Sarah Dambanevana: క్రికెట్‌లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!

  • జింబాబ్వే మాజీ మహిళా క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా డంబానేవానా
  • 36 ఏళ్ల వయసులో కన్నుమూత..
  • సోమవారం హరారేలో ఆమె మరణించినట్లు జింబాబ్వే క్రికెట్ వెల్లడి..
Sarah Dambanevana

Sarah Dambanevana

Sarah Dambanevana: క్రికెట్ ప్రపంచంలో విషాదం చోటుచేసుకుంది. జింబాబ్వే మాజీ మహిళా క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా డంబానేవానా కేవలం 36 ఏళ్ల వయసులోనే తుదిశ్వాస విడిచారు. సోమవారం హరారేలో సారా మరణించినట్లు జింబాబ్వే క్రికెట్ అధికారికంగా విషయాన్ని వెల్లడించింది.

జింబాబ్వే క్రికెట్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది మార్చిలో ఓ వైద్య ప్రక్రియ తర్వాత సారా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అప్పటి నుంచి వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించి సోమవారం కన్నుమూశారు. సారా డంబానేవానా కేవలం 19 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టారు. 2009 నుంచి 2014 వరకు జింబాబ్వే మహిళల జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. 2011 ప్రపంచకప్ క్వాలిఫయర్‌లోనూ జింబాబ్వే తరఫున ఆడారు.

క్రికెటర్‌గా కెరీర్ ముగిసిన తర్వాత అంపైరింగ్ వైపు అడుగులు వేసిన సారా.. 2022లో ఐసీసీ అంపైర్ల డెవలప్‌మెంట్ ప్యానెల్‌లో చోటు సంపాదించారు. 33 ఏళ్ల వయసులో సీనియర్ అంతర్జాతీయ అంపైర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆపై 2023 సెప్టెంబర్ 2న సారా సీనియర్ అంతర్జాతీయ అంపైరింగ్ కెరీర్ ప్రారంభమైంది. తక్కువ సమయంలోనే ప్రతిష్ఠాత్మక ఐసీసీ టోర్నమెంట్లలో మ్యాచ్ అధికారిగా వ్యవహరించే అవకాశాన్ని దక్కించుకున్నారు. యూఏఈ వేదికగా జరిగిన 2024 మహిళల టీ20 ప్రపంచకప్‌తో పాటు భారత్, శ్రీలంక వేదికలుగా జరిగిన 2025 మహిళల వన్డే ప్రపంచకప్‌లోనూ ఆమె అంపైరింగ్ చేశారు. ఈ రెండు మెగా టోర్నమెంట్లలో చరిత్రాత్మక ఆల్-ఫీమేల్ మ్యాచ్ అఫీషియల్స్ ప్యానెల్‌లో సారా భాగమయ్యారు.

2023లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఫైనల్‌కు సారా అంపైర్‌గా వ్యవహరించారు. దీంతో ఏ విభాగంలోనైనా ప్రపంచకప్ ఫైనల్‌లో అంపైరింగ్ చేసిన తొలి జింబాబ్వే మహిళా అంపైర్‌గా చరిత్ర సృష్టించారు. తన అంపైరింగ్ కెరీర్‌లో మొత్తం 63 సీనియర్ అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఆమె అంపైర్‌గా వ్యవహరించారు. వీటిలో 42 మహిళల టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు, 11 మహిళల వన్డేలు, 10 పురుషుల టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఉన్నాయి. దేశవాళీ క్రికెట్‌తో పాటు అంతర్జాతీయ యూత్ టోర్నమెంట్లలోనూ ఆమె సేవలందించారు.

సారా మృతిపై జింబాబ్వే క్రికెట్ ఛైర్మన్ తవెంగ్వా ముకుహ్లానీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తొలుత క్రికెటర్‌గా, ఆ తర్వాత ప్రతిభావంతమైన అంపైర్‌గా సారా జింబాబ్వే క్రికెట్‌కు విశేష సేవలు అందించారని కొనియాడారు. ప్రపంచకప్ ఫైనల్‌లో ఆమె అంపైర్‌గా నిలబడటం జింబాబ్వే క్రికెట్ తో పాటు దేశానికే గర్వకారణమని పేర్కొన్నారు. క్రీడల్లో అత్యున్నత స్థాయికి మహిళలు కూడా చేరుకోగలరని సారా నిరూపించారని, ముఖ్యంగా మహిళలకు అవకాశాలు తక్కువగా ఉన్న రంగాల్లో యువతకు ఆమె స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు.