NTV Telugu Site icon

Tadikonda YCP : వైసీపీలో డొక్కాతో కలిసి పనిచేసేందుకు శ్రీదేవి హింట్ ఇచ్చారా..! మాటలే కానీ చేతలు లేవా?

Tadikonda

Tadikonda

హాట్ హాట్‌గా ఉన్న తాడికొండ వైసీపీ రాజకీయాల్లో మలుపులు ఉంటాయా? ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి.. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ కలిసి పనిచేస్తారా.. లేదా? వారి మాటలకు.. చేతలకు పొంతన కుదరడం లేదా? ఈ ఎపిసోడ్‌ ఎన్నికల వరకు డైలీ సీరియల్‌గా సాగుతుందా.. మధ్యలోనే ఫుల్‌ స్టాప్‌ పడుతుందా?

తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ అదనపు సమన్వయకర్త నియామకం చిచ్చురేపింది. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఉండగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను సమన్వయకర్తగా అధిష్టానం ప్రకటించింది. ఈ నిర్ణయంపై ఎమ్మెల్యే శ్రీదేవి భగ్గుమన్నారు. ఎమ్మెల్యే శ్రీదేవి ఏకంగా జిల్లా పార్టీ అధ్యక్షురాలు మేకతోటి సుచరిత ఇంటివద్ద ఆందోళన చేశారు. నియోజకవర్గంలో రోజుకో చోట ఎమ్మెల్యే వర్గీయులు, డొక్కా అనుచరులు సమావేశాలు ఏర్పాటు చేసి పరస్పరం విమర్శలు.. ఆరోపణలు చేసుకోవడం రొటీన్‌గా మారిపోయింది. ఇంతలోనే ఎమ్మెల్యే వర్గం ఏర్పాటు చేసిన సమావేశాన్ని మేడికొండూరు పోలీసులు అడ్డుకోవడంతో రెండు శిబిరాల మధ్య దూరం మరింత పెరిగింది.

డొక్కాతో అమీతుమీ తేల్చుకునేందుకు ఎమ్మెల్యే శ్రీదేవి వర్గీయులు డిసైడైనట్టు తెలుస్తోంది. పార్టీలో కీలక నేతలను కలుస్తూ డొక్కా నియామకాన్ని రద్దు చేయించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డితో భేటీ అయ్యారు ఎమ్మెల్యే శ్రీదేవి. రెండు గంటలపాటు ఇద్దరిమధ్య చర్చలు నడిచాయి. తర్వాత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి డొక్కా నియామకంపై అభ్యంతరం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే. అక్కడితో ఆగకుండా సీఎం జగన్‌కు సన్నిహితంగా ఉండే ఎంపీ మోపిదేవి వెంకటరమణారావుతోనూ సమావేశం అయ్యారు. ఈ సమావేశాలే వైసీపీ రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి.

ఇదే సమయంలో ఎమ్మెల్సీ డొక్కా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. తాడికొండలో తన వర్గీయులతో కలిసి‌ పర్యటనలు చేస్తున్నారు. నియోజకవర్గంలో ప్రత్యేక పరిస్థితులు ఉండటం వల్లే అదనపు సమన్వయకర్తగా తనను అధిష్టానం నియమించిందనేది డొక్కా మాట. అలాగే ఎమ్మెల్యే శ్రీదేవి నాయకత్వంలో కలిసి పనిచేస్తానని ప్రకటించారు. తాడికొండలో వైసీపీని బలోపేతం చెయ్యడమే తన పనిగా చెబుతున్నారు డొక్కా. అయితే మాటల్లో చెప్పడమేకానీ ఇప్పటివరకూ ఎమ్మెల్యే శ్రీదేవిని కలిసి మాట్లాడలేదు.

ప్రస్తుతం నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇద్దరూ వేర్వేరుగానే కార్యక్రమాలు చేస్తున్నారు. వైఎస్‌ వర్థంతి కార్యక్రమాలు ఎవరివి వారివే. ఎమ్మెల్సీ డొక్కా తాడికొండ, తుళ్లూరు మండలాల్లో పాల్గొంటే.. ఎమ్మెల్యే శ్రీదేవి ఫిరంగిపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా డొక్కా నియామకంపై ఎమ్మెల్యే శ్రీదేవి తన అభిప్రాయాన్ని పరోక్షంగా చెప్పకనే చెప్పేశారు. ఎవరికైనా పార్టీయే ముఖ్యమన్న ఎమ్మెల్యే.. చెట్టు ఉంటేనే కాయలు కోసుకోవచ్చన్నారు. కలిసి వచ్చేవారిని కలుపుకొనిపోతామని చెప్పారామె. ఈ కామెంట్స్‌ విన్నాక.. కలిసి వెళ్లేందుకు హింట్‌ ఇచ్చారని అనుకుంటున్నారట.

ఇక్కడే తిరకాసు ఉంది. ఎవరికివారే ఇద్దరూ కలిసి పనిచేస్తామని చెబుతారు కానీ.. ఆ దిశగా అడుగులు వేయడం లేదు. ఎవరి శిబిరాన్ని వారు నిర్వహిస్తున్నారు. నిత్యం చైతన్య పరుస్తున్నారు. మరి ఇద్దరు కలిసి పనిచేస్తారా? తాడికొండ రగడకు ఫుల్‌ స్టాప్‌ పడుతుందో లేదో చూడాలి.