ఒక రోజు పర్వతం వైపు చూస్తే అక్కడ తెల్లగా మెరిసే మంచు కనిపించకపోవచ్చు. వేల ఏళ్లుగా అక్కడే నిలిచిన ఒక హిమానీనదం, మనం చూస్తుండగానే తన చివరి రోజులను లెక్కపెడుతుండొచ్చు. ఆ మంచు కరిగిపోవడం వెనుక కేవలం నీటి చుక్కలు ఉండవు. ఒక పర్వతం జ్ఞాపకం కరిగిపోతుంది. ఒక లోయ రూపం మారుతుంది. దాని నీటిని నమ్ముకుని బతికే లక్షలాది మంది భవిష్యత్తు కూడా మారుతుంది. ఆ భయం ఇప్పటికే హిమాలయాల్లో కనిపిస్తోంది. ఇంతకీ హిమలయాల్లో ఇప్పుడేం జరగుతుంది? నెక్ట్స్ ఏం జరగబోతుంది?
నేపాల్, చైనా సరిహద్దు సమీపంలో ఆగస్టు 26న మంచు, రాళ్లతో కూడిన భారీ శిలలు కూలిపోవడం వరదల పరంపరకు దారితీసింది. నేపాల్, టిబెట్ ప్రాంతాల్లో 1300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది ఆచూకీ తెలియకుండా పోయింది.
ఎత్తైన పర్వతాల్లో మొదలైన ఒక మార్పు, దిగువన ఉన్న మనుషుల జీవితాలను ఎంత దారుణంగా తాకగలదో ఆ ఘటన ప్రపంచానికి చూపించింది. ఇప్పుడు ప్రపంచంలోని హిమానీనదాల భవిష్యత్తును ఒక్కొక్కటిగా చూపించే ఒక కొత్త మ్యాప్ ఆ భయాన్ని మరింత దగ్గరగా తీసుకొచ్చింది. జ్యూరిక్ ETH, వ్రిజే యూనివర్సిటీ బ్రస్సెల్స్ పరిశోధకులు రూపొందించిన గ్లోబల్ గ్లేసియర్ ఎక్స్‌టింక్షన్ ఎక్స్‌ప్లోరర్ ద్వారా ప్రపంచంలోని ఏ గ్లేసియర్ భవిష్యత్తుననైనా చూడవచ్చు. భూమి ఉష్ణోగ్రత ఎంత పెరిగితే ఆ మంచు ఎంతకాలం నిలబడగలదో వేర్వేరు పరిస్థితుల్లో పరిశీలించవచ్చు. ఆ లెక్కల్లో భవిష్యత్తు నెమ్మదిగా చీకటిగా మారుతోంది. ఉష్ణోగ్రత పెరుగుదల 1.5 డిగ్రీల వద్ద పరిమితమైనా, 2041 ప్రాంతంలో ప్రతి ఏడాది దాదాపు 2000 హిమానీనదాలు కనుమరుగయ్యే స్థాయికి చేరవచ్చని పరిశోధకులు అంచనా వేశారు.
ఉష్ణోగ్రత పెరుగుదల 4 డిగ్రీలకు చేరితే, 2050ల మధ్య నాటికి ఏడాదికి దాదాపు 4000 హిమానీనదాలు కనుమరుగయ్యే పరిస్థితి రావచ్చు. 2100 సంవత్సరం వైపు చూస్తే ఆ తేడా మరింత భయపెడుతుంది. ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీల వద్ద కట్టడి చేయగలిగితే, ఈరోజు ఉన్న హిమానీనదాల్లో దాదాపు సగం వరకు నిలిచే అవకాశం ఉంటుంది. ఉష్ణోగ్రత పెరుగుదల 2.7 డిగ్రీలకు చేరితే మిగిలేది సుమారు 20 శాతం. నాలుగు డిగ్రీల వేడి ప్రపంచాన్ని తాకితే, శతాబ్దం చివరికి పది శాతానికి కూడా తక్కువ హిమానీనదాలు మాత్రమే మిగిలే ప్రమాదం ఉంది.
ఇది భవిష్యత్తులో ఎప్పుడో జరగబోయే కథలా అనిపించవచ్చు కానీ కొన్ని చోట్ల ఆ చివరి దృశ్యం ఇప్పటికే మొదలైంది. స్విట్జర్లాండ్‌లో బెల్లా టోలా హిమానీనదం 2026 ఆగస్టులో దాదాపు పూర్తిగా కనుమరుగైపోవడంతో అంతరించిపోయిన హిమానీనదంగా ప్రకటించారు. యూరిరాట్ స్టాక్ హిమానీనదం కూడా ఈ వేసవిలో అదే జాబితాలో చేరింది. ఒక హిమానీనదం ఒక్క వేసవిలో అంతరించిపోదు. ప్రతి ఏడాది కొద్దికొద్దిగా మంచు తగ్గుతుంది. ప్రతి శీతాకాలంలో పేరుకుపోవాల్సిన మంచు తగ్గిపోతుంది. ఆ నష్టం సంవత్సరాల తరబడి పేరుకుపోయి చివరికి పర్వతంపై ఒకప్పుడు కనిపించిన మంచు జ్ఞాపకంగా మాత్రమే మిగులుతుంది.
ప్రతి హిమానీనదం వెనుక ఒక ప్రదేశం ఉంటుంది. ఒక చరిత్ర ఉంటుంది. దాని నీటితో ముడిపడిన మనుషుల జీవితం ఉంటుంది. అందుకే పర్వతాలపై కరుగుతున్న ఆ మంచును దూరంగా జరుగుతున్న మార్పుగా చూడలేం. ఆ మార్పు మనవరకు వస్తే కానీ అసలు మ్యాటర్ ఏంటో అర్థంకాదులేండి!

