్ సీఎం న్యూ ఇయర్ గిఫ్ట్.. అనాథలకు ప్రత్యేక నిధి

Sukhvinder Singh

Sukhvinder Singh

Fund For Orphans: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖూ అనాథ పిల్లల ఉన్నత విద్యకు నిధిని ప్రకటించారు. రాష్ట్రంలోని సుమారు 6,000 మంది అనాథ పిల్లలకు నూతన సంవత్సర కానుకగా రూ. 101 కోట్ల నిధి(సీఎం సుఖాశ్రయ సహాయత కోష్‌)ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిధిని రాష్ట్ర ప్రభుత్వం వారి ఉన్నత విద్య, రోజువారీ అవసరాల కోసం వినియోగిస్తామన్నారు. ప్రభుత్వంలోని మొత్తం 40 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ మొదటి జీతం నుంచి ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారని, కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద పరిశ్రమల నుంచి మరిన్ని నిధులు సేకరిస్తామని చెప్పారు. అనాథ శరణాలయాల్లో నివసించేవారికి, ఒంటరి మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆయన ప్రకటించారు.

Read Also: Extramarital Affair : సఫ్దర్ జంగ్ ఆస్పత్రి జంట హత్యల కేసును ఛేదించిన పోలీసులు

ఈ నిధినుంచి వారికి నెలకు రూ. 4,000 పాకెట్ మనీలా అందజేస్తామన్నారు. తద్వారా వారు తమ అవసరాలను తీర్చుకోవడానికి ఈ మొత్తాన్ని వాడుకోవచ్చని తెలిపారు. ఈ పథకం కింద లబ్ధిదారులు కావాలంటే ఎలాంటి ఆదాయ ధృవీకరణ పత్రం అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేవలం దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందని తెలిపింది. నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాకు సహాయం అందించబడుతుందని ఆయన చెప్పారు. ఒంటరి మహిళల వివాహాలకు కూడా నిధులు మంజూరు చేస్తామన్నారు.

Read Also: Massive Protest: ఇండియా గేట్ వద్ద జైనుల భారీ ప్రదర్శన.. జార్ఖండ్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు

రాష్ట్ర ప్రభుత్వం అన్ని శిశు సంరక్షణ సంస్థలు, వృద్ధాశ్రమాలు, నారీ సేవా సదన్, శక్తి సదన్, ప్రత్యేక గృహాల ఖైదీలకు రూ.500 పండుగ గ్రాంట్లను అందజేస్తుందని ఆయన చెప్పారు. ‘యే కరుణా నహీం, అధికార్ హై (ఇది కరుణ కాదు, ఈ పిల్లల హక్కు)’ అని సుఖు అన్నారు. అలాంటి పిల్లల నైపుణ్యాభివృద్ధి విద్య, ఉన్నత విద్య, వృత్తి శిక్షణ ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు.

Read Also: Blink It: ‘బ్లింకిట్’కే మైండ్ బ్లాక్ అయ్యే ఆర్డర్ ఇచ్చిన బెంగుళూరు వాసి

ఈ సందర్భంగా సీఎం తన చిన్ననాటి స్నేహితుడిని గుర్తు చేసుకున్నారు. సుఖు తనకు అనాథైన ఒక స్నేహితుడు ఉన్నాడని.. అతను పండుగలకు ఇంటికి తీసుకెళ్లేవాడని చెప్పాడు. ఒకసారి తాను తన స్నేహితుడిని ఇంటికి తీసుకెళ్లినప్పుడు.. ‘నువ్వు నన్ను వెంట తీసుకెళ్తున్నావు కానీ నేను ఉండే చోట నాలాంటి మరో 40 మంది ఉన్నారని చెప్పినట్లు సీఎం వివరించారు. ఆ రోజే తాను జీవితంలో అధికార స్థానానికి చేరుకుంటే అనాథల కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నట్లు సీఎం సుఖ్‌విందర్ సింగ్ సుఖూ అన్నారు.

Show comments