Site icon NTV Telugu

Georgia Protests 2025: జార్జియాలో నిరసనలకు రష్యాకు సంబంధం ఏంటి?.. ఆ దేశంలో ఏం జరుగుతుంది!

Georgia Protests 2025

Georgia Protests 2025

Georgia Protests 2025: ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో అక్కడి ప్రజలు నిరసనలు తెలపడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నేపాల్‌లో మొదలైన నిరసనల పరంపర మెల్లమెల్లగా పక్క దేశాలకు కూడా వ్యాపిస్తుంది. నేపాల్, మొరాకో తర్వాత ఇప్పుడు జార్జియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చెలరేగుతున్నాయి. శనివారం ఆ దేశంలో స్థానిక ఎన్నికలు జరిగాయి. ఎన్నికలలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై గత ఏడాది కాలంగా దేశంలో నిరసనలు జరుగుతున్నాయి. అయితే తాజాగా జరిగిన స్థానిక ఎన్నికలు ప్రజలను వీధుల్లోకి తీసుకువచ్చి నిరసనలు చేసేలా చేశాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిరసనకారులు దేశ రాజధాని టిబిలిసిలోని అధ్యక్ష భవనాన్ని ముట్టడించడానికి ప్రయత్నించారు.

READ ALSO: Karimangar : కోతులను వెళ్లగొట్టినోళ్లకే ఓట్లు వేస్తారంట..!

అధికార పార్టీకి వ్యతిరేకంగా..
దేశంలో అధికార “జార్జియన్ డ్రీమ్” పార్టీకి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు వేలాది మంది నిరసనకారులు అధ్యక్ష భవనంలోకి చొరబడటానికి ప్రయత్నించారు. ఒకప్పుడు పాశ్చాత్య అనుకూల దేశంగా పరిగణించిన జార్జియా.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తరువాత పశ్చిమ దేశాలతో సంబంధాలలో ఒత్తిడిని ఎదుర్కుంటోందని విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. జార్జియన్ డ్రీమ్ పార్టీ రష్యా పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల తరువాత లక్షలాది మంది ప్రజలు అధ్యక్ష భవనం వెలుపల గుమిగూడారు. పోలీసులు జనసమూహాన్ని నియంత్రించడానికి తీవ్రంగా కృషి చేయాల్సి వచ్చింది. నిరసన సందర్భంగా ఐదుగురు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

పలు నివేదికల ప్రకారం.. దేశ రాజధాని టిబిలిసి మధ్యలో జరిగిన నిరసన ర్యాలీకి 20 వేల మందికి పైగా ప్రజలు హాజరైనట్లు సమాచారం. ఈ నిరసన ప్రదర్శనకు ఒపెరా గాయని- సామాజిక కార్యకర్త పాటా బుర్చులాడ్జే, ప్రతిపక్ష నాయకులు నాయకత్వం వహించారు. వీరు గత ఏడాది నుంచి దాదాపు రోజువారీ నిరసనలు నిర్వహిస్తున్నారు. జనసమూహంలో చాలామంది జార్జియా, యూరోపియన్ యూనియన్ జెండాలను పట్టుకొని ఉన్నారు.

నిరసనలకు కారణం ఏమిటి?
2024 పార్లమెంటరీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని, అధికార జార్జియన్ డ్రీమ్ పార్టీ చట్టవిరుద్ధంగా అధికారాన్ని నిలుపుకుందని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం రాజీనామా చేయాలని, తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, EU సభ్యత్వ చర్చలను తిరిగి ప్రారంభించాలని దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దేశంలో ప్రతిపక్ష నాయకులు, స్వతంత్ర మీడియా, పౌర సమాజంపై పెరుగుతున్న అణచివేతకు వ్యతిరేకంగా కూడా ఈ అసంతృప్తి తలెత్తుతోందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవలి స్థానిక ఎన్నికలలో జార్జియన్ డ్రీమ్ (జిడి) పార్టీ అన్ని మున్సిపాలిటీలలో విజయం సాధించినట్లు ప్రకటించినప్పుడు ప్రజాగ్రహం పెల్లుబిక్కింది.

రష్యా సంబంధాలపై ప్రజల ఆగ్రహం..
పలు నివేదికల ప్రకారం.. అధికార పార్టీ రష్యన్ అనుకూలమని ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు. ఒక విదేశీ వార్తా సంస్థ ప్రకారం.. గత ఏడాది ఓటింగ్ తర్వాత ప్రభుత్వం EU ప్రవేశ చర్చలను వెంటనే నిలిపివేసింది. దీనితో నాటి నుంచి దేశంలో విస్తృత నిరసనలు కొనసాగుతున్నాయి. తాజా నిరసనలపై ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. జార్జియా అధ్యక్షురాలు సలోమ్ జురాబిష్విలి ప్రతిపక్షాల చర్యను ఖండించారు. “జార్జియన్ ప్రజల 310 రోజుల శాంతియుత నిరసనను అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నారు. చట్టబద్ధమైన అధ్యక్షురాలిగా, నేను దీనిని తీవ్రంగా తిరస్కరిస్తున్నాను” అని ఆమె ప్రకటనలో పేర్కొన్నారు.

నిరసనకారుల డిమాండ్లు ఏమిటి?
నిరసన సందర్భంగా ఒపెరా గాయని పాటా బుర్చులాడ్జే నిరసనకారుల డిమాండ్లను ప్రకటించారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు దేశ ప్రజల అభిప్రాయాన్ని అంగీకరించాలని, ప్రధానమంత్రితో సహా జార్జియన్ డ్రీమ్ పార్టీకి చెందిన ఆరుగురు సీనియర్ నాయకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆమె ఒక మ్యానిఫెస్టోను విడుదల చేశారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి కొత్తగా పార్లమెంటరీ ఎన్నికలు నిర్వహించాలని, దాదాపు 60 మంది రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.

READ ALSO: High Paying Jobs For Freshers: ఫ్రెషర్లకు గుడ్‌న్యూస్.. అనుభవం లేకుండానే 5 ఉత్తమ ఉద్యోగాలు.. లక్షల్లో జీతం..

Exit mobile version