Egg Lababdar Recipe: కోడిగుడ్లతో రొటీన్ కూరలు చేసి బోర్ కొట్టిందా..? అయితే అన్ని రకాల ఫ్లేవర్స్ మేళవింపుతో క్రీమీగా, కాస్త స్పైసీగా ఉండే అద్భుతమైన నార్త్ ఇండియన్ రెసిపీ ‘ఎగ్ లబాబ్దార్’ తప్పక ట్రై చేయాల్సిందే. ఎగ్ లవర్స్‌కి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. రోటీ, చపాతీ, నాన్ లేదా వేడివేడి రైస్‌తో ఎంతో రుచికరంగా ఉండే ఈ రెసిపీని స్టెప్ బై స్టెప్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూద్దాం.
కావలసిన పదార్థాలు:
* కోడిగుడ్లు: 4 లేదా సరిపడా
* టొమాటోలు: 4 (మీడియం సైజ్)
* జీడిపప్పులు: 20 (నానబెట్టినవి)
* ఉల్లిపాయలు: 2 పెద్దవి (సన్నగా తరిగినవి)
* అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టీస్పూన్
* పచ్చిమిర్చి: 4 (నిలువుగా చీల్చినవి)
* నూనె: 4 టేబుల్ స్పూన్లు
* గరం మసాలా: బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు
* జీలకర్ర: 1 టీస్పూన్
* పసుపు: ¼ టీస్పూన్
* కాశ్మీరీ కారం: 2 టీస్పూన్లు
* జీలకర్ర పొడి: 1 టీస్పూన్
* ధనియాల పొడి: 2 టీస్పూన్లు
* గరం మసాలా పొడి: 1 టీస్పూన్
* ఉప్పు: రుచికి సరిపడా
* పంచదార: 1 టీస్పూన్
* కసూరి మేథి: కొద్దిగా (నలిపినది)
* కొత్తిమీర: కొద్దిగా (సన్నగా తరిగినది)
తయారీ విధానం
టొమాటో-జీడిపప్పు ప్యూరీ
ముందుగా 4 మీడియం సైజ్ టొమాటోలను ముక్కలుగా కోసి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోనే నానబెట్టిన 20 జీడిపప్పులను కలిపి ఎక్కడా పలుకు లేకుండా మెత్తటి ప్యూరీలా ఫైన్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గుజ్జును వేరే గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.
స్పైసీ గ్రేవీ ప్రిపరేషన్
స్టవ్ వెలిగించి వెడల్పాటి కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. నూనె కాగాక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, ఒక టీస్పూన్ జీలకర్ర వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ ఒక టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా వేపాలి. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న టొమాటో-జీడిపప్పు గుజ్జును వేసి, మిక్సీ జార్ కడిగిన కొన్ని నీళ్లను కూడా కలిపి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి.
ఫ్లేవర్ బ్యాలెన్సింగ్
టొమాటో గుజ్జు చక్కగా వేగి నూనె పైకి తేలాక.. పావు టీస్పూన్ పసుపు, రెండు టీస్పూన్ల కాశ్మీరీ కారం, ఒక టీస్పూన్ జీలకర్ర పొడి, రెండు టీస్పూన్ల ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. మసాలా చిక్కగా ఉంటుంది కాబట్టి ఒక కప్పు నీళ్లు పోసి గ్రేవీలా చేసుకోవాలి. ఆపై నిలువుగా చీల్చిన నాలుగు పచ్చిమిరపకాయలు, ఒక టీస్పూన్ గరం మసాలా, రుచుల సమతుల్యత కోసం ఒక టీస్పూన్ పంచదార వేసుకోవాలి. గ్రేవీ మరీ చిక్కగా అనిపిస్తే మరికొన్ని నీళ్లు చేర్చి మూతపెట్టి ఐదు నిమిషాలు ఉడికించాలి. గ్రేవీ చక్కగా ఉడికి నూనె తేలిన తర్వాత, ఫ్లేవర్ కోసం కొద్దిగా కసూరి మేథిని నలిపి వేసి, సన్నగా తరిగిన కొత్తిమీర చల్లాలి. ఈ సమయంలో ఫ్లేవర్ కోసం వేసిన బిర్యానీ ఆకులను తీసేయవచ్చు.
కోడిగుడ్లను చేర్చే విధానం
ఈ రెసిపీలో ఉడకబెట్టిన గుడ్లు అయినా వేసుకోవచ్చు లేదా నేరుగా పగలగొట్టి అయినా వేయవచ్చు. నేరుగా వేసేటప్పుడు ఒక్కో కోడిగుడ్డును గ్రేవీలో కాస్త ఖాళీ ఉండేలా నెమ్మదిగా పగలగొట్టి పోయాలి. గుడ్లు వేసిన తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ కదపకూడదు. పైన కాస్త కొత్తిమీర చల్లుకుని, స్టవ్ మంటను లో-ఫ్లేమ్‌లో ఉంచి మూతపెట్టి 10 నుంచి 15 నిమిషాల పాటు గుడ్లు పూర్తిగా ఉడికే వరకు ఉంచాలి. అంతే.. 10-15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే క్రీమీగా, అద్భుతమైన సువాసనతో ‘ఎగ్ లబాబ్దార్’ సిద్ధమవుతుంది.

