Site icon NTV Telugu

IPL 2025: ఐపీఎల్ 2025 విజేత ఎవరు?.. గ్రోక్‌ సమాధానం ఇదే!

Ipl 2025 Captains Photoshoo

Ipl 2025 Captains Photoshoo

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) అంకుర సంస్థ ఎక్స్‌ఏఐ గ్రోక్ ఏఐ చాట్‌బాట్‌ సేవల్ని అందిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల యూజర్లు అడిగిన ప్రశ్నలకు గ్రోక్ ఇస్తున్న ఆసక్తికర సమాధానాలు చూసి అందరూ షాక్ అవుతున్నారు. స్థానిక భాషలల్లో కూడా సమధానాలు ఇస్తుండటంతో నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. గ్రోక్ కొన్నింటికి కచ్చితమైన సమాధానాలు ఇస్తుండడం విశేషం. తాజాగా ఓ అభిమాని ఐపీఎల్ 2025 విజేత ఎవరు? అని అడగగా.. ఆసక్తికర సమాధానం చెప్పింది.

ఐపీఎల్ 2025 టైటిల్ గెలిచే అవకాశాలు మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌కు ఎక్కువగా ఉన్నాయని అభిమాని అడిగిన ప్రశ్నకు గ్రోక్ బదులిచ్చింది. ‘2025 సీజన్ ఇంకా ప్రారంభం కాలేదు. సీజన్ మొదటి మ్యాచ్ మార్చి 22న కోల్‌కతా, బెంగళూరు మధ్య జరగనుంది. టోర్నమెంట్ ఆరంభం ముందే విన్నర్ ఎవరో చెప్పడం అసాధ్యం. జట్టు ప్రదర్శన, ఆటగాడి ఫామ్, గాయాలు, వ్యూహాత్మక నిర్ణయాలు వంటి అనేక అంశాలపై ఫలితం ఆధారపడి ఉంటుంది. గత చరిత్ర, ఇటీవలి మెగా వేలం, ప్రస్తుత ఫామ్ ఆధారంగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి జట్లు టైటిల్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ముంబై కాస్త ముందు వరుసలో ఉంది’ అని గ్రోక్ పేర్కొంది.

‘రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా వంటి ఆటగాళ్లతో ముంబై ఇండియన్స్ పటిష్టంగా ఉంది. ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ వంటి ఆటగాళ్లతో చెన్నై సూపర్ కింగ్స్ కూడా బలంగానే ఉంది. 2024లో మూడవ టైటిల్‌ను గెలుచుకున్న డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా పోటీలో ఉంది. శ్రేయాస్ అయ్యర్ కొనుగోలుతో పంజాబ్ కింగ్స్, రిషబ్ పంత్ ను సొంతం చేసుకున్న లక్నో సూపర్ జెయింట్స్ కూడా బలమైన పోటీదారులుగా కనిపిస్తున్నాయి’ అని గ్రోక్ సమాధానం ఇచ్చింది. మొత్తానికి ముంబైకి టైటిల్ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని గ్రోక్ అభిప్రాయపడింది.

Exit mobile version