Site icon NTV Telugu

France Political Crisis: ఫ్రాన్స్‌లో రాజకీయ సంక్షోభం.. మాజీ అధ్యక్షుడికి జైలు శిక్ష!

Nicolas Sarkozy Jail

Nicolas Sarkozy Jail

France Political Crisis: ఫ్రాన్స్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఫ్రెంచ్ చరిత్రలో ఐదేళ్ల జైలు శిక్ష అనుభవించనున్న తొలి నాయకుడిగా దేశ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ రికార్డు సృష్టించనున్నారు. పారిస్‌లోని లా శాంటే జైలులో మంగళవారం నుంచి ఆయన శిక్ష ప్రారంభం కానుందని విశ్లేషకులు చెబుతున్నారు. 2007 అధ్యక్ష ఎన్నికల ప్రచారం కోసం లిబియా నుంచి చట్టవిరుద్ధంగా నిధులు పొందడం ద్వారా ఆయనపై నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని సర్కోజీపై ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆయన తాను నిర్దోషినని చెబుతున్నారు.

READ ALSO: Raviteja : కిక్ ఇవ్వడానికి రెడీ?

VIP విభాగంలో మాజీ అధ్యక్షుడికి శిక్ష..
ఈ జైలులో 19వ శతాబ్దం నుంచి చాలా మంది ప్రసిద్ధ ఖైదీలు శిక్షలను అనుభవించారు. వారిలో తప్పుడు రాజద్రోహం ఆరోపణలు ఎదుర్కొన్న కెప్టెన్ ఆల్ఫ్రెడ్ డ్రేఫస్, ఫ్రాన్స్‌లో అనేక దాడులు చేసిన వెనిజులా ఉగ్రవాది కార్లోస్ ది జాకల్ వంటి వారు ఉన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా తనను ఏకాంత నిర్బంధంలో ఉంచాలని మాజీ అధ్యక్షుడు సర్కోజీ లె ఫిగరో వార్తాపత్రికతో చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయనకు VIP విభాగం జైలు కేటాయించే అవకాశం ఉందని చెబుతున్నారు. 1867లో ప్రారంభించిన లా సాంటే జైలులోని పరిస్థితులను, సర్కోజీ అక్కడ ఎలాంటి ఎదుర్కోవచ్చో మాజీ ఖైదీలు వివరించారు. ఇటీవలి సంవత్సరాలలో జైలు పూర్తిగా పునరుద్ధరించినట్లు పలువురు ఖైదీలు వెల్లడించారు.

నిధుల దుర్వినియోగం ఆరోపణలపై 2020 నుంచి 2022 వరకు అదే జైలులోని వీఐపీ విభాగంలో ఉన్న మాజీ వ్యాపారవేత్త, రచయిత పియరీ బాటన్.. మీడియాతో మాట్లాడుతూ.. ఇక్కడకు వస్తున్నది ఫ్రెంచ్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ కాదు, ఆయన కేవలం ఒక సాధారణ వ్యక్తి, అందరూ అనుభవించిన శిక్షను ఆయన అనుభవించబోతున్నారని పేర్కొన్నారు. పారిస్ కోర్టు తన చారిత్రక తీర్పులో.. సర్కోజీ నేరం ప్రజా శాంతికి తీవ్ర అంతరాయం కలిగించిందని, అప్పీల్ విచారణ కోసం వేచి ఉండకుండా, వెంటనే ఆయన శిక్షను ప్రారంభించాలని ఆదేశించింది.

ఆరోపణలను ఖండించిన సర్కోజీ ..
మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. అప్పీలు పెండింగ్‌లో ఉన్నా తనను జైలుకు పంపాలనే నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఆయన లా ట్రిబ్యూన్ డిమాంచె వార్తాపత్రికతో మాట్లాడుతూ.. “నేను జైలుకు భయపడను. లా శాంటేలోని జైలు గేట్ల ముందు కూడా నా తల పైకెత్తి నిలబడతాను. చివరి శ్వాస వరకు నేను పోరాడతాను” అని పేర్కొన్నారు. పలు నివేదికల ప్రకారం.. సర్కోజీ ఇప్పటికే తన జైలు జీవితానికి సిద్ధపడ్డారు. ఆయన తన జైలు సంచిలో దుస్తులు, తన కుటుంబానికి సంబంధించిన 10 ఛాయాచిత్రాలు పెట్టుకున్నారని వెల్లడించాయి. ఆయన లె ఫిగరో వార్తాపత్రికతో మాట్లాడుతూ.. తాను మూడు పుస్తకాలు తీసుకుంటానని చెప్పారు. వాటిలో ది కౌంట్ ఆఫ్ మోంటే క్రిస్టో (రెండు వాల్యూమ్‌లలో), మరొకటి యేసుక్రీస్తు జీవిత చరిత్ర ఉన్నాయి. ది కౌంట్ ఆఫ్ మోంటే క్రిస్టోను ఫ్రెంచ్ రచయిత అలెగ్జాండర్ డుమాస్ రాశారు. నవల కథానాయకుడు 14 ఏళ్ల జైలు శిక్ష తర్వాత తప్పించుకుని తన శత్రువులపై ప్రతీకారం తీర్చుకుంటారు.

కోర్టు నిర్ణయం ప్రకారం.. 70 ఏళ్ల సర్కోజీ జైలుకు చేరుకున్న తర్వాత మాత్రమే ఆయన కోర్టులో తన విడుదల కోసం అభ్యర్థనను దాఖలు చేయగలరు. ఆ అభ్యర్థనను పరిశీలించడానికి న్యాయమూర్తులకు రెండు నెలల సమయం ఉంటుంది. గత సోమవారం సర్కోజీ జైలు శిక్షకు సంబంధించిన కచ్చితమైన వివరాలను నేషనల్ ఫైనాన్షియల్ ప్రాసిక్యూటర్ కార్యాలయం ఆయనకు తెలియజేసింది. కానీ ఆ వివరాలను బహిర్గతం చేయలేదు. సర్కోజీ మంగళవారం లా శాంటే జైలులోకి ప్రవేశిస్తారని, ఈ సమయంలో భద్రతా చర్యలు పాటించేలా తాను వ్యక్తిగతంగా చూస్తానని న్యాయ మంత్రి జెరాల్డ్ డార్మానిన్ వెల్లడించారు. సర్కోజీకి “VIP విభాగం” అని పిలిచే దానిలో ఒక ప్రత్యేక గది లభిస్తుంది. ఈ విభాగం సాధారణ ఖైదీల నుంచి వేరుగా ఉంటుంది. ఈ విభాగం 18 ఒకేలా ఉండే గదులను కలిగి ఉంటుంది. ఒక్కొక్కటి దాదాపు 9 చదరపు మీటర్లు (సుమారు 97 చదరపు అడుగులు) ఉంటుంది.

READ ALSO: Renu Desai : ఎట్టకేలకు సినిమా సైన్ చేసిన రేణు దేశాయ్.. కానీ?

Exit mobile version