NTV Telugu Site icon

Menopause: మెనోపాజ్‌ గురించి ఆందోళనే వద్దు

Menopause

Menopause

Menopause: అమ్మాయికి ఓ వయసు.. అంటే ఏ పదమూడేళ్ల నుంచి పదిహేనేళ్ల వయసు రాగానే ఆమె వ్యక్తురాలవుతుంది. ఇలా జరగడాన్ని ఆయా ప్రాంతాలను బట్టి పెద్దమనిషి కావడం, పుష్పవతి కావడం, రజస్వల కావడం అంటూ రకరకాలుగా పిలుస్తారు. నిజానికి ఇది అమ్మాయిలో పీరియడ్స్‌ సైకిల్‌ మొదలు కావడం. అలా అమ్మాయి వ్యక్తురాలైన నాటి నుంచి మొదలుకొని… మహిళల్లో ప్రతి నెలా వచ్చే రుతుక్రమం ఓ వయసు వచ్చేనాటికి ఆగిపోతుంది. సాధారణంగా మహిళల్లో రుతుక్రమం ఆగిపోవడం అన్నది 45 నుంచి 55 వయసు మధ్యకాలంలో జరుగుతుంది. అంటే సగటున చూస్తే 51వ ఏట అన్నమాట. ఇలా రుతుక్రమం ఆగిపోవడాన్నే ఇంగ్లిష్‌లో మెనోపాజ్‌ అంటారు. సాధారణ వాడుక భాషలో ముట్లు ఆగిపోవడం అని వ్యహవరిస్తుంటారు.

ఇలా ఆగిపోయే ముందర తొలినాళ్లలో ఒకటి రెండు నెలలు ఆగడం… మళ్లీ మొదలు కావడం.. ఆ తర్వాత మరికొన్ని నెలలు కొనసాగి.. ఇలా ఆగుతూ.. వస్తూ ఉండటాన్ని డాక్టర్లు ‘పెరి–మెనోపాజ్‌’గా పరిగణిస్తారు. రుతుస్రావాలు ఆగాక అలా కనీసం ఏడాది పాటు పూర్తిగా రాకుండా ఉంటేనే రుతుస్రావం ఆగడం.. అనగా ‘మెనోపాజ్‌’గా చెప్పవచ్చు.

రుతుక్రమం ఎందుకు ఆగుతుందంటే..?
మెనోపాజ్‌ అంటే.. యువతి యుక్తవయస్సుకు వచ్చిన నాటినుంచి దాదాపు క్రమం తప్పకుండా వచ్చే నెలసరి ఒకనాటికి ఆగిపోవడం. ఇలా రుతుక్రమం ఆగిపోయేనాటికి మహిళ దేహంలో సంక్లిష్ట ప్రక్రియలెన్నెన్నో చోటు చేసుకుంటాయి. ముందుగా అసలు రుతుక్రమం ఎందుకు ఆగుతుందో (మెనోపాజ్‌ ఎందుకు వస్తుందో) తెలుసుకోవడానికి ముందర యువతి యుక్తవయసుకు రావడం (ఫ్యూబర్టీ అటెయిన్‌ చేయడం) అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఆడపిల్లల్లో పీరియడ్స్‌ మొదలయ్యాయంటే, ఆమె అండాశయాల్లో అండాలు ఏర్పడటం మొదలయ్యిందనే డానికి సూచన. తన లాంటి మరో జీవిని పుట్టించడం కోసం ఇలా అండం ఏర్పడుతుంది. అండం ఎదిగే క్రమంలోనే గర్భసంచి (యుటెరస్‌)లో ఉండే ‘ఎండోమెట్రియమ్‌’ అనే పొర కూడా అండాన్ని తనలో సంరక్షించుకుంటూ.. ఆ అండం పిండంగా రూపొందే ప్రక్రియ కోసం రెడీ అవుతుంది.

