NZ A vs IND A: దేవదత్ పడిక్కల్ సూపర్ సెంచరీ.. ఓటమి అంచులనుండి బయటపడ్డ ఇండియా ‘A’

  • న్యూజిలాండ్ ‘A’పై దేవదత్ పడిక్కల్ అద్భుత సెంచరీ
  • 128 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన పడిక్కల్
  • ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో పడిక్కల్‌కు ఇది 12వ సెంచరీ
  • సాయి సుదర్శన్‌తో కలిసి మూడో వికెట్‌కు 215 పరుగుల భాగస్వామ్యం
  • సాయి సుదర్శన్ 91 పరుగులతో కీలక ఇన్నింగ్స్..
Devdutt Padikkal

Devdutt Padikkal

NZ A vs IND A: ఇండియా ‘A’, న్యూజిలాండ్ ‘A’ జట్ల మధ్య జరుగుతున్న తొలి అనధికారిక టెస్టు మ్యాచ్‌లో దేవదత్ పడిక్కల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. నాలుగు రోజుల పాటు సాగే ఈ మ్యాచ్‌లో మూడో రోజు పడిక్కల్ ఆడిన ఇన్నింగ్సే హైలెట్ గా నిలిచింది. పడిక్కల్ సెంచరీతో పాటు సాయి సుదర్శన్‌తో కలిసి మూడో వికెట్‌కు నెలకొల్పిన 200+ భాగస్వామ్యం ఇండియా ‘A’ జట్టుకు ఆధిక్యాన్ని అందించడమే కాకుండా, జట్టుపై ఉన్న ఓటమి ముప్పును సైతం తప్పించింది.

ఈ మ్యాచ్ లో దేవదత్ పడిక్కల్ తన ఇన్నింగ్స్ 128వ బంతిని భారీ సిక్సర్‌గా మలిచి సెంచరీ మార్కును అందుకున్నాడు. అతను బాదిన సిక్సర్ మైదానం బయట ఉన్న చెట్ల పైకి దూసుకెళ్లింది. బంతి చెట్లపై పడగానే పడిక్కల్ మైదానంలో సంబరాలు చేసుకున్నాడు. పడిక్కల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్‌లో ఇది 12వ సెంచరీ. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో సెంచరీ నమోదు చేసిన తొలి బ్యాటర్‌ కూడా పడిక్కల్.

ఈ మ్యాచ్‌లో పడిక్కల్ సెంచరీతో పాటు సాయి సుదర్శన్‌తో కలిసి చేసిన భాగస్వామ్యం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. వీరిద్దరూ మూడో వికెట్‌కు 340 బంతుల్లో 215 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ భాగస్వామ్యంలో సాయి సుదర్శన్ 91 పరుగులు చేయగా, దేవదత్ పడిక్కల్ 118 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును పటిష్టమైన స్థితిలో నిలిపాడు. తొలి ఇన్నింగ్స్‌లో 113కే ఆలౌటైన ఇండియా -A, ప్రస్తుతానికి రెండో ఇన్నింగ్స్‌లో 297/4కు చేరింది. దీనితో 95 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.