NTV Telugu Site icon

YSR Awards 2023: ఇవాళ వైఎస్సార్ అవార్డుల ప్రదానోత్సవం.. ఎవరికి ఏ అవార్డు అంటే..

Ysr Awards 2023

Ysr Awards 2023

YSR Awards 2023: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ పేరుతో అవార్డులు అందజేస్తున్న విషయం విదితమే.. వివిధ రంగాల్లో ప్రతిభావంతులను ఎంపిక చేసి.. వారికి అవార్డులు అందిస్తూ వస్తున్నారు.. ఇక, వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్, వైఎస్ఆర్ అచీవ్‌మెంట్ అవార్డులు-2023ని అందజేయనున్నారు.. ఏపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఆ కార్యక్రమం జరగనుంది.. విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే అవార్డుల ప్రదానోత్సవానికి రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ముఖ్య అతిథిగా, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు ఏ1- కన్వెన్షన్ హాల్‌లో వైఎస్సార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు.. ఇక, వైఎస్సార్ అవార్డుల్లో 23 లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్‌, 4 ఎచీవ్‌మెంట్‌ అవార్డులు.. వ్యవసాయం, కళలు, సాంప్రదాయాలు, తెలుగు భాష– సాహిత్యం, క్రీడలు, వైద్యం, మీడియా, సమాజ సేవ రంగాల్లో ప్రతిభావంతులకు ఈ అవార్డులు అందజేయనున్నారు. ఆయా రంగాల్లో ఎంపికైన వారికి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అవార్డులు అందజేయనున్నారు.

హై-పవర్ స్క్రీనింగ్ కమిటీ అవార్డులు పొందుతున్న సంస్థలు మరియు వ్యక్తుల జాబితాను ప్రకటించింది. ఏపీ ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది కూడా అత్యున్నత పురస్కారాలను ‘సామాన్యుల్లోని అసాధారణ వ్యక్తులు, మానవతావాదులకు’ ప్రదానం చేస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇక, డాక్టర్ వైఎస్ఆర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుకు రూ. 10 లక్షల నగదు, డాక్టర్ వైఎస్‌ఆర్ కాంస్య బొమ్మ, స్మారక చిహ్నం మరియు ప్రశంసా పత్రాన్ని అందజేస్తుంది. డాక్టర్ వైఎస్ఆర్ అచీవ్‌మెంట్ అవార్డు కింద రూ. 5 లక్షల నగదు బహుమతి, సావనీర్, ప్రశంసా పత్రం అందజేస్తారు. ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాల) సజ్జల రామకృష్ణా రెడ్డి, జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, సలహాదారు (కమ్యూనికేషన్స్) జి.వి.డి. కృష్ణమోహన్‌, ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి ముత్యాల రాజు, పీఆర్‌ కమిషనర్‌ విజయకుమార్‌రెడ్డి, వివిధ శాఖల ప్రధాన కార్యదర్శులు స్క్రీనింగ్‌ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.

ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపికైన వ్యక్తులు మరియు సంస్థల జాబితా విషయానికి వస్తే..

* క్రీడలు: పుల్లెల గోపీచంద్ (గుంటూరు జిల్లా), కరణం మల్లీశ్వరి (శ్రీకాకుళం జిల్లా) అవార్డులు అందుకోనున్నారు.

* వ్యవసాయం: 1. పాంగి వినీత (సాఫల్య పురస్కారం).. 2. వైవీ మల్లా రెడ్డి (అనంతపురం జిల్లా)

* కళలు మరియు సంస్కృతి: 1. యడ్ల గోపాలరావు, రంగస్థల కళాకారుడు (శ్రీకాకుళం జిల్లా).. 2. తలిశెట్టి మోహన్, కలంకరి (తిరుపతి జిల్లా).. 3. కోట సచ్చిదానంద శాస్త్రి, హరికథ (బాపట్ల జిల్లా).. 4. కోన సన్యాసి, తప్పెటగుళ్లు (శ్రీకాకుళం జిల్లా).. 5. ఉప్పాడ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ (కాకినాడ).. 6. ఎస్వీ రామారావు, పెయింటింగ్ (కృష్ణా జిల్లా).. 7. రావు బాల సరస్వతి, నేపథ్య గాయని (నెల్లూరు జిల్లా).. 8. తల్లావజ్జుల శివాజీ, పాత్రికేయుడు మరియు రచయిత (ప్రకాశం జిల్లా).. 9. చింగిచెర్ల కృష్ణా రెడ్డి, జానపద కళలు (అనంతపురం జిల్లా).. 10. కాళీ సాహెబీ మహబూబ్ మరియు షేక్ మహబూబ్ సుబానీ, నాదస్వరం (ప్రకాశం జిల్లా).

* తెలుగు భాష మరియు సాహిత్యం: 1. ప్రొఫెసర్ బేతవోలు రామబ్రహ్మం (పశ్చిమగోదావరి జిల్లా), 2. ఖదీర్ బాబు (నెల్లూరు జిల్లా) అచీవ్ మెంట్ అవార్డు, 3. మహోజబీన్ (నెల్లూరు జిల్లా) అచీవ్‌మెంట్ అవార్డు, 4. నామిని సుబ్రహ్మణ్యం నాయుడు (చిత్తూరు జిల్లా), 5. అట్టాడ అప్పలనాయుడు (శ్రీకాకుళం జిల్లా).

* క్రీడలు: 1. పుల్లెల గోపీచంద్ (గుంటూరు జిల్లా), 2. కరణం మల్లీశ్వరి (శ్రీకాకుళం జిల్లా)

* వైద్య మరియు ఆరోగ్యం: 1. ఇండ్ల రామసుబ్బారెడ్డి, సైకియాట్రిస్ట్ (ఎన్టీఆర్ జిల్లా), 2. ఈసీ వినయ్ కుమార్ రెడ్డి, ENT స్పెషలిస్ట్, (YSR జిల్లా).

* మీడియా: 1. గోవిందరాజు చక్రధర్ (కృష్ణా జిల్లా), 2. హెచ్‌ఆర్‌కే (కర్నూలు జిల్లా)

* సామాజిక సేవ: 1. బెజవాడ విల్సన్ (ఎన్టీఆర్ జిల్లా), 2. శ్యామ్ మోహన్ (అంబేద్కర్ కోన సీమ జిల్లా) అచీవ్‌మెంట్ అవార్డు, 3. నిర్మల్ హృదయ్ భవన్ (ఎన్టీఆర్ జిల్లా), 4. జి. సమరం (ఎన్టీఆర్ జిల్లా).

Show comments