Chukkakura Pachadi Recipe: ఆకుకూరల్లో చుక్కకూరకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇందులో ఉండే సహజమైన పులుపు రుచి పచ్చడికి అద్భుతమైన టేస్ట్‌ను అందిస్తుంది. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఈ చుక్కకూర పచ్చడి కలిపి తింటే ఆ రుచికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. కేవలం అన్నంలోకే కాదు.. ఇడ్లీ, దోశ వంటి టిఫిన్స్‌తో కూడా ఇది ఎంతో రుచిగా ఉంటుంది. ముఖ్యంగా ఈ పచ్చడిని ఒకసారి తయారు చేసుకుంటే వారం రోజుల పాటు నిల్వ ఉంచుకోవచ్చు. మరి ఈ టేస్టీ చుక్కకూర పచ్చడిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూసేద్దాం.
కావలసిన పదార్థాలు:
* చుక్కకూర – పెద్ద కట్టలు అయితే 2, చిన్నవి అయితే 3
* నువ్వులు – 1 టేబుల్ స్పూన్
* ఎండు మిరపకాయలు – 10 నుంచి 15
* జీలకర్ర – 1 టీస్పూన్
* నూనె – 3 టేబుల్ స్పూన్లు
* తాలింపు గింజలు – శెనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర
* వెల్లుల్లి రెబ్బలు – 3
* కరివేపాకు – కొద్దిగా
* ఉల్లిపాయ – 1
* ఉప్పు – తగినంత
తయారీ విధానం:
ఆకుకూర శుభ్రం:
మొదటగా చుక్కకూరను తీసుకొని ముదురు కాడలు, వేర్లను వేరు చేసి పక్కన పడేయాలి. ఆపై ఆకులను నీటిలో శుభ్రంగా కడిగి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
నువ్వులు, ఎండుమిర్చి వేయించుకోవడం:
స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని, అందులో ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేయాలి. మంటను లో-ఫ్లేమ్‌లో ఉంచి, నువ్వులు లైట్‌గా కలర్ మారి చిటపటలాడే వరకు దోరగా వేయించి ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. అదే పాన్ లో కారానికి తగినట్లుగా 10 నుండి 15 ఎండు మిరపకాయలను వేసి (చుక్కకూర పుల్లగా ఉంటుంది కాబట్టి మిర్చి ఎక్కువే పడుతుంది) లో-ఫ్లేమ్‌లోనే బాగా వేయించి, నువ్వులు తీసిన ప్లేట్‌లోకి మార్చుకోవాలి.
ఆకుకూరను మగ్గించడం:
ఇప్పుడు అదే పాన్ లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేయాలి. ఆయిల్ వేడి ఎక్కాక ఒక టీస్పూన్ జీలకర్ర వేసి కాస్త వేయించాలి. జీలకర్ర వేగాక, మనం కట్ చేసి పెట్టుకున్న చుక్కకూర ముక్కలను అందులో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై మూత పెట్టి, చిన్న మంటపై ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఆకు మగ్గి నీరు బయటకు వస్తున్నప్పుడు, మంటను మీడియం ఫ్లేమ్‌లోకి మార్చి మరో 2 నిమిషాలు ఫ్రై చేయాలి. చుక్కకూర కాడలతో సహా బాగా మగ్గి పేస్ట్‌లా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి, దానిని పూర్తిగా చల్లారనివ్వాలి.
పొడి సిద్ధం చేయడం:
ఒక మిక్సీ జార్ తీసుకొని మొదట వేయించి పెట్టుకున్న నువ్వులు, ఎండుమిర్చి వేసి ఫైన్ పౌడర్ (మెత్తటి పొడి) లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత చల్లారిన చుక్కకూరను రోట్లో వేసి దంచుకోవచ్చు లేదా మిక్సీ జార్ లో వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా బ్లెండ్ చేసి పెట్టుకోవాలి.
తాలింపు పెట్టడం:
స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ నూనె వేయాలి. నూనె వేడెక్కాక తాలింపు గింజలు (శెనగపప్పు, మినహప్పప్పు, ఆవాలు, జీలకర్ర) వేయాలి. ఆ తర్వాత దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఒక ఎండుమిర్చి ముక్క, కొద్దిగా కరివేపాకు వేసి వేయించాలి. తాలింపు కాస్త వేగాక, సన్నగా పొడవుగా కోసిన ఉల్లిపాయ ముక్కలను వేసి బాగా ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటేనే పచ్చడికి మంచి రుచి వస్తుంది. ఉల్లిపాయలు వేగాక, మనం సిద్ధం చేసుకున్న చుక్కకూర పేస్ట్, అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి-నువ్వుల పొడిని కూడా అందులో వేసేయాలి. అన్నీ వేసాక ఒకసారి బాగా కలుపుకుని, రుచికి సరిపడా ఉప్పును కూడా చేర్చుకోవాలి. అంతా మిక్స్ చేసుకుని ఉప్పు సరిపోయిందో లేదో రుచి చూసి అవసరమైతే మరికొంచెం వేసుకోవచ్చు. ఉప్పు వేసిన తర్వాత సన్నని మంటలో ఒక రెండు నిమిషాల పాటు పచ్చడిని బాగా కలుపుకుంటూ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే.. ఎంతో రుచికరమైన, నోరూరించే చుక్కకూర పచ్చడి సిద్ధం.
