రాష్ట్రంలో ఉన్నత విద్యామండలి చేపట్టిన వివిధ కార్యకలాపాల్లో డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్త్ ఒకటి. ఈనేపథ్యంలో.. 2022 డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం దోస్త్ నోటిపికేషన్ జూన్ 29 బుధవారం విడుదల చేసిన విషయం తెలిసిందే.. మాసబ్ ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలిలో డిగ్రీ దోస్త్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి ప్రకటించారు. అయితే దీని ద్వారా ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన యూనివర్సిటీలలో అనుభంధ కళాశాలలతో పాటు నూతనంగా ఏర్పాటైన మహిళా విశ్వవిద్యాలయంలో అడ్మిషన్లు ఇవ్వనున్నారు. బీఏ, బీకా, బీఎస్సీ,బీబీఎం, బీసీఎం తదితర కోర్సులు అందుబాటులో వున్నాయి. అయితే దీనికి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు, తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నిర్వహించే పాలిటెక్నిక్ డిప్లొమా ప్రోగ్రామ్‌లు పూర్తిచేసిన వారు, కంపార్ట్‌మెంట్‌గా పాసైనవారు ఈ కోర్సుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మూడు విడతల్లో ప్రవేశ ప్రక్రియ నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటిసారి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు 10 శాతం కోటా ఈ విద్యా సంవత్సరం నుంచి అమలుకానుండటం గమనార్హం.
దరఖాస్తు ఇలా..
మీ.. ఆధార్ నెంబర్ లింక్ చేసి ఉన్న మొబైల్ ద్వారా దోస్త్ వెబ్‌సైట్‌లో నేరుగా రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదా.. మీ సేవా కేంద్రాల్లో బయోమెట్రిక్ అథెంటికేషన్ పూర్తిచేసి దోస్త్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా.. ఫొటో అథెంటికేషన్‌తో టీ యాప్ ఫోలియో మొబైల్ యాప్ ద్వారా కూడా రిజిస్టర్ కావచ్చు. కాగా.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత దోస్త్ ఐడీ, పిన్ వస్తాయి. వీటిని జాగ్రత్త చేసుకోవాలి. దోస్త్ ఐడీ, పిన్ లేదా పాస్‌వర్డ్ ద్వారా లాగిన్ అయితే దరఖాస్తు ఫారం ఓపెన్ అవుతుంది. దీనిని నింపిన తర్వాత విద్యార్థి ప్రయారిటీ ప్రకారం కోర్సు, కాలేజీ వివరాలను వెబ్ ఆప్షన్స్ కింద ఇవ్వాలి. విద్యార్థి మెరిట్, రిజర్వేషన్ నిబంధనల ప్రకారం సీట్ అలాట్ అవుతుంది. అభ్యర్థులు తమకు సంబంధించిన స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్లను దగ్గరలోని హెల్ప్ లైన్ సెంటర్‌లో వెరిఫై చేయించుకోవాలి. నచ్చిన కోర్సులను తమ ప్రాధాన్యం మేరకు ఒకేసారి దరఖాస్తు చేసుకునే సౌలభ్యం దోస్త్ వారీగా సుగమమైంది. కాగా.. రిజిస్ట్రేషన్, అలాగే వెబ్ ఆప్షన్స్‌కు జూలై 30 వరకు గడువు ఉంది, మరో రెండు దశలతో కలుపుకొని సెప్టెంబరు 12 వరకు అడ్మిషన్లు కొనసాగుతుంటాయి.
ఆగస్టు 6న మొదటి విడత డిగ్రీ సీట్ల కేటాయింపు జరగనుంది. ఈ కేటాయింపుకు సంబంధించి ఆగస్టు 7 నుంచి 18 వరకు విద్యార్థులు సంబంధిత కళాశాల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 7 నుంచి 21 వరకు రెండో విడత దోస్త్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఆగస్టు 7 నుంచి 22 వరకు రెండో విడత వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఇచ్చారు. ఆగస్టు 22న రెండో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు ఉండనున్నట్లు షెడ్యూల్‌లో ప్రకటించారు. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 12 వరకు మూడో విడత దోస్త్ రిజిస్ట్రేషన్ జరగనుండగా.. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 12 వరకు మూడో విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చారు. సెప్టెంబర్ 16న మూడో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు ఉండనుంది. అక్టోబర్ 1 నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి ప్రకటించారు.
Action King: యాక్షన్ కింగ్ అర్జున్ కు మాతృ వియోగం
