Deputy CM Pawan Kalyan Congratulates Mega DSC 2025 Teachers: మెగా డీఎస్సీ – 2025 ద్వారా ఉపాధ్యాయులుగా ఎంపికైన అందరికీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మీరంతా ఎన్నో ఏళ్ళు డీఎస్సీ కోసం నిరీక్షించారన్నారు. ఏక కాలంలో 15,941 మంది ఉపాధ్యాయులను నియమించిన ఈ శుభ సమయం రాష్ట్ర విద్యారంగంలో చిరస్థాయిగా మిగిలిపోతుందని తెలిపారు. ఎన్నికల్లో యువతకు ఇచ్చిన మాటకు కట్టుబడి మెగా డీఎస్సీ ద్వారా వారికి దారి చూపిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని కొనియాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు డీఎస్సీ నియామకాలపై తొలి సంతకం చేశారని గుర్తు చేశారు.
READ MORE: CM Chandrababu: “మీ కోరిక తీరింది.. నా కల నెరవేర్చండి”.. కొత్త టీచర్లకు సీఎం కీలక సూచన..
ముఖ్యమంత్రి మార్గదర్శకంలో రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి, సోదరులు నారా లోకేష్ ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియను విజయవంతంగా ముందుకు తీసుకువెళ్ళారని పవన్ కల్యాణ్ తెలిపారు. “ఈ ప్రక్రియలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. ఆరోగ్యం సహకరించని దృష్ట్యా డీఎస్సీ నియామక పత్రాల ప్రదానం కార్యక్రమానికి నేను స్వయంగా హాజరు కాలేకపోతున్నాను. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను తీర్చిదిద్ది వారి భవితకు బాటలు వేసే బృహత్తర బాధ్యత ఈ రోజు నియామక పత్రాలు అందుకుంటున్న ఉపాధ్యాయులపై ఉంది. ఆ దిశగా విధులు నిర్వర్తించాలని ఆకాంక్షిస్తున్నాను. మరొక్కసారి మెగా డీఎస్సీ – 2025లో ప్రతిభ చూపి ఉద్యోగ విధుల్లో చేరుతున్న ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులకి హృదయపూర్వక శుభాకాంక్షలు.” అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటనలో పేర్కొన్నారు.