ఒకవేళ ఆ నెలలో ఫలదీకరణం జరగకపోతే (అంటే కలయికలో మహిళ అండంతో, పురుషుల శుక్రకణాలు కలవకపోతే).. ఆ అండమూ, అప్పటికే కొద్దిగా ఏర్పడ్డ ఎండోమెట్రియమ్‌ పొర.. ఈ రెండూ మహిళ దేహం నుంచి బయటకు వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోవడాన్నీ, ఆ సమయంలో జరిగే రక్తస్రావాన్ని ‘రుతుక్రమం’గా చెబుతారు. యువతి యుక్తవయసుకు చేరిన నాటి నుంచి అండాశయాల్లో ఉత్పత్తి అయ్యే ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్‌ వంటి హార్మోన్లు.. క్రమంగా ఆమెకు 45–50 ఏళ్ల వయసు వచ్చే నాటికి తగ్గడం మొదలవుతుంది. ఈ సమయంలో కొందరిలో రుతుస్రావం కొన్ని నెలలు ఆగడం, మళ్లీ రావడం జరుగుతుంది. ఒకనాటికి రుతుస్రావం పూర్తిగా ఆగిపోతుంది. ఆ ఆగడం కాస్తా పన్నెండు నెలలు కొనసాగితే, అప్పుడు దాన్ని ‘మెనోపాజ్‌’గా నిర్ధారణ చేస్తారు.

అర్లీ మెనోపాజ్‌ అంటే..?
రుతుక్రమం ఆగిపోవడం అన్నది కొందరిలో కాస్త ముందుగానే జరుగుతుంది. అంటే.. మహిళల్లో మామూలుగా 45 నుంచి 55 ఏళ్ల మధ్య రుతుక్రమం ఆగిపోవడం సాధారణం. కానీ కొందరిలో కేవలం 35 – 40 ఏళ్ల లోపు కూడా రుతుక్రమం ఆగిపోతుంటుంది. దీన్నే ‘అర్లీ మెనోపాజ్‌’ లేదా ‘ప్రి–మెచ్యుర్‌ ఒవేరియన్‌ ఇన్‌సఫిషియెన్సీ’ అంటారు. కొందరిలోఇలా ఎందుకు జరుగుతుందనడానికి నిర్దిష్టంగా కారణాలేమిటన్నది స్పష్టంగా తెలియరాలేదు. ఇక్కడ మరో విషయం గుర్తుపెట్టుకోవాలి. కొందరిలో శస్త్రచికిత్స ద్వారా అండాశయాలు (ఓవరీలు) తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడినా లేదా కేన్సర్‌ వంటి కారణాలతో కీమోథెరపీ, రేడియోథెరపీ ఇచ్చినప్పుడు ఇలా జరగడానికి అవకాశం ఉంది. పైన పేర్కొన్నది వైద్యపరమైన కారణాలు కాగా.. ఇక మరికొందరిలో స్వాభావికంగానే (నేచురల్‌గానే) త్వరత్వరగా రుతుస్రావాలు ఆగిపోవడం కనిపిస్తుంటుంది. ఇక మరికొందరిలో క్రోమోజోముల సమస్య వల్ల.. అంటే టర్నర్‌ సిండ్రోమ్‌ లాంటివి ఉన్నప్పుడు ఇలా జరగవచ్చు. ఇంకొందరిలో తమ వ్యాధి నిరోధక శక్తి తమకే హని చేసే ‘ఆటోఇమ్యూన్‌’ ఆరోగ్య సమస్యల వల్ల కూడా ఇలా జరిగే అవకాశం ఉంది. అంటే… మహిళలోని తన సొంత వ్యాధి నిరోధక వ్యవస్థ తన సొంత అండాల ఉత్పత్తిని దెబ్బతీయడం వల్ల కూడా రుతుక్రమం త్వరగా ఆగిపోయే అవకాశాలుంటాయన్నమాట.

త్వరగా రుతుక్రమం ఆగిపోవడం అన్నది ప్రమాదమా?
* త్వరగా రుతుక్రమం ఆగిపోవడం అన్నది అంతగా ప్రమాదం కాదుగానీ, రుతుక్రమం రావడానికి మహిళ దేహంలో కొనసాగే సైకిళ్లలో కొన్ని హార్మోన్లు క్రమం తప్పకుండా ప్రసరిస్తుంటాయి. ఉదాహరణకు ఈస్ట్రోజెన్, ప్రోజెస్టిరాన్‌ వంటివి. ఇందులో ఈస్ట్రోజెన్‌ గుండెకు మంచి నేచురల్‌ సంరక్షణను ఇస్తుంది. అది ఆగిపోవడం వల్ల ముప్పు మొదలై గుండెపోటు, గుండెజబ్బులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అయితే ఇది ప్రధానంగా పురుషులు, వారితో పాటు మహిలల్లోనూ ఉండే నేచురల్‌ ముప్పే కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

* మెనోపాజ్‌ రాబోతున్నప్పుడు ముందుగా స్త్రీల ఒంట్లో నుంచి వేడి సెగలు వస్తున్నట్లు అనిపించడం (హాట్‌ ఫ్లషెస్‌), వెంటవెంటనే ఆమెలో భావోద్వేగాల మార్పులు వస్తుండటం (మూడ్‌ స్వింగ్స్‌) వంటి కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.

