DILRMP 3.0: ఇకపై మీ భూమికి కూడా ‘ఆధార్’ లాంటి నెంబర్.. కేంద్రం సరికొత్త పథకం ప్రారంభం.!

  • డీఐఎల్ఆర్‌ఎంపీ 3.0 పథకాన్ని ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం..
  • దేశంలోని ప్రతి భూమికి 14 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య
  • భూముల రికార్డులు, మ్యాపులు, రిజిస్ట్రేషన్ వివరాలను డిజిటల్..
Dilrmp 3.0

Dilrmp 3.0

DILRMP 3.0: దేశవ్యాప్తంగా భూములకు సంబంధించిన రికార్డులను మరింత పారదర్శకంగా, సులభంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ (DILRMP) 3.0ను ప్రారంభించింది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు భూములకు సంబంధించిన రికార్డులు, మ్యాపులు, రిజిస్ట్రేషన్ వివరాలను డిజిటల్‌ ఫ్రేమ్‌వర్క్‌లోకి తీసుకురావడమే ఈ పథకం ముఖ్య లక్ష్యం.

రూ.565.5 కోట్ల బడ్జెట్:

DILRMP 3.0 అమలుకు 2026 నుంచి 2031 వరకు రూ.565.5 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. భూముల రికార్డులు, మ్యాపింగ్, రిజిస్ట్రేషన్, సంబంధిత డేటాను GIS ఆధారిత డిజిటల్ వ్యవస్థలోకి తీసుకురావడంతో పాటు వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య సమాచారాన్ని అనుసంధానం చేయనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. ఈ పథకం వ్యక్తిగత భూ రికార్డుల డిజిటలైజేషన్‌కే పరిమితం కాకుండా యూనిఫైడ్ ల్యాండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ దిశగా తీసుకెళ్తుందని తెలిపారు. రైతులకు సంస్థాగత రుణాలు సులభంగా లభించడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం తగ్గుతుందని అన్నారు.

GIS ఆధారిత ‘ల్యాండ్ స్టాక్’:

DILRMP 3.0లో భాగంగా GIS ఆధారిత ల్యాండ్ స్టాక్ ను అభివృద్ధి చేయనున్నారు. జియో-రిఫరెన్స్‌డ్ క్యాడస్ట్రల్ మ్యాపులు, హక్కుల రికార్డులు, ఆస్తి రిజిస్ట్రేషన్, భూములకు సంబంధించిన కోర్టు కేసుల వంటి సమాచారాన్ని ఒకే డిజిటల్ వ్యవస్థలోకి తీసుకురానున్నారు. ప్రతి రాష్ట్రం APIల ద్వారా వివిధ భూ డేటాసెట్లు, సిస్టమ్‌లను అనుసంధానం చేసుకుని సొంత ‘ల్యాండ్ స్టాక్’ను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. రాష్ట్ర స్థాయి ల్యాండ్ స్టాక్‌లు భవిష్యత్‌లో జాతీయ స్థాయి ల్యాండ్ స్టాక్‌కు ఆధారంగా నిలవనున్నాయి.

ప్రతి భూమికి 14 అంకెల యూనిక్ నంబర్:

ఈ పథకంలో భాగంగా దేశంలోని ప్రతి భూమికి 14 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇవ్వనున్నారు. దీనివల్ల ఆస్తులను స్పష్టంగా గుర్తించడంతో పాటు భూములకు సంబంధించిన మోసాలను తగ్గించేందుకు అవకాశం ఉంటుంది. పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల తరహాలో దేశంలోని అధిక రద్దీ ఉండే 75 సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఆధునిక సేవా కేంద్రాలుగా మార్చనున్నారు. డిజిటల్ సదుపాయాలతో రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేయడం ఈ మార్పుల ఉద్దేశం.

పాత భూ రికార్డులన్నీ డిజిటల్‌:

పాత భూమి, ఆస్తి రిజిస్ట్రేషన్ రికార్డులను కూడా క్రమబద్ధంగా స్కాన్ చేసి డిజిటల్ రూపంలో భద్రపరచనున్నారు. ముఖ్యంగా వారసత్వ హక్కులకు సంబంధించిన రికార్డులను సురక్షితంగా ఉంచడం ద్వారా పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన వివాదాలను తగ్గించే అవకాశం ఉంటుంది. అలాగే రిజిస్టర్ చేసిన పత్రాలు, ఆస్తిపై ఉన్న రుణాలు లేదా ఇతర బాధ్యతలకు సంబంధించిన వివరాలను అందించే సురక్షిత డిజిటల్ రిజిస్ట్రేషన్ రిపోజిటరీని ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల భూమి యాజమాన్యాన్ని పరిశీలించడం, గతంలో జరిగిన కొనుగోలు, అమ్మకాల చరిత్రను తెలుసుకోవడం మరింత సులభం కానుంది.

పేపర్‌లెస్ రెవెన్యూ కోర్టులు:

రెవెన్యూ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను తగ్గించేందుకు “రెవెన్యూ కోర్ట్ కేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (RCCMS)”ను ఆధునీకరించి నేరుగా భూ రికార్డులతో అనుసంధానం చేయనున్నారు. ముఖ్యంగా మ్యుటేషన్‌కు సంబంధించిన కేసుల పరిష్కారంలో వేగం పెంచేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడనుంది. అలాగే పట్టణ ప్రాంతాల్లో ఖచ్చితమైన GIS ఆధారిత భూ రికార్డులను రూపొందించేందుకు NAKSHA పైలట్ ప్రాజెక్టును వేగవంతం చేయనున్నారు. దీని ద్వారా పట్టణ ఆస్తులకు సంబంధించిన డిజిటల్ రికార్డులు రూపొందించడంతో పాటు అర్బన్ ప్రాపర్టీ కార్డులు (UrPro కార్డులు) జారీ చేయనున్నారు.

ప్రయోజనం ఏంటి.?

DILRMP 3.0 పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే భూమి యాజమాన్య వివరాల నిర్వహణ, రిజిస్ట్రేషన్, మ్యాపింగ్, కోర్టు కేసులు, రుణ వివరాలు వంటి అనేక అంశాలు ఒకే డిజిటల్ వ్యవస్థతో అనుసంధానం కానున్నాయి. దీంతో భూ లావాదేవీల్లో పారదర్శకత పెరగడంతో పాటు రికార్డుల పరిశీలన, రుణాల పొందడం, ప్రభుత్వ సేవలను వినియోగించుకోవడం మరింత సులభం కానుంది.