Group-1 Rankers Parents: పిల్లల భవిష్యత్తుతో రాజకీయాలు వద్దని గ్రూప్-1 ర్యాంకర్ల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.3 కోట్లు ఇచ్చి ఉద్యోగాలు కొనుక్కున్నారని కొందరు ఆరోపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్-1 ర్యాంకర్లు, వారి తల్లిదండ్రులు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నో పేరెంట్ వాళ్ల బాధలను వ్యక్త పరుస్తున్నారు. వాళ్ల కన్నీటి గాధలు విన్న మిగతా వాళ్లు కన్నీటి పర్యంతమవుతున్నారు. తాజాగా భర్తను కోల్పోయి రూ. 11 వేలకు చిన్న ఉద్యోగం చేస్తూ తన కొడుకుని చదివించుకున్న ఓ తల్లి ఆవేదన అందరూ కరిగిపోయేలా చేసింది. ఆమె తన గోడును పంచుకుంది.
READ MORE: Group1 Ranker Mother: ఈ జర్నీలో నాన్ననే కోల్పోయాడు.. గ్రూప్-1 ర్యాంకర్ తల్లి కన్నీటి పర్యంతం..
ఆ తల్లి మాట్లాడుతూ.. “మా బాబు చాలా కష్టపడి చదివాడు.. తండ్రిని కోల్పోయినా కొంగిపోలేదు.. నేను భర్తను కోల్పోయాను.. కష్టపడి నా కొడుకును చదివించాను.. 30 వేల రూపాయలు కూడా ఏనాడు కళ్ళ తో చూసుకున్న పరిస్థితి లేదు.. నాకు భయంగా ఉంది.. నా కొడుకును కూడా కోల్పోతాను ఏమో అని గుండె జల్లుమంటోంది.. ఒక్క 10 రూపాయల బిళ్ళ పెట్టి ఉద్యోగం కొన్నట్టు నిరూపించినా మాకు ఈ ఉద్యోగం వద్దు.. ఎలాంటి శిక్ష ఐనా వేయండి.. ఒక ప్రభుత్వ స్కూల్ లో స్వీపర్ గా పనిచేస్తూ.. నా కొడుకును చదివించాను.. ఇంటి నిండా పుస్తకాలు ఉన్నాయి తప్ప.. ఎంత వెతికినా 10 నోట్లు కూడా కనిపించవు.. కష్టపడి చదివిన స్టూడెంట్స్ ను ఏం చేద్దామని తప్పుడు కామెంట్స్ చేస్తున్నారు.. దేవుడా.. ర్యాంక్ తెచ్చుకుంటే ఇన్ని అవమానాలా..! అనుకునే పరిస్థితి. 3 కోట్లు ఎవరు తీసుకున్నారు… ఎక్కడ తీసుకున్నారు.. ఎలా తీసుకున్నారు.. న్యాయం జరుగుతుంది అనే నమ్మకం ఉంది.. మీ రాజకీయాలు.. మీరు మీరు చూసుకోండి. మీ స్వార్థానికి మా పిల్లలను బలి చేయకండి.. మా పిల్లలను పావులుగా వాడుకోకండి.. ” అని ఓ తల్లి వేదికపై కన్నీరు మున్నీరుగా విలపించింది.
