Site icon NTV Telugu

FBI Chief Email Breached: అమెరికాకు బిగ్ షాక్.. FBI చీఫ్ ఈమెయిల్ హ్యాక్ చేసిన ఇరాన్..

Fbi Chief Copy

Fbi Chief Copy

అమెరికా నిఘా సంస్థ ఎఫ్‌బీఐ (FBI) చీఫ్ కాష్ పటేల్ వ్యక్తిగత ఈమెయిల్ హ్యాకింగ్‌కు గురైందన్న వార్త అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. ఇరాన్‌కు చెందిన హ్యాకర్ల బృందం ఈ పని చేసినట్లు స్వయంగా ప్రకటించుకుంది. ఏం జరిగిందంటే..  ఇరాన్‌తో సంబంధం ఉన్న ‘హండాలా హ్యాక్ టీమ్’ (Handala Hack Team) అనే హ్యాకర్ల సమూహం ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ వ్యక్తిగత ఇన్-బాక్స్‌ను హ్యాక్ చేసినట్లు క్లెయిమ్ చేసింది. తమ వెబ్‌సైట్‌లో ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. ‘విజయవంతంగా హ్యాక్ చేయబడిన బాధితుల జాబితాలో ఇప్పుడు కాష్ పటేల్ పేరు కూడా చేరుతుంది’ అని హ్యాకర్లు ఎద్దేవా చేశారు.

బయటపడిన వివరాలు…

హ్యాకర్లు కేవలం ప్రకటన చేయడమే కాకుండా.. కాష్ పటేల్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలను, ఆయన జీవిత విశేషాలకు సంబంధించి పత్రాన్ని కూడా ఇంటర్నెట్‌లో బహిర్గతం చేశారు. హ్యాక్ చేసిన డేటాలో 2010 నుంచి 2019 మధ్య కాలానికి సంబంధించిన వ్యక్తిగత , వృత్తిపరమైన ఈమెయిల్స్ ఉన్నట్లు సమాచారం. ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ ఈ సమాచారాన్ని పరిశీలించగా.. అందులో పాత మెయిల్స్ ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించింది.

Also Read:RBL Bank: బిగ్ షాక్.. ఆర్బీఎల్‌ బ్యాంక్‌లో భారీ కుంభకోణం..

ప్రభుత్వ స్పందన..

కాష్ పటేల్ ఈమెయిల్స్ హ్యాక్ అయిన విషయాన్ని అమెరికా న్యాయశాఖ (Justice Department) ధృవీకరించింది. అయితే.. దీని వల్ల ఎంతమేర నష్టం జరిగింది లేదా ఏ విధమైన రహస్యాలు బయటకు వచ్చాయి అనే విషయాలపై అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఎఫ్‌బీఐ కూడా ఈ ఘటనపై అధికారికంగా ఇంకా స్పందించాల్సి ఉంది.

ఎందుకు ఇది ఆందోళనకరం..?

ఒక దేశపు అత్యున్నత నిఘా సంస్థ చీఫ్ స్థాయి వ్యక్తి ఈమెయిల్ హ్యాక్ అవ్వడం అనేది భద్రతా పరంగా పెద్ద లోపంగా పరిగణించబడుతుంది. హ్యాకర్లు చెబుతున్నట్లుగా ఇందులో 9 ఏళ్ల నాటి సమాచారం ఉంటే.. ఆయన గతంలో చేపట్టిన కీలక బాధ్యతలు, వ్యక్తిగత పరిచయాలు, ఇతర సున్నితమైన అంశాలు విదేశీ హ్యాకర్ల చేతికి చిక్కినట్లేనని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి హ్యాకర్ల బృందం నుంచి మరిన్ని వివరాలు రావాల్సి ఉంది.

Exit mobile version