NTV Telugu Site icon

Tigers Death: ఆసిఫాబాద్ లో పులుల మరణాలతో అటవీ శాఖ అప్రమత్తం

Asifabad

Asifabad

కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రెండు పులుల మరణాలతో అటవీ శాఖ అప్రమత్తం అయింది. కాగజ్ నగర్ మండలం దరిగాం శివారు అటవీ ప్రాంతంలో మిగతా పులుల జాడ కోసం ఆరా తీస్తున్నారు. మూడు రోజుల వ్యవధిలోనే కే 15(ఆడ), ఎస్ 9 (మగ) అనే రెండు పులులు మృతి చెందాయి. అధికారులు వాటిని అడవుల్లోనే పోస్టు మార్టం చేసి ఖననం చేశారు. ఒక పులి టెరిటోరియల్ ఫైట్ లో మృతి చెందినట్లు గుర్తించాగా.. మరో పులి మరణంపై విష ప్రయోగం అనే అనుమానం వ్యక్తం అవుతుంది.. ఇప్పటికే శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు అటవీ శాఖ అధికారులు పంపించారు. ఆ నివేదిక వస్తే అసలు కారణం తెలిసే అవకాశం ఉంది.

Read Also: Ecuador Gunmen: లైవ్ నడుస్తుండగా తుపాకులతో స్టూడియోలోకి ప్రవేశించిన దుండగులు.. బీభత్సం

అయితే, వారం రోజుల క్రితం చనిపోయిన పశువును తిన్న నాలుగు పులులు.. ఈనెల 6వ తేదీన ఒక పులి, 8వ తేదీ మరో పులి కళేబరాలని అటవీ శాఖ అధికారులు గుర్తించారు. నాలుగు పులులు ఆ పశువును తిన్నట్టు కెమెరా ట్రాప్ లో ఆనవాళ్లు ఉన్నాయి. అది తిన్న చోటుకు చుట్టు పక్కల ఇప్పటికే రెండు పులుల కళేబరాలను గుర్తించి ఫారెస్ట్ అధికారులు ఖననం చేశారు. మరి ఆ పశువును తిన్న మిగతా పులుల సంగతేంటి అనే విషయంపై ఆరా తీస్తున్నారు. అవి సేఫ్ గానే ఉన్నాయా లేక అపాయం ఏమైనా జరిగిందా అనే దానిపై అధికారుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇక, మిగిలిన పులుల జాడ కోసం ఫారెస్ట్ అధికారులు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. అడవుల్ని జల్లెడ పడుతున్నారు.