పశ్చిమాసియా యుద్ధం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. గత మూడు వారాలుగా జరుగుతున్న యుద్ధం అన్ని దేశాలను బెంబేలెత్తిస్తోంది. ప్రధానంగా చమురు, గ్యాస్ సంక్షోభం తీవ్ర స్థాయికి చేరింది. యుద్ధం ప్రారంభమై 24 రోజులవుతోంది. దీంతో ఆయా దేశాల్లో ఉన్న చమురు, గ్యా్స్ నిల్వలు తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా దేశాల్లో నష్ట నివారణ చర్యలు చేపట్టాయి.
ఇంధన సంక్షోభం కారణంగా ఇంధనాన్ని ఆదా చేసేందుకు ఆయా దేశాలు సిద్ధమయ్యాయి. శ్రీలంక, బంగ్లాదేశ్‌లో పాఠశాలలు మూసేశారు. ఇక పెట్రోల్, డీజిల్ రేషనింగ్, విద్యుత్ కోతలు వంటి చర్యలు తీసుకున్నారు. పాకిస్థాన్, ఫిలిప్పీన్స్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు రోజుల పని దినాలు అమలు చేస్తున్నాయి.
ఇంధనాన్ని పొదుపుగా వాడుకోవడానికి, ఆర్థిక వ్యవస్థలను కొనసాగించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలను కఠినమైన చర్యలు తీసుకునేలా ప్రణాళికలు రచిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితికి తగ్గట్టుగా ఆసియా, ఆఫ్రికా, యూరప్ వరకు ఉన్న ప్రభుత్వాలు.. పరిమితంగా ఉన్న ఇంధన నిల్వల వినియోగాన్ని గరిష్ఠ స్థాయికి పెంచడానికి ప్రభుత్వ సెలవులు, ఇంటి నుంచి పని, ఇంధన రేషనింగ్, పారిశ్రామిక కార్యకలాపాల నిలిపివేత వంటి చర్యలను అమలు చేస్తున్నాయి.
ఇక ఆసియా దేశాల్లో శ్రీలంకలో పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, అత్యవసరం కాని ప్రభుత్వ ఉద్యోగులకు తప్పనిసరి సెలవులను ప్రకటించింది. ఇక పెట్రోల్, డీజిల్ కోటాలను పరిమితం చేయడానికి క్యూఆర్ కోడ్ ఆధారిత వ్యవస్థను అమలు చేసింది. పాస్ కలిగిన వ్యక్తి వారానికి వినియోగించే పెట్రోల్, డీజిల్ పరిమాణాన్ని 15 లీటర్లకు పరిమితం చేసింది. ఇక విద్యుత్ భారాన్ని తగ్గించడానికి బంగ్లాదేశ్ అన్ని విద్యాసంస్థలను ఆన్‌లైన్ విధానానికి మార్చింది. వస్త్ర ఎగుమతి రంగానికి ప్రాధాన్యతనిచ్చేందుకు దేశీయంగా ఐదు గంటల విద్యుత్ కోతను అమలు చేసింది. ఇక ఇంధన నిల్వలను నివారించడానికి భూటాన్ జెర్రీ క్యాన్లలో ఇంధన అమ్మకాలను నిషేధించింది. అత్యవసర సేవలకు రేషనింగ్‌కు ప్రాధాన్యత ఇస్తోంది.
ఇక పాకిస్థాన్ ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు రోజుల పని వారాన్ని అమలు చేస్తోంది. ప్రభుత్వ శాఖలకు ఇంధన కేటాయింపులను కూడా 50 శాతం తగ్గించింది. ఫిలిప్పీన్స్ కూడా తన ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు రోజుల పని వారాన్ని కేటాయించింది. అత్యవసరం కాని ప్రజా ప్రయాణాలను నిషేధించింది. వియత్నాం కూడా ప్రజలను ఇంటి నుంచే పని చేయాలని, ప్రజా రవాణాను ఉపయోగించుకోవాలని కోరింది. మయన్మార్‌లో తీవ్రమైన ఇంధన కొరత కారణంగా పెట్రోల్ పంపులు మూతపడుతున్నాయి. దీంతో ప్రభుత్వం వాహనాలకు సరి-బేసి విధానాన్ని అమలు చేస్తోంది. కంబోడియాలో కూడా అనిశ్చితి కారణంగా దాదాపు మూడో వంతు పెట్రోల్ పంపులు మూతపడ్డాయి.
ఇంకెక్కడా?
లావోస్: ఇంటి నుంచి పని చేయాలని ప్రజలకు ప్రభుత్వం ఆదేశించింది. ప్రయాణాలను తగ్గించడానికి రొటేషనల్ షిఫ్టులను ప్రవేశపెట్టింది.
ఈజిప్ట్: విద్యుత్తును ఆదా చేసేందుకు మాల్స్, రెస్టారెంట్లను రాత్రి 9 గంటలకల్లా, ప్రభుత్వ భవనాలను సాయంత్రం 6 గంటలకల్లా మూసివేయాలని ఆదేశించడంతో పాటు, బిల్‌బోర్డ్ లైట్లను కూడా ఆపివేశారు.
కెన్యా: ఇంధన నిల్వలు ఏప్రిల్ వరకు మాత్రమే సరిపోతాయని అంచనా వేయడంతో ఇంధన రేషనింగ్ అమలు చేస్తోంది.
దక్షిణాఫ్రికా: డీజిల్ కొరత భయాందోళనలతో పరిశ్రమల స్థాయిలో నియంత్రిత కేటాయింపు చర్యలను అమలు చేసింది.
న్యూజిలాండ్: ప్రజలు వారానికి ఒక రోజు వాహనాలు నడపకుండా ఉండేందుకు ఎంచుకునే 1979 నాటి ‘కార్-ఫ్రీ డే’ విధానాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. వందలాది ఎయిర్ న్యూజిలాండ్ విమానాలు రద్దు చేయబడ్డాయి.
యూరప్: డీజిల్ నిల్వలను నివారించడానికి స్లోవేకియా అధికారిక కొనుగోలు కోటాలను అమలు చేసింది. అదేవిధంగా కార్లు, ట్రక్కులకు ఇంధన పరిమితులను నిర్దేశించింది.
గత నెల 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సహా అత్యున్నత నాయకులు చనిపోయారు. దీంతో ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. దీంతో పెద్ద ఎత్తున చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. అన్ని దేశాల్లో గ్యాస్ కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
