Heavy Snow: తెలంగాణలో చలి పంజా విసురుతోంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. చలిగాలులతో జనం వణికిపోతున్నారు. తలపాగాలు, స్వెటర్లు లేకుండా బయట అడుగు పెట్టలేకపోతున్నారు. వాతావరణంలో మార్పులు, చలి గాలుల కారణంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) చలి తీవ్రతతో వణికిపోతోంది. రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇక్కడే నమోదవుతున్నాయి. సోమవారం రాత్రి ఉష్ణోగ్రత 8.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఆ తర్వాత సంగారెడ్డిలో 9.1 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 11.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లోనూ 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Read also: Mahesh Babu NTR: తారక్ అవుట్… నెక్స్ట్ మహేష్ బాబు
రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, కామారెడ్డి, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో ఉదయం పూట వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఇక ఢిల్లీ నుంచి వస్తున్న విమానాలు పొగ మంచు కారణంగా ఆలస్యంగా నడుస్తున్నాయని అధికారులు తెలిపారు. ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల గ్రామాల్లో అలుముకున్న దట్టమైన పొగ మంచు కారణంగా వాహనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. చిన్నారులను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.