EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు

Epfo

Epfo

EPFO New Portal: ఉద్యోగాలు మారే సమయంలో చాలా మంది తమ పాత ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతాలను మర్చిపోతుంటారు. దీంతో ఆ ఖాతాల్లో జమ అయిన డబ్బులు నిష్క్రియంగా ఉండిపోతాయి. ఇలాంటి ఉద్యోగులకు ఊరట కలిగించేలా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. పాత లేదా మూసివేసిన PF ఖాతాలను గుర్తించడం, అందులో ఉన్న బ్యాలెన్స్‌ను తెలుసుకోవడం, అవసరమైతే ప్రస్తుత PF ఖాతాకు బదిలీ చేసుకోవడం కోసం కొత్త డిజిటల్ పోర్టల్‌ను ప్రారంభించినట్లు కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఉద్యోగులు తమ కెరీర్‌లో పలుమార్లు సంస్థలు మారడం వల్ల ఒకటి కంటే ఎక్కువ UAN నంబర్లు లేదా PF ఖాతాలు ఏర్పడుతుంటాయి. కొన్ని సందర్భాల్లో పాత ఖాతాల్లోని డబ్బులు కొత్త ఖాతాలకు బదిలీ కాకుండా అలాగే ఉండిపోతాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు కొత్త పోర్టల్ ఉపయోగపడనుంది. ఈ ఆధార్ ఆధారిత డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా అర్హత ఉన్న EPFO సభ్యులు తమ పాత PF ఖాతాలను గుర్తించవచ్చు. ఆధార్ ద్వారా గుర్తింపు ధృవీకరణ పూర్తయిన తర్వాత, పాత ఖాతాల్లోని మొత్తాన్ని యాక్టివ్ UANకు బదిలీ చేసుకునే అవకాశం ఉంటుంది. అవసరమైతే నిష్క్రియ ఖాతాల్లోని మొత్తాన్ని క్లెయిమ్ చేసుకునే సదుపాయం కూడా కల్పించారు.

ఈ కొత్త విధానంలో ఆధార్ ఆధారిత ధృవీకరణ, ఆన్‌లైన్ PF బదిలీ, డిజిటల్ KYC అప్‌డేట్, క్లెయిమ్ పరిష్కారం వంటి సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. దీంతో కాగితపు పనులు, కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం తగ్గనుంది. అయితే పాత PF ఖాతా వివరాలు పూర్తిగా అందుబాటులో లేని సభ్యులను ఈ విధానంలో చేర్చే ప్రత్యేక ఏర్పాట్లు లేవని కేంద్రం స్పష్టం చేసింది. అందుబాటులో ఉన్న రికార్డుల ఆధారంగా ఖాతాను గుర్తించగలిగిన వారికి మాత్రమే ఈ సేవలు అందుతాయి. EPFO తీసుకున్న ఈ కొత్త చర్యతో ఉద్యోగులు తమ పదవీ విరమణ పొదుపులను సులభంగా నిర్వహించుకోవడంతో పాటు, పాత PF ఖాతాల్లో చిక్కుకున్న డబ్బులను తిరిగి పొందేందుకు మార్గం సులభతరం కానుంది.

* ఆధార్ ఆధారిత ప్రామాణీకరణ: గుర్తింపు యొక్క సురక్షితమైన డిజిటల్ ధృవీకరణ.

* ఆన్‌లైన్ బదిలీ సౌకర్యం: పాత PF బ్యాలెన్స్‌ను యాక్టివ్ UANకు బదిలీ చేసుకోవచ్చు.

* క్లెయిమ్ పరిష్కార ఎంపిక: అర్హులైన సభ్యులు నిష్క్రియంగా ఉన్న PF బ్యాలెన్స్‌ను క్లెయిమ్ చేసుకోవడానికి అనుమతించబడతారు.

* డిజిటల్ కేవైసీ: కేవైసీ అప్‌డేట్ కోసం అన్ని వివరాలను ఆన్‌లైన్‌లో సమర్పించి, ధృవీకరించుకునే సౌకర్యం.

* కాగితపు పని లేదు: ఇకపై మానవ ప్రమేయం మరియు భౌతిక పత్రాల అవసరం లేదు.

* వేగవంతమైన ప్రాసెసింగ్: పారదర్శకతను పెంచుతుంది మరియు నిష్క్రియంగా ఉన్న EPF ఖాతాల పరిష్కారాన్ని వేగవంతం చేస్తుంది.