Asad Ahmed Last Rites: గ్యాంగ్‌స్టర్‌గా మారిన రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మద్ అంత్యక్రియలు భారీ పోలీసు భద్రత మధ్య ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగాయి. కొంతమంది దూరపు బంధువులు, స్థానికులను శ్మశాన వాటికలోకి అనుమతించారు. గంటపాటు అంత్యక్రియలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఉమేష్ పాల్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 19 ఏళ్ల అసద్‌ను యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఝాన్సీలో గురువారం ఎన్‌కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. అసద్‌తో పాటు అతని అనుచరుడిని కూడా ఈ ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు.
అంత్యక్రియల కంటే ముందు అసద్ మామ ఉస్మాన్ తన మేనల్లుడి మృతదేహంతో శ్మశానవాటికకు చేరుకున్నాడు. భారీ బందోబస్తు ఉన్న శ్మశాన వాటికలోకి మీడియా రాకుండా కఠినంగా ఆంక్షలు విధించారు. కాగా.. తన కొడుకు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని అతిఖ్ అహ్మద్ ప్రయాగ్‌రాజ్ కోర్టును కోరగా అతనికి నిరాశే ఎదురైంది. అంబేద్కర్ జయంతి దృష్ట్యా శుక్రవారం సెలవు దినం కావడంతో రిమాండ్ మేజిస్ట్రేట్‌కు అభ్యర్థన పంపినట్లు ఆయన తరపు న్యాయవాది మనీష్ ఖన్నా తెలిపారు. అయితే, శనివారం చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో అతిక్ దరఖాస్తును సమర్పించేలోపే అంత్యక్రియలు జరిగాయి. దీంతో కుమారుడిని కడసారి చూసుకోలేకపోయానని అతడు మనోవేదనకు గురైనట్లు తెలుస్తోంది.
Read Also: BY Vijayendra: కాంగ్రెస్ నేత కాళ్లను తాకిన యడియూరప్ప కుమారుడు.. వీడియో వైరల్
ఉమేష్ పాల్ హత్య అనంతరం అసద్ 50 రోజులు పరారీరో ఉన్నాడు. అయితే తన తండ్రిని పోలీసులు అహ్మదాబాద్ నుంచి ప్రయాగ్‌రాజ్ తరలిస్తున్నారని తెలిసి అతడ్ని తప్పించేందుకు ప్లాన్ చేసి దొరికాడు. ఉమేష్ పాల్ హత్య కేసులో వాంటెడ్‌గా ఉన్న అసద్, అతని సహచరుడు గులాం గురువారం ఝాన్సీ సమీపంలో ఉత్తరప్రదేశ్ పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో కోల్పోయాడు. అతిఖ్ అహ్మద్ ఐదుగురు కుమారులలో అసద్ మూడవవాడు. ఉమేష్ పాల్ హత్య అనంతరం అదృశ్యమయ్యాడు. అతిఖ్ ఇతర కుమారులలో పెద్ద కుమారుడు ఉమర్ లక్నో జైలులో ఉండగా, రెండవ కుమారుడు అలీ వేర్వేరు కేసుల్లో నైని సెంట్రల్ జైలులో ఉన్నారు. నాల్గవ కుమారుడు అహ్జామ్, చిన్న కుమారుడు అబాన్ ప్రయాగ్‌రాజ్‌లోని జువైనల్ హోమ్‌లో ఉన్నారు. అసద్ సమాధిని తానే త్రవ్వినట్లు పేర్కొన్న జాను ఖాన్ ప్రకారం, అతిఖ్ తల్లిదండ్రుల అవశేషాలు కూడా అదే స్మశాన వాటికలో (కసరి మసారి) ఖననం చేయబడ్డాయి. 2006 ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసులో అతిఖ్ ప్రస్తుతం జీవిత ఖైదును అనుభవిస్తున్నాడు.