Haiti President: మాజీ అధ్యక్షుడు జొవెనల్ మర్డర్ మిస్టరీ వీడింది! హంతకులెవరంటే..!

Case

Case

తీవ్ర సంచలనం సృష్టించిన హైతీ (Haiti) మాజీ అధ్యక్షుడు జొవెనల్‌ మోయిస్‌ (Jovenel Moise) హత్య కేసులో విస్తుగొల్పే విషయాలు వెలుగుచూశాయి. ఈ కేసులో ఆయన సతీమణి మార్టిన్ మోయిస్(Martine Moise) హస్తం ఉందని ఓ నివేదిక బయటకు వచ్చింది.

హైతీ మాజీ ప్రధాని క్లాడ్ జోసెఫ్‌(Claude Joseph)తో కలిసి జోవెనల్ మోయిస్‌ హత్యకు ఆమె సహకరించారని ఆ నివేదిక పేర్కొంది. ఈ కేసుని విచారిస్తున్న ఓ అధికారి సంచలన నివేదికను విడుదల చేశారు. అంతేకాదు.. అప్పటి పోలీస్ చీఫ్ లియోన్ చార్లెస్‌ (Leon Charles)పై కూడా ఆ అధికారి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. హత్య, హత్యాయత్నం, అంతర్గత భద్రతకు వ్యతిరేకంగా కుట్ర వంటి అభియోగాలు మోపారు. ప్రస్తుతం ఈ నివేదిక హైతీలో పెను దుమారమే రేపుతోంది.

×
×
Ad

ఇలా హత్య..
2021లో హైతీ అధ్యక్షుడిగా ఉన్న జొవెనెల్‌ మోయిస్‌ (53) తన ప్రైవేటు నివాసంలోనే హత్యకు గురయ్యారు. అర్థరాత్రి సమయంలో కొందరు దుండగులు జరిపిన కాల్పుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆయన సతీమణి మార్టిన్‌ మోయిస్‌ కూడా ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. ఓ దేశాధ్యక్షుడే హత్యకు గురవ్వడంతో.. ఈ సంఘటన అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పటి ప్రధాని జోసెఫ్.. ఈ హత్యకు సాయుధ కమాండో గ్రూపు సభ్యులే కారణమని ఆరోపణలు చేశారు.

గతంలో నలుగురు అధికారులు విచారణ చేపట్టినా.. మధ్యలోనే వైదొలగారు. అనంతరం ప్రస్తుతం న్యాయమూర్తి హోదాలో ఉన్న వాల్తర్ వెస్సర్ వోల్టైర్(Walther Wesser Voltaire) అనే ఒక అధికారి ఈ కేసుని విచారిస్తున్నారు. గత నలుగురు అధికారుల తరహాలో భయపడి పారిపోకుండా.. వోల్టైర్ ఎంతో ధైర్యంగా ఈ కేసు విచారణను ప్రారంభించారు.

ఈ నేపథ్యంలోనే ఆయన మార్టిన్‌ మోయిస్‌, జోసెఫ్‌లతో పాటు డజన్ల కొద్దీ అనుమానితులపై అభియోగాలు మోపుతూ.. 122 పేజీల నివేదికను విడుదల చేశారు. అయితే.. తనపై వచ్చిన ఈ అభియోగాలను మాజీ ప్రధాని జోసెఫ్ తోసిపుచ్చారు. ప్రస్తుతం ప్రధానిగా ఉన్న ఏరియల్ హెన్రీ ఈ కేసుని తప్పుదోవ పట్టిస్తున్నారని, తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. 2021లో తనని, మార్టిన్ మోయిస్‌ని చంపడంలో వారు విఫలమయ్యారని.. ఇప్పుడు వాళ్లు తమ ఎజెండా కోసం హైతీ న్యాయ వ్యవస్థనే ఉపయోగించుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మొత్తానికి ఈ కేసు నివేదిక తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.