* కొందరిలో ఎముకలు పెళుసుగా మారతాయి. దాంతో అవి తేలిగ్గా విరిగిపోయేందుకు కారణమయ్యే ‘ఆస్టియోపోరోసిస్‌’ సమస్య కూడా మరో ముప్పు. అయితే ఇలా జరుగుతున్నప్పుడు క్యాల్షియమ్‌ సప్లిమెంట్లు ఇచ్చి ఈ ముప్పును అధిగమించవచ్చు.

* మధ్యవయసు కంటే ముందే మెనోపాజ్‌ రావడం వల్ల సంతానం కలగడానికి అవకాశం ఉన్న కాలం నిడివి తగ్గిపోతుంది. దాంతో అప్పటివరకూ సంతానం లేనివారిలో.. ఒకసారి రుతుక్రమం ఆగిపోయాయంటే పిల్లలు పుట్టేందుకు అవకాశం ఉండదు.

మెనోపాజ్‌ సమయంలో కనిపించే సాధారణ లక్షణాలు
* తమ ఒంట్లోంచి వేడి సెగలు వస్తున్నట్లూ, వేడి ఆవిర్లు బయటికి వెలువడుతున్నట్టు అనిపిస్తుంటుంది. (ఇలా జరగడాన్ని ఇంగ్లిష్‌లో హాట్‌ ఫ్లషెస్‌ అంటారు.)
* రాత్రిళ్లు విపరీతంగా చెమటలు పడుతుంటాయి (నైట్‌ స్వెట్స్‌)
* యోని పొడిబారిపోతుంది (వెజినల్‌ డ్రైనెస్‌)
* హార్మోన్ల హెచ్చుతగ్గుల వంటి మార్పుల కారణంగా కొందరిలో నిరాశ నిస్పృహలు అలముకుంటుంటాయి. దాంతో చాలా లోగా ఫీలవుతూ బాధపడుతుంటారు. ఒక్కోసారి చాలా ఉద్వేగపూరితంగా (యాంక్షియస్‌గా) మారిపోతారు. ఇలా ఈ రెండూ చాలా త్వరత్వరగా జరుగుతుండటంతో మూడ్స్‌ త్వరత్వరగా మారిపోతుంటాయి. ఇలా జరగడాన్నే ఇంగ్లిష్‌లో ‘మూడ్‌ స్వింగ్స్‌’ చెబుతారు.
* కొందరిలో కీళ్ళనొప్పులు, కండరాల్లో నొప్పులు వస్తాయి.
* కొందరిలో కలయికల (సెక్స్‌) పట్ల ఆసక్తి తగ్గుతుంది

