Devdutt Padikkal: లింకన్ వేదికగా భారత్ ‘A’, న్యూజిలాండ్ ‘A’ జట్ల మధ్య జరుగుతున్న తొలి అనధికారిక టెస్టు మ్యాచ్‌లో దేవదత్ పడిక్కల్ మారథాన్ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, కేవలం ఒక్క పరుగు తేడాతో (199 పరుగుల వద్ద) తృటిలో డబుల్ సెంచరీని చేజార్చుకున్నాడు. అయితే అతను ఔటైన తీరు మైదానంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఫీల్డ్ అంపైర్ ఇచ్చిన వివాదాస్పద కాట్ బిహైండ్ నిర్ణయంపై పడిక్కల్ ఆశ్చర్యం, అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీనితో ఇప్పుడు అసలు పడిక్కల్ ఔటే కాదా.? అంపైర్ తప్పుడు నిర్ణయం ఇచ్చాడా.? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. న్యూజిలాండ్ ‘A’ ఆటగాళ్లు చేసిన అప్పీల్‌లో కూడా పెద్దగా లేనప్పటికీ.. అంపైర్ వేలు పైకెత్తడం అందరినీ విస్మయానికి గురిచేసింది.
అసలేం జరిగిందంటే.. న్యూజిలాండ్ బౌలర్ జాక్ గిబ్సన్ వేసిన లెగ్ సైడ్ సాధారణ లెంగ్త్ డెలివరీని ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన పడిక్కల్ ఫ్లిక్ చేయడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో బంతి బ్యాట్‌కు కాకుండా ప్యాడ్‌ను తాకుతూ వెళ్లి వికెట్ కీపర్ మిచెల్ హే గ్లోవ్స్‌లో పడింది. క్రికెట్ నిబంధనల ప్రకారం బంతి బ్యాట్‌ను తాకకుండా కేవలం ప్యాడ్‌ను తాకి వికెట్ కీపర్ వద్దకు వెళితే అది నాటౌట్. ఆ సమయంలో బంతి ప్యాడ్‌కే తగిలిందని పడిక్కల్ గట్టిగా భావించాడు. కానీ అంపైర్ మాత్రం బంతి బ్యాట్‌కు తగిలిందని భావిస్తూ ఔట్‌గా ప్రకటించాడు. అంపైర్ నిర్ణయంతో షాకైన పడిక్కల్.. బంతి బ్యాట్‌కు ఎంత దూరంలో ఉందో, అలాగే ప్యాడ్‌కు ఎలా తగిలిందో తన హావభావాల ద్వారా అంపైర్‌కు వివరించే ప్రయత్నం చేశాడు. కానీ ఫలితం లేకపోవడంతో నిరాశతో మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయితే దురదృష్టవశాత్తూ పడిక్కల్ డబుల్ సెంచరీ మిస్ అయినప్పటికీ.. అతను ఆడిన ఇన్నింగ్స్ చరిత్రలో నిలిచిపోయింది. 248 బంతుల్లో 24 ఫోర్లు, 3 భారీ సిక్సర్లతో ఏకంగా 199 పరుగులు బాదాడు. దీంతో ఇండియా ‘A’ చరిత్రలోనే ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన బ్యాటర్‌గా పడిక్కల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇండియా ‘A’ తరఫున పడిక్కల్‌కు ఇది మూడో సెంచరీ కాగా, ఈ ఇన్నింగ్స్ ద్వారానే భారత్ ‘ఎ’ తరఫున 1000 పరుగుల మైలురాయిని కూడా విజయవంతంగా అధిగమించాడు.
మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 113 పరుగులకే కుప్పకూలగా, న్యూజిలాండ్ 317 పరుగులు చేసి 204 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందుకుంది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లోనూ 10 పరుగులకే జైస్వాల్ (5), కేఎల్ రాహుల్ (4)ల వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన దశలో పడిక్కల్, సాయి సుదర్శన్ జట్టును ఆదుకున్నారు. మూడో వికెట్‌కు 215 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని జోడించారు. సుదర్శన్ 91 పరుగులు చేయగా.. ఆ తర్వాత యశ్ రాథోడ్ (66), వాషింగ్టన్ సుందర్ (నాటౌట్ 51) అర్ధ శతకాలతో రాణించారు. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 488 పరుగుల భారీ స్కోరు సాధించి.. మ్యాచ్‌లో 284 పరుగుల ఆధిక్యంలో ఉంది.
🔴DEVDUTT PADIKKAL ANGRY OVER A CONTROVERSIAL UMPIRING DECISION! 🤯
– Padikkal was batting on 199 when the bowler delivered the ball wide.
– Padikkal tried to play the delivery, but the umpire suddenly declared him out, apparently believing the ball had edged the bat.
– Padikkal was left shocked by the decision.Note: There is no DRS in unofficial Test matches. ❌ https://t.co/WfZMaQfAXM
— Sam (@cricsam02) October 26, 2026

