ముంబైలోని ప్రముఖ జీఎస్‌బీ సేవా మండల్ ప్రసిద్ధి చెందిన ‘మహా గణపతి’ గణేశోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. భక్తుల రక్షణ, వారి భద్రతతో పాటు మండలికి చెందిన అత్యంత విలువైన ఆస్తుల సంరక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది ఏకంగా రూ.703.27 కోట్ల భారీ ఉత్సవ బీమా (ఇన్సూరెన్స్) కవరేజీని తీసుకుంది. దేశ విదేశాల నుండి వచ్చే లక్షలాది మంది భక్తుల నమ్మకాలకు వేదికైన ఈ మహా గణపతిని భక్తులు “నవసాలా పావ్నారా విశ్వచా రాజా” (కోరిన కోరికలు తీర్చే విశ్వానికి రాజు) అని అత్యంత భక్తిశ్రద్ధలతో కొలుస్తారు.
ఈ ఐదు రోజుల గణేశోత్సవ వేడుకలు సెప్టెంబర్ 14 నుంచి సెప్టెంబర్ 18 వరకు అత్యంత కోలాహలంగా జరగనున్నాయి. అంతకంటే ముందే, సెప్టెంబర్ 12న రాత్రి 8 గంటలకు మండల్ నిర్వహించే ప్రత్యేక “విరాట్ దర్శన్ దివస్” రోజున ఈ మహా గణపతి తొలి రూప దర్శనాన్ని భక్తులకు కల్పించనున్నారు. ఈ వేడుకల్లో భాగంగా పర్యావరణ పరిరక్షణకు, సుస్థిరతకు మండలి ప్రాధాన్యమిస్తోంది. సాంప్రదాయ కాగితపు రసీదులను రద్దు చేసి, రసీదులన్నింటినీ డిజిటల్ విధానంలోకి మార్చడం ద్వారా కాగితం వాడకాన్ని తగ్గించాలని నిర్ణయించింది. అంతేకాకుండా, ఇక్కడ పూజించే మహా గణపతి విగ్రహం కూడా పర్యావరణ హితమైనది.
ఆధునిక పద్ధతులను ఆచరిస్తున్నప్పటికీ, ఉత్సవాలను మాత్రం వేద మంత్రోచ్ఛారణలు, సాంప్రదాయ వైదిక క్రతువుల ప్రకారమే నిర్వహిస్తారు. పండుగ రోజుల్లో భక్తులు, సేవదార్ల ద్వారా ప్రతిరోజూ లక్షకు పైగా పూజలు, రకరకాల సేవలు అందుతాయి. పూజ, అర్చన, అన్నదానం, తులాభారం, గణహోమం వంటి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా చేపడతారు. వీటిలో ప్రధాన ఆకర్షణగా నిలిచే ‘అన్నదాన సేవ’ ద్వారా రోజుకు 40,000 మందికి పైగా భక్తులకు అరటి ఆకుల్లో సాంప్రదాయ ప్రసాద భోజనాన్ని వడ్డిస్తారు. ఈ ఐదు రోజుల్లో దాదాపు 2 లక్షల మందికి పైగా భక్తులు ఈ అన్నదాన ప్రసాదాన్ని స్వీకరిస్తారని అంచనా వేస్తున్నారు.
ఈ మహా గణపతి విగ్రహాన్ని అత్యంత సుందరంగా, అద్భుతంగా అలంకరిస్తారు. మండలి కన్వీనర్ డాక్టర్ భుజంగ్ పాయ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ విగ్రహాన్ని 66 కిలోలకు పైగా బంగారు ఆభరణాలు, 335 కిలోలకు పైగా వెండి, అనేక విలువైన రత్నాలతో అలంకరిస్తారు. ఈ ఆభరణాలన్నీ భక్తులు, సేవదార్లు భక్తితో సమర్పించినవే కావడం విశేషం. శిష్టాచారం, సాంప్రదాయాలను కాపాడుకుంటూనే డిజిటలైజేషన్, పర్యావరణహిత పద్ధతులను అనుసరిస్తున్నామని మండల్ ప్రతినిధి ఆర్.జి. భట్ వెల్లడించారు.

