Gurmeet Ram Rahim Release: మరోసారి జైలు నుంచి బయటకు డేరా బాబా.. 17వ సారి పెరోల్‌పై విడుదల

Gurmeet Ram Rahim

Gurmeet Ram Rahim

Gurmeet Ram Rahim Release: అత్యాచారం కేసులో దోషిగా తేలిన డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అలియాస్ డేరా బాబాకు మరోసారి పెరోల్‌ దొరికింది.. దీంతో మళ్లీ జైలు నుంచి బయటకు వచ్చారు డేరా బాబా… అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న ఆయనకు మరో 21 రోజుల పెరోల్‌ మంజూరైంది. 2017లో శిక్ష పడిన తర్వాత ఇది ఆయనకు ఇది 17వ తాత్కాలిక విడుదల కావడం గమనార్హం. హర్యానాలోని రోహ్‌తక్ సునారియా జైలు నుంచి ఈ రోజు తెల్లవారుజామున రామ్ రహీమ్ బయటకు వచ్చారు. పెరోల్‌ కాలంలో సిర్సాలోని డేరా సచ్చా సౌదా ప్రధాన కార్యాలయంలో ఆయన ఉండనున్నారు. మేలో మంజూరైన 30 రోజుల పెరోల్ పూర్తయిన కొద్ది వారాలకే మరోసారి తాత్కాలిక విడుదల లభించింది. ఈ ఏడాది ఆయనకు ఇది మూడో తాత్కాలిక విడుదల.

అత్యాచారం కేసులో 20 ఏళ్ల శిక్ష
2017 ఆగస్టులో పంచకుల ప్రత్యేక సీబీఐ కోర్టు ఇద్దరు మహిళా శిష్యులపై అత్యాచారం చేసిన కేసులో రామ్ రహీమ్‌ను దోషిగా తేల్చింది. అనంతరం ఆయనకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. తీర్పు అనంతరం పంచకుల, సిర్సా ప్రాంతాల్లో ఆయన అనుచరులు హింసాత్మక ఆందోళనలకు దిగడంతో 40 మందికి పైగా మరణించినట్లు అప్పట్లో నివేదికలు వెలువడ్డాయి. ఇదిలా ఉండగా, డేరా మాజీ మేనేజర్ రంజిత్ సింగ్ హత్య కేసు, జర్నలిస్ట్ రామ్‌చందర్ ఛత్రపతి హత్య కేసుల్లో కూడా రామ్ రహీమ్‌పై ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ రెండు హత్య కేసుల్లో పంజాబ్, హర్యానా హైకోర్టు తరువాత ఆయనను నిర్దోషిగా ప్రకటించింది.

2017 తర్వాత 17వ తాత్కాలిక విడుదల
2017లో శిక్ష పడిన తర్వాత రామ్ రహీమ్‌కు పలుమార్లు పెరోల్ లభించింది.. 2020 అక్టోబర్‌లో తొలిసారి తాత్కాలిక విడుదల లభించగా, ఆ తర్వాత 2021, 2022, 2023, 2024, 2025 సంవత్సరాల్లోనూ వివిధ సందర్భాల్లో పెరోల్ పొందారు. కొన్ని విడుదలలు కొన్ని రోజుల నుంచి 50 రోజుల వరకు కొనసాగాయి. 2026 జనవరిలో 40 రోజుల పెరోల్, మేలో 30 రోజుల పెరోల్ పొందిన రామ్ రహీమ్‌కు తాజాగా మరో 21 రోజుల మంజూరైంది. దీంతో శిక్ష అనంతరం ఆయనకు లభించిన తాత్కాలిక విడుదలల సంఖ్య 17కు చేరింది.

వరుస పెరోల్స్‌పై విమర్శలు
అయితే, రామ్ రహీమ్‌కు తరచూ పెరోల్ మంజూరు కావడం గతంలో రాజకీయంగా కూడా వివాదాస్పదమైంది. ముఖ్యంగా ఆయన తాత్కాలిక విడుదలలు కొన్ని ఎన్నికలకు ముందు రావడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. హర్యానా, పంజాబ్, రాజస్థాన్‌తో పాటు పలు రాష్ట్రాల్లో డేరా సచ్చా సౌదాకు గణనీయమైన అనుచరగణం ఉంది. సిక్కు సంస్థలు, ముఖ్యంగా శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ, రామ్ రహీమ్‌కు పదేపదే తాత్కాలిక విడుదలలు ఇవ్వడాన్ని గతంలో విమర్శించింది. హర్యానా జైలు నిబంధనల ప్రకారం పెరోల్, ఫర్లౌ రెండూ తాత్కాలిక విడుదలలే అయినప్పటికీ వాటి అర్హతలు, నిబంధనలు వేర్వేరుగా ఉంటాయి. ఫర్లౌ సాధారణంగా శిక్షా కాలంలోనే లెక్కించబడుతుండగా, పెరోల్‌పై జైలు వెలుపల గడిపిన కాలం శిక్షకు అదనంగా పరిగణించబడుతుంది.