క్యాబ్ డ్రైవర్ ముసుగులో మిక్సింగ్ లిక్కర్ దందా.. ఇద్దరి అరెస్ట్.!

Fake Liquor Racket

Fake Liquor Racket

క్యాబ్ డ్రైవర్ ముసుగులో చీప్ లిక్కర్‌ను ఖరీదైన విదేశీ మద్యం సీసాలలో నింపి విక్రయిస్తున్న కల్తీ మద్యం ముఠా గుట్టును ఎక్సైజ్ పోలీసులు రట్టు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ డీటీఎఫ్ (DTF) సీఐ నరేందర్ ఆధ్వర్యంలోని సిబ్బంది ఈ దాడులు నిర్వహించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి మిక్సింగ్ చేసిన 10 ఫుల్ బాటిళ్ల మద్యంతో పాటు, 30కి పైగా ఖాళీ ఖరీదైన మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

​అసలేం జరిగిందంటే..
గ్రేటర్ హైదరాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయభాస్కర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. వంగలి అశోక్ (43) గతంలో ‘బగ్గా డిస్టిలరీ’ మద్యం తయారీ పరిశ్రమలో పనిచేశాడు. ఆరు నెలల క్రితం అక్కడ పని మానేసి ప్రస్తుతం క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో సులువుగా డబ్బు సంపాదించేందుకు శంషాబాద్‌లోని శాతమ్రాయి ప్రాంతంలో ఉన్న తన నివాసంలోనే కల్తీ మద్యం దందాకు తెరలేపాడు.

​మహమ్మద్ యాకూబ్ పాషా (29) అనే వ్యక్తి నిర్వహిస్తున్న స్క్రాప్ (పాత సామాన్ల) దుకాణం నుంచి ఖరీదైన బ్రాండ్ల ఖాళీ మద్యం సీసాలను అశోక్ కొనుగోలు చేసేవాడు. వాటిని శుభ్రంగా కడిగి, మూతలను జాగ్రత్తగా తొలగించి, అందులో కేవలం రూ. 560 విలువచేసే ‘డౌన్ టౌన్’ (Down Town) వంటి చీప్ లిక్కర్‌ను నింపేవాడు. ఇలా జానీ వాకర్, దివార్స్ (Dewar’s), 100 పైపర్స్ వంటి ఖరీదైన బ్రాండ్ల సీసాలలో చీప్ లిక్కర్ పోసి అధిక ధరలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నాడు.
​
పక్కా సమాచారంతో దాడి:
ఈ అక్రమ దందాపై సమాచారం అందుకున్న కానిస్టేబుల్ ధనుంజయ్, సీఐ నరేందర్‌కు విషయాన్ని చేరవేశారు. దీంతో రంగంలోకి దిగిన డీటీఎఫ్ బృందం శాతమ్రాయిలోని అశోక్ ఇంటిపై ఆకస్మిక దాడి నిర్వహించింది. అక్కడ భారీ మొత్తంలో మిక్సింగ్ చేసిన మద్యం బాటిళ్లు, ఖాళీ సీసాలను స్వాధీనం చేసుకుంది. అశోక్ ఇచ్చిన సమాచారంతో సీసాలు సరఫరా చేస్తున్న స్క్రాప్ దుకాణం యజమాని మహమ్మద్ యాకూబ్ పాషాను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
​
కొనుగోలుదారులపైనా నిఘా:
నిందితులు ఈ కల్తీ మద్యాన్ని స్థానికంగా ఉన్న సుమారు 10 మందికి విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. వారిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుని విచారించనున్నట్లు తెలిపారు. నిందితులను, స్వాధీనం చేసుకున్న మద్యాన్ని తదుపరి చర్యల నిమిత్తం శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు.
​ఈ ఆపరేషన్‌లో సీఐ నరేందర్‌తో పాటు ఎస్సైలు హనుమంతు, నజీర్ పాషా, ఇన్‌ఛార్జ్ సీఐ భరత్ కుమార్, సిబ్బంది ధనుంజయ్, అభినయ్, కిషన్, భాస్కర్ పాల్గొన్నారు.