మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఘాట్ రోడ్‌లో అదుపు తప్పిన ట్రక్కు.. 12 మంది మృతి

Truck

Truck

మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్‌లో శీతల మాత ఆలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 1:30 గంటల ప్రాంతంలో ఈ విషాదకర ఘటన జరిగింది. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయం వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. ఆ సమయంలో చిన్నిర్ వైపు నుంచి ధాన్యంతో వస్తున్న ఒక భారీ లారీ కొండవాలు ప్రాంతంలో అకస్మాత్తుగా అదుపు తప్పింది. ఈ ప్రాంతంలో భారీ వాహనాల ప్రవేశంపై నిషేధం ఉన్నప్పటికీ.. లారీ అక్కడున్న పోలీసు బారికేడ్లను, చెక్‌పోస్టును బద్దలుకొట్టుకుంటూ వేగంగా దూసుకొచ్చింది.

నియంత్రణ కోల్పోయిన ఆ లారీ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న భక్తులపైకి దూసుకెళ్లడంతో పాటు, ఆలయ ప్రహరీ గోడను, గేటును బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రయాణికులు, భక్తులు లారీ కింద నలిగిపోయారు. ఈ దుర్ఘటనలో దాదాపు 12 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే అంబులెన్స్‌లు , ఇతర వాహనాల ద్వారా సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఐదు నుంచి ఆరుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు పోలీసు సిబ్బందికి కూడా గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న వెంటనే గ్వాలియర్ కలెక్టర్ రుచికా చౌహాన్, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ధర్మవీర్ సింగ్ తదితరతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. నవరాత్రి సమయాల్లో భద్రత కోసం ఏర్పాటు చేసిన బారికేడ్లను లారీ ఎలా దాటగలిగిందనేదానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అలాగే లారీలో సాంకేతిక లోపం తలెత్తిందా లేక డ్రైవర్ నిర్లక్ష్యమా అనే కోణంలో ఆర్టీఓ బృందం కూడా విచారణ జరుపుతోంది. ఈ అకస్మాత్తు ప్రమాదంతో గ్వాలియర్‌లో తీవ్ర విషాదం అలుముకుంది.