Eatala Rajendar: జ్ఞానేష్ కుమార్ ఎందుకు రాజీనామా చెయ్యాలి?

Eatala Rajendar

Eatala Rajendar

Eatala Rajendar: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేయడాన్ని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఖండించారు. అసలు జ్ఞానేశ్ కుమార్ ఎందుకు రాజీనామా చేయాలని ఆయన ప్రశ్నించారు. తాజాగా ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. గతంలో తమ స్వార్థ రాజకీయాల కోసం ఎన్నికల సంఘాన్ని వాడుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని ఈటల మండిపడ్డారు. కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదన్నారు. గత 12, 13 ఏళ్లుగా ప్రజా సమస్యలను లేవనెత్తడంలో పూర్తిగా విఫలమైన ప్రతిపక్ష కాంగ్రెస్, ప్రస్తుతం ఓటమి భయం, అసహనంతోనే రాజ్యాంగ వ్యవస్థలపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రపంచంలోనే భారత దేశం ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మగా నిలిచిందని, కానీ రాహుల్ గాంధీ విదేశీ వేదికలపై భారత జాతి ఆత్మగౌరవాన్ని దిగజారుస్తూ మాట్లాడటం వల్ల ప్రజలు ఆయనను అసహ్యించుకుంటున్నారని విమర్శించారు.

“ఓటర్ల జాబితా సరి చెయ్యాలనే ప్రతిపాదన చేసింది రాహుల్ గాంధీనే. సర్ అనేది కొత్తది కాదు.. అదో నిరంతర ప్రక్రియ. ఎన్నికల సంస్కరణలు జరుగుతూనే ఉన్నాయి. ఈవీఎంలను మొదట తీసుకువచ్చింది కాంగ్రెస్.. 2017లో వీవీప్యాట్‌లను మోడీ ప్రభుత్వం తీసుకు వచ్చింది. కాంగ్రెస్ గెలిస్తే ఒకపాట, ఓడితే మరో పాట పాడుతుంది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయగలితే 400 సీట్లు దాటే వాళ్ళం కదా..? 2026లో ఏ సర్వే చూసినా మోడీనే మళ్ళీ గెలుస్తాడు అని వస్తుంది. మోడీ వచ్చాకే.. భారత జాతీయ పతాకం విదేశాల్లో గౌరవం పొందుతుంది. సర్‌లో చనిపోయిన వాళ్ళ ఓట్లు రిమూవ్ చేస్తున్నారు. గ్రామాల్లో కొందరికి డబుల్ ఓట్లు ఉన్నాయి. మల్కాజిగిరిలో సగం ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి. చాలా మందికి తమ స్వంత గ్రామాల్లో ఓట్లు ఉండటం దీనికి ప్రధాన కారణం” అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.