మెనోపాజ్‌ తర్వాత కనిపించే కొన్ని ఆరోగ్య సమస్యలు
మెనోపాజ్‌ తర్వాత వచ్చే ముప్పు ఉన్న ఈ ఆరోగ్య సమస్యలకు కేవలం అవకాశం ఉండటమే తప్ప… అవి తప్పనిసరిగా వస్తాయని కాదు. కాబట్టి వాటి గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు.
* మెనోపాజ్‌ తర్వాత ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ తగ్గడం వల్ల.. అప్పటివరకూ ఆ హార్మోన్‌ వల్ల గుండెకు దొరికే నేచురల్‌ సంరక్షణ తొలగిపోవడం వల్ల గుండెపోటు లేదా గుండెజబ్బులకు అవకాశం ఏర్పడవచ్చు.
* ఎముకలు పెళుసుబారడం, బలహీనంగా మారడంతో తేలిగ్గా విరిగిపోవడానికి అవకాశం ఏర్పడుతుంది.
* కొందరిలో కొన్ని మూత్రసంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే తమ ప్రమేయం లేకుండానే మూత్రం పడిపోవడం (యూరినరీ ఇన్‌కాంటినెన్స్‌) జరగవచ్చు. ఇది కేవలం మెనోపాజ్‌ వల్లనే కాకుండా… మామూలుగా మహిళల్లో వయసు పెరుగుతున్నప్పుడు కూడా (ఏజింగ్‌లోనూ) కనిపించే సాధారణ సమస్య. ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ తగ్గడంతో యోనిలోపలి కణజాలం, మూత్రనాళంలోని పొరలు సన్నబడతాయి. అంతేకాదు అవి తమ సాగేగుణాన్ని (ఎలాస్టిసిటీని) కూడా కోల్పోతూ ఉంటాయి. అందువల్ల ఈ సమస్య వస్తుంది. అందుకే కొంత వయసు దాటిన మహిళల్లో వారు చిన్నగా దగ్గినా, తుమ్మినా లేదా గట్టిగా నవ్వినాకూడా (కొందరిలోనైతే ఒక్కోసారి ఏమీ చేయకుండానే) తమ ప్రమేయం లేకుండానే మూత్రం పడిపోతూ ఉంటుంది.
* కొందరు బరువు పెరుగుతారు. చాలామంది మహిళలు తమ 40 – 50లకు చేరగానే బరువు పెరుగుతుండటం అందరికీ తెలిసిన విషయమే. అయితే వాస్తవానికి ఇది మెనోపాజ్‌కు చేరుతుండటం వల్ల కాదు. ఇలా జరగడం అన్నది వయసు పెరుగుతున్నప్పుడు జరిగే మామూలు ప్రక్రియ. మామూలుగా అందరిలోనూ వయసు పెరుగుతున్న కొద్దీ కండరాల్లోని కండ భాగం (మజిల్‌ మాస్‌) క్రమంగా తగ్గుతూపోతుంటుంది. జీవక్రియల వేగం (మెటబాలిజమ్‌) కూడా తగ్గుతుంటుంది. దాంతో బరువు పెరగడం అన్నది సాధారణంగా జరుగుతుంది. మెనోపాజ్‌ దశకు చేరుతున్న సమయానికి మహిళల పొట్టచుట్టూ కొవ్వు పేరుకుంటూ, అలాగే బరువు పెరుగుతుండటమూ మామూలే. ఇలా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకోవడం చాలా ప్రమాదకరం. అయితే ఈ ముప్పు మెనోపాజ్‌ వల్ల కాదు. ఇలా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి, పొట్ట వచ్చినట్లు కావడం వల్ల (సెంట్రల్‌ ఒబేసిటీ వల్ల)

* గుండెజబ్బుల ముప్పు (రిస్క్‌) పెరుగుతుంది. ఆహారంలో తక్కువ క్యాలరీలు ఉండే ఫుడ్‌ తీసుకుంటూ, అందులోనే అన్ని పోషకాలూ పుష్కలంగా ఉండేలా చూసుకుంటూ, తిన్నదంతా సక్రమంగా ఒంటికి అందేలా ఆరోగ్యకరమైన జీవనశైలిలో, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉంటే ఈ ముప్పు తొలగిపోతుంది. అది మహిళలకు కేవలం ఆరోగ్యపరంగానే కాకుండా, ఆకర్శణీయంగా కనిపించడానికీ దోహదపడుతుంది.

చికిత్సలు :
ముందుగా అర్లీ మెనోపాజ్‌ విషయంలో…
* పెద్ద వయసు వచ్చాక ఆగిపోవడానికంటే ముందే రుతుస్రావం ఆగిపోయే ‘అర్లీ మెనోపాజ్‌’ సమయంలో కొన్ని హార్మోన్లతో చికిత్స ఇచ్చి అప్పుడు కనిపించే లక్షణాలకు చికిత్స చేసి, ఆ అనర్థాలను తగ్గించవచ్చు. ఇందుకోసం కొన్ని హార్మోన్లతో చికిత్స అందిస్తారు. ఇలా మహిళల్లో స్రవించడం ఆగిపోయిన హార్మోన్లను తిరిగి ఇస్తుంటారు కాబట్టి దీన్ని ‘హార్మోన్‌ రీప్లేస్‌మెంట్‌ థెరపీ’ (హెచ్‌ఆర్‌టీ) అంటారు.

ఈ హార్మోన్లే కాకుండా, కొందరిలో నోటి ద్వారా (ఓరల్‌గా) ఇచ్చే సంతాన నిరోధక మాత్రలు కూడా మెనోపాజ్‌ సమస్యలు తగ్గిస్తాయి. ఈ మందుల వల్ల ఒంట్లోంచి వెలువడే వేడి సెగల్ని (హాట్‌ఫ్లషెస్‌ని) చాలావరకు తగ్గిస్తాయి. ఎముకలూ బలంగా మారతాయి.

* ఇలా నోటి ద్వారా ఇచ్చే సంతాన నిరోధక మాత్రల వల్ల మహిళల్లో అవాంఛిత గర్భం రాదు. అలాగే హెచ్‌ఆర్‌టీ ఇవ్వడం అన్నది అధిక రక్తపోటు (హైబీపీ) ఉన్నవారికీ చాలా మేరకు మంచి ఉపయోగకరంగా ఉంటుంది. అయితే వారికి ఇచ్చే ఈ చికిత్సను… మామూలుగా స్వాభావికంగా (నేచురల్‌గా) మెనోపాజ్‌ వచ్చే వయసు వరకు కొనసాగించాలి రావచ్చు.

* అయితే హార్మోన్‌ రీప్లేస్‌మెంట్‌ (హెచ్‌ఆర్‌టీ)లో ఇచ్చే మందుల విషయంలోనూ మహిళలు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అవేవో ప్రత్యేకమైన మందులు కావు. అవి మామూలుగా మహిళల దేహంలో స్వాభావికంగా స్రవించాల్సిన హార్మోన్లు మాత్రమే. ఏవో కారణాల వల్ల అవి స్రవించకపోవడంతో, డాక్టర్లు వాటిని బయటనుండి ఇస్తుంటారు. కాబట్టి ఇలా మందులు ఇవ్వడంవల్ల ప్రత్యేకంగా అదనపు ముప్పు ఏదీ ఉండదు. వాటి సైడ్‌ ఎఫెక్టులూ ఉండవు. కాబట్టి మహిళలు ఆందోళన పడాల్సిందేమి ఉండదు.

ఇక మెనోపాజ్‌కు చికిత్సలు / సూచనలు:
* జీవనశైలిలో (లైఫ్‌స్టైల్‌లో) మార్పులు చేసుకోవడం : మహిళలు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అదే సమయంలో అవి తమకు తీవ్రమైన శ్రమ కలగించనివ్వకుండా జాగ్రత్త తీసుకోవాలి. అలాంటి వ్యాయామాలే చేయాలి. ఉదాహరణకు శ్రమకలగని మేరకు జాగింగ్, రన్నింగ్, స్విమ్మింగ్‌ వంటి వ్యాయామాలు చేయడం మంచిది. తమ ఎత్తుకు తగినట్లుగా బరువుండేలా బరువును నియంత్రించుకోవాలి. యోగా, ధ్యానం వంటివీ మంచిదే. ఇవి ఉద్వేగాల్లో తీవ్రతలను (మూడ్‌ సింగ్స్‌ను) కొంతవరకు నియంత్రించే అవకాశం ఉంటుంది.
* క్రమం తప్పకుండా వేళకు నిద్ర నిద్రపోవడంతో మంచి ఉపయోగం ఉంటుంది.
* ఆహారంలో క్యాల్షియమ్‌ పుష్కలంగా ఉండే పెరుగు, పాల వంటివి ఎక్కువగా తీసుకోవాలి.
* జీవనశైలిలో మార్పుల్లో భాగంగా కెఫిన్‌ మోతాదు ఎక్కువగా ఉండే కాఫీ, కోలా డ్రింక్స్‌ వంటి కూల్‌డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి. అలా ఉండలేనివారు వాటిని చాలా చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. ఆల్కహాల్‌ అస్సలు ముట్టకూడదు. కెఫిన్, ఆల్కహాల్‌కు దూరంగా ఉండటం అన్నది రాత్రి వేళ విపరీతంగా చెమటలు పట్టడాన్ని బాగా తగ్గిస్తుంది.
* లైట్‌ కాటన్‌ దుస్తులు ధరించడం మేలు.
* చన్నీళ్ల నీటితో స్నానం చేయడం మంచి ఉపశమనాన్ని ఇస్తుంది.
* నీళ్లూ, ఇతర పానియాలు చల్లగా తాగడం మంచిది.
* సూర్యరశ్మికి (సన్‌లైట్‌)కు ఎక్స్‌పోజ్‌ కావడం వల్ల విటమిన్‌–డి సమకూరి ఎముకల పటుత్వం తగ్గకుండా ఉంటుంది.

Dr. PRAMATHA SIRISHA, MS, DNB, MRCOG
Consultant – Obstetrics & Gynecology, Laparoscopic Surgeon and Infertility Specialist
BirthRight By Rainbow Hospitals, Secunderabad,
Contact : 8882 046 046
www.rainbowhospitals.in

Show